Tummala Nageswara Rao: రాజకీయాల్లో పరస్పర అవసరాలే ఉంటాయి. నీకు అది అవసరం.. నాకు ఇది అవసరం…ఈ పారా మీటర్ ఆధారంగా నే సాగుతూ ఉంటాయి. ఇందులో ఎవరూ పత్తిత్తులు కాదు. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు భారత రాష్ట్ర సమితికి అంటి ముట్టనట్టే ఉంటున్నారు. పైగా పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానం అందలేదు. మొన్న ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా తుమ్మలకు ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.. అధిష్టానానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకపోయినప్పటికీ… దరిదాపు అలాంటి ఇండికేషన్లే ఇచ్చారు.

ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసనగళం వినిపించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. ఈ క్రమంలో పొంగులేటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తన బలాన్ని ప్రదర్శిస్తున్నారు.. ఇదే సమయంలో జనవరి 18న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి అనుకుంటున్నది.. ఇదే వేదికగా నేషనల్ ఫార్మర్ డిక్లరేషన్ ను కెసిఆర్ ప్రకటిస్తారని భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో సభ విజయవంతానికి భారత రాష్ట్ర సమితి శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.. అయితే గత కొద్ది రోజులుగా అలక పాన్పు ఎక్కిన తుమ్మల నాగేశ్వరరావును భారత రాష్ట్ర సమితి నాయకులు బుజ్జగిస్తున్నారు. ఇటీవల హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావు స్వగృహం గండుగలపల్లి వెళ్లారు. అక్కడ ఆయన ఇంట్లో భోజనం చేశారు.. తర్వాత మరుసటి రోజు కొత్తగూడెంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేసీఆర్.. తుమ్మల నాగేశ్వరరావు ను ఆప్యాయంగా పలకరించారు.. అయితే పాలేరు సీటు తనకే ఇవ్వాలని కొద్ది రోజులుగా తుమ్మల నాగేశ్వరరావు కోరుతూ వస్తున్నారు. అయితే ఆ సీటు విషయంలో కెసిఆర్ స్పష్టత ఇవ్వడంతోనే తుమ్మల మళ్లీ ఆయన ఫోల్డ్ లోకి వెళ్లారని తెలుస్తోంది.

తుమ్మల నాగేశ్వరరావు ను గతంలో కూడా ఇలానే అనునయించారు. పలు సందర్భాల్లో ఆయన వ్యవసాయ క్షేత్రానికి హరీష్ రావు వెళ్లారు. పాలేరు ఓటమి అనంతరం ఆత్మ రక్షణలో పడిన తుమ్మల నాగేశ్వరరావు.. ఆ నియోజకవర్గంలో బలోపేతం అయ్యేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అనుచరుల నుంచి నిరసన వ్యక్తం అయింది. ఈ సమయంలో పార్టీ అధిష్టానం ఆయనకు అంతగా సపోర్ట్ ఇవ్వలేకపోయింది. అయితే అప్పట్లో తుమ్మల పార్టీ మారుతారని వ్యాఖ్యలు వినిపించాయి. ఆ సమయంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఆయనతో మంతనాలు జరిపారు. ఇప్పుడు కూడా అదే పల్లవి పాడుతున్నారు. మరి ఈసారైనా తుమ్మలకు గట్టి హామీ లభిస్తుందా? లేదా అనేది మరికొద్ది రోజులు ఆగితే గాని తెలుస్తుంది. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఉన్న నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు వాడుకొని వదిలేసేందుకే కెసిఆర్ రంగంలోకి హరీష్ ను దింపారనే చర్చ కూడా నడుస్తోంది.