Best Cars: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో రకరకాల ఫీచర్లతో మార్కెట్ ల్లోకి కార్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో కార్ల వినియోగం బాగా పెరగగా దానికి తగ్గట్లుగానే ఆయా సంస్థలను కార్లను సరసమైన ధరలకే అందిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొదటి సారి కార్లను కొనుగోలు చేయాలని భావించే వ్యక్తులు తాము అనుకున్న బడ్జెట్ లో లభించాలని చూస్తుంటారు.
మరో నాలుగు రోజులు ఆగితే కొత్త సంవత్సరం వస్తుంది. న్యూ ఇయర్ లో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఏంటి అనుకుంటున్నారా? రూ.10 లక్షల కంటే తక్కువ ధరతో 2024లో మార్కెట్ లోకి కొన్ని కార్లు రానున్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
కియో సోనెట్ ఫేస్ లిఫ్ట్…జనవరిలో భారత మార్కెట్ లోకి సోనెట్ ఫేస్ లిఫ్ట్ రానుంది. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమేకర్, కియా ఈ కొత్త మోడల్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. దీన్ని ఆన్ లైన్ లో రూ.20 వేలు టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కాగా ఈ కారు ప్రారంభ ధర రూ.8 లక్షలుగా ఉంది.
ఆల్ -న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్… 2024 మొదటి త్రైమాసికంలో భారత మార్కెట్ లోకి మారుతి సుజుకి స్విఫ్ట్ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. 1.2 L DOHC ఇంజిన్ ను కలిగి ఉండనున్న ఈ కారు పెట్రోల్, హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ లను అందించనుంది. 82 bhp శక్తితో పాటు 108 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
స్విఫ్ట్ తో పాటు మారుతి సుజుకి కొత్త తరం డిజైర్ సబ్-4 మీటర్ సెడాన్ ను కూడా మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ సెడాన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలతో హైబ్రిడ్ టెక్నాలజీతో 1.2 L 3 -సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్.. 2024లో టాటా మోటార్స్ ఈ ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ను తీసుకురానుంది. సుమారు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, 7 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో పాటు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది. అలాగే కొత్త 125 bhp, 1.2L డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్ లేదా రేసర్ ఎడిషన్ 120 bhp, 1.2L టర్బో పెట్రోల్ ఇంజన్ ను అందించే అవకాశం ఉంది.
తరువాత నిస్సాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్.. 2024 మధ్యలో మాగ్నైట్ సబ్ -4 మీటర్ ఎస్యూవీకి ప్రధాన అప్ డేట్ ను అందించనుంది. దాంతో పాటు కంపెనీ కొత్త మాగ్నైట్ ను మెక్సికో వంటి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్ లకు ఎగుమతి కూడా చేయనుందని తెలుస్తోంది.