https://oktelugu.com/

లంచాలు తీసుకోవడం ఎందుకు..? కరెన్సీని కాల్చడం ఎందుకు..?

లంచాలు తీసుకోవడం.. కోట్లాది కోట్ల రూపాయలు కూడబెట్టడం. లేదంటే ఏసీబీ వారికి ఎక్కడ దొరికిపోతామోనని వాటిని స్టౌ వెలిగించి తగలబెట్టడం. ఇదీ ప్రస్తుతం అవినీతి అధికారులు నేర్చుకున్న తీరు. ఏ డబ్బులంటే వీరికి లెక్కలేదా..? లంచాల కోసం పేద, ధనిక అంటూ తేడా లేకుండా పీడించుకు తిని వసూలు చేసే వీరు.. డబ్బులను ఇలా కాలబెట్టడం ఏంటి..? అవినీతిని చేయడం ఎందుకు..? ఇలా దొరికిపోతామని కరెన్సీని కాలబెట్టడం ఎందుకు..? ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్నలివి. మధ్యప్రదేశ్‌లో ఓ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 7, 2021 / 01:49 PM IST
    Follow us on


    లంచాలు తీసుకోవడం.. కోట్లాది కోట్ల రూపాయలు కూడబెట్టడం. లేదంటే ఏసీబీ వారికి ఎక్కడ దొరికిపోతామోనని వాటిని స్టౌ వెలిగించి తగలబెట్టడం. ఇదీ ప్రస్తుతం అవినీతి అధికారులు నేర్చుకున్న తీరు. ఏ డబ్బులంటే వీరికి లెక్కలేదా..? లంచాల కోసం పేద, ధనిక అంటూ తేడా లేకుండా పీడించుకు తిని వసూలు చేసే వీరు.. డబ్బులను ఇలా కాలబెట్టడం ఏంటి..? అవినీతిని చేయడం ఎందుకు..? ఇలా దొరికిపోతామని కరెన్సీని కాలబెట్టడం ఎందుకు..? ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్నలివి.

    మధ్యప్రదేశ్‌లో ఓ అవినీతి అధికారి ఏసీబీ వాళ్లు వస్తున్నారని ఇంటి తలుపు వేసి.. స్టౌ వెలిగించి.. రూ.ఆరు లక్షల విలువైన నోట్లను తగలబెట్టేశారు. ఈ దృశ్యాలు కొద్ది రోజుల కిందట సంచలనం అయ్యాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలోనూ కనిపించింది. కల్వకుర్తిలో ఓ టీఆర్ఎస్ నేత ఏసీబీ అధికారులు వస్తున్నారని రూ.5 లక్షలు తగులబెట్టేశాడు. వెల్దండ తహసీల్దార్ తరపున ఆయన ఆ లంచం తీసుకున్నాడు. ఇద్దరూ దొరక్కూడదని ఆ నగదుని బుగ్గి చేయాలనుకున్నారు. రెండుచోట్లా.. వారు తగులబెట్టాలనుకున్నది లంచం సొమ్మునే.

    ప్రభుత్వ ఉద్యోగి అంటే లంచం తీసుకోవడం తమ హక్కు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రజలు పన్నులుగా కడుతున్న వాటి నుంచే తాము జీతాలుగా తీసుకుంటున్నామన్న విషయాన్ని మర్చిపోయి తమ విధి నిర్వహణ అయిన పౌరసేవలు చేయడానికి కూడా ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు అధికారులు. ఏదైనా ఆస్తులకు సంబధించిన వ్యవహారం అయితే.. విధిగా చేయాల్సిన పనిని కూడా చేయకుండా.. ఆ ఆస్తుల్లో వాటాలు తీసుకునేంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఏర్పడ్డాయి. చివరికి పుట్టిన తేదీ ధృవపత్రం కావాలన్నా లంచం సమర్పించుకోవాల్సిందే.

    ఆన్‌లైన్‌ సేవలంటూ ఎన్ని వచ్చినా.. ఎన్ని ఏసీబీ దాడులు జరిగినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. లంచావతారాలు వెనక్కి తగ్గడం లేదు. చివరికి తాము పీడించి తీసుకునేది అయినా తీసుకుంటాం కాలం కలిసి రాకపోతే తగలబెట్టేస్తామని నిరూపిస్తున్నారు. కానీ.. అవినీతి విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. దేశంలో అవినీతికి పాల్పడి అయినా సరే బాగా డబ్బులు సంపాదించిన వాడిని హీరోలుగా చూస్తున్న సమాజం వచ్చేసింది. ఫలితంగా ఎవరూ దోపిడీ చేసి.. ప్రజల్ని పీడించి డబ్బులు సంపాదించడాన్ని తప్పుగా భావించడం లేదు. వ్యవస్థలో మార్పులు రావాలంటే ముందుగా ప్రజల్లో మార్పు రావాలి. తన పని చేస్తే చాలు ఎంతో కొంత సమర్పించుకుంటాననే భావన నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలి. పౌరసేవలు మాత్రమే కాదు ప్రభుత్వ కార్యాలయంలో ఏ సేవ అయినా ఉచితంగా పొందాలి. ప్రజల్లో మార్పు వస్తే క్రమంగా సమాజంలో మార్పు వస్తుంది. లేకపోతే.. అవినీతి పరులు ఇలా డబ్బులు సంపాదించి కాల్చేస్తూనే ఉంటారు.