TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. భక్తులకు మొబైల్ వసతి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా రెండు మొబైల్ కంటైనర్ లను ఏర్పాటు చేశారు. టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి వాటిని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని మొబైల్ కంటైనర్లను అందుబాటులో తేనున్నట్లు ఆయన ప్రకటించారు.
విశాఖకు చెందిన మూర్తి అనే దాత ఈ రెండు కంటైనర్లను సమకూర్చారు. వీటి విలువ 25 లక్షల రూపాయలు. భక్తులు బస చేసేందుకు పరుపులు, స్నానపు గది, మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం తిరుమలలో పాత విశ్రాంతి గృహాలకు మరమ్మత్తులు చేపడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ వసతి కంటైనర్లు భక్తులకు ఉపయోగపడతాయని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి.
సాధారణంగా శ్రీవారి దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. రద్దీ సమయంలో రోజులకు మించి భక్తులు వేచి ఉండాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఈ వసతి మొబైల్ కంటైనర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే భవిష్యత్తులో ఈ వసతి మొబైల్ కంటైనర్ లను మరిన్ని ఏర్పాటు చేయాలని టిటిడి పాలకవర్గం ఆలోచన చేస్తోంది.
శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణి ని నెలరోజులపాటు మూసివేయునన్నట్లు టిటిడి తెలిపింది. నీటి శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఒకటి నుంచి 31 వరకు పుష్కరిణిని మూసివేస్తారు. నెలరోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి వర్గాలు కోరాయి.