మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం రోజుకో మలుపు తీరుగుతోంది. ఈటలను కట్టడి చేయడానికి కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయన మార్గంలో తేడా ఏం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన సమీకరణలు సైతం అదే రీతిలో మారుతున్నాయి. సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుకు అనుగుణంగానే ఈటల తన పంథా మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల కదలికలు గుర్తిస్తూ తన వైఖరిలో మార్పులు చేసుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఈటలను ఎలాగైనా దెబ్బ కొట్టాలనే విషయంలో నానా హంగామా సృష్టిస్తున్న కేసీఆర్ రాజకీయ చతురత వినియోగిస్తున్నారు. ఈటలను కట్టడి చేయడానికి మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే మంత్రి గంగులకు బాధ్యతలు అప్పగించగా ఆయన సరిగా మెప్పించలేకపోయారు. దీంతో రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు సైతం బాధ్యతలు అప్పగించినట్తు తెలిసింది.
ఈటలకు చెక్ పెట్టడానికే..
ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యంపై చెక్ పెట్టడానికే గులాబీ నేతలు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రాంతం హుజురాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాగైనా రాజకీయ భవితవ్యం ఉండకూడదనే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. హుజురాబాద్ ప్రాంతంపై పట్టున్న ఈటలను ఢీకొట్టగల నాయకుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఎలాగైనా ఉపఎన్నికతో రాజేందర్ ను ఇంటికి పంపాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో హుజురాబాద్ లో చక్రం తిప్పగల నాయకుడి కోసం అధికార పక్షం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు పేర్లు వినిపిస్తున్నా వారిలో ఎవరు సమర్థులో అనే దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈటలన దెబ్బకొట్టగల నేత కోసం గాలిస్తున్నారు.
కోరిక తీరేనా?
హుజూరాబాద్ లో ఈటలకు చెక్ పెట్టడానికి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు పరాకాష్టకు చేరాయి. ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఈటలను ఎదుర్కొనే సత్తా గల నేత ఎవరున్నారనే విషయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సరైన నేతగా గుర్తించినా ఇంకా ఆయన పేరు ఖరారుపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇంకా సమర్థత కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. ఈటల రాజేందర్ ను రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలనే నిర్ణయంలో భాగంగానే ఈ మేరకు పలు కీలక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనపై ఆరా
ఈటల రాజేందర్ శని, ఆది వారాల్లో ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని తెలిసింది. దీంతో అధికార పార్టీ ఈ పర్యటనపై దృష్టి నిలిపింది. ఈటల ఎందుకు ఢిల్లీ వెళుతున్నారు? అక్కడ ఎవరిని కలుస్తారు? ఏ మేరకు ప్రభావితం చేస్తారు అనే విషయాలను గురించి ఆరా తీస్తున్నారు. ఈటల రాజేందర్ అధికార పార్టీకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. మంత్రిగా తొలగించిన తరువాత తొలిసారి ఢిల్లీ పర్యటన చేయడంతో అందరి దృష్టి ఆయన పర్యటనపై కేంద్రీకృతమైంది.