Pawan Kalyan Alliance: పవన్ ద్విముఖ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. వైసిపి విముక్త ఏపీ ప్రధాన ధ్యేయం. తాను అధికారంలోకి రావాలనేది లక్ష్యం. ఈ రెండింటి కోసమే ఎక్కువగా తపన పడుతున్నారు. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపి, బిజెపితో కలిసి నడవాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఓట్లు,సీట్లు పెంచుకోవాలని భావిస్తున్నారు. తద్వారా సుదీర్ఘకాలంగా తన వెంట నడుస్తున్న వారికి న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు సీఎం పోస్టుతో పని లేదని చెప్పుకొచ్చారు. ప్రజలు బలంగా కోరుకుంటే తప్పకుండా సీఎం అవుతానని సర్ది చెప్పుకుంటూ వచ్చారు.అయితే ఇక్కడే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
జగన్ తో పాటు వైసిపి నేతలపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించడంతో పవన్ టిడిపి శ్రేణులకు ఒక ఆశాదీపం లా కనిపిస్తున్నారు. తమ అధినేత చంద్రబాబు తో పాటు సమానంగా పవన్ ను గౌరవిస్తున్నారు. వచ్చే ఎన్నికలతో చంద్రబాబు వయసు దృష్ట్యా రాజకీయాలనుంచి విరమించక తప్పని పరిస్థితి. అప్పుడు టిడిపి శ్రేణులకు బలమైన నాయకత్వం అవసరం. జగన్ను వ్యతిరేకించే టిడిపి శ్రేణులు పవన్ వైపు టర్న్ అవుతాయి. ఈ ఆలోచనతోనే పవన్ తన అడుగులు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. టిడిపి తో స్నేహాన్ని కోరుకుంటుండడం అందులో భాగమే.
వచ్చే ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ సీట్లు తెచ్చుకోవడం పవన్ లక్ష్యం. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతుంది. పార్టీకి కనీస ప్రాతినిధ్యం ఇప్పుడు అవసరం. ఒకవేళ చంద్రబాబు అధికారం చేపడితే పక్కనే ఉండాలన్నది పవన్ అభిమాతం.చంద్రబాబు లోపాలను ప్రశ్నించడం ద్వారా ప్రజల్లో తన నాయకత్వాన్ని పెంచుకోవడంతో పాటు జగన్కు తానే ప్రత్యామ్నాయమని చూపించడం ముఖ్య ఉద్దేశ్యం. తద్వారా 2029 ఎన్నికల్లో ఒంటరి పోరుతో గద్దె నెక్కలన్న సుదీర్ఘ ఆలోచనతోనే పవన్ రాజకీయం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.