TRS MLA`s : అనుకున్నదే అయ్యింది. మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలుమాల్ అని కోర్టులో వీగిపోయింది. ముగ్గురు నిందితుల విడుదలకు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలు ముడుపుల మొత్తం లేనందున ఎలా నిందితులుగా పేర్కొంటారని రిమాండ్ ను తిరస్కరించి టీఆర్ఎస్ సర్కార్ కు.. పోలీసులకు గట్టి షాక్ ఇచ్చింది కోర్టు. బీజేపీ నేతల ఆరోపించినట్టే జరగడంతో ఈ వ్యవహారంలో అందరి వేళ్లు ఇప్పుడు టీఆర్ఎస్ వైపే చూపిస్తున్నాయి.
ఎమ్మెల్యేల డ్రామా ఒట్టి బుర్రకథ అని కోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ సాగిన వ్యవహారంపై ఏసీబీ న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఆధారాలే లేనప్పుడు కేసులు ఎలా నమోదు చేస్తారని పోలీసులు ప్రశ్నించారు.
ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్.. యాక్ట్ కేసు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వర్తించదని కోర్టు తేల్చిచెప్పింది. ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు వంద కోట్ల రూపాయలు ఆఫర్ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వాదన ఏసీబీ కోర్టు ఆదేశాలతో ఒట్టి కట్టుకథ అని నిరూపితమైంది.
కేసులో అసలు ఆధారమైన పట్టుబడ్డ డబ్బులు, లంచం అమౌంట్ ను పోలీసులు చూపింకపోవడమే ఈ కేసు వీగిపోవడానికి ప్రధాన కారణం అని ఏసీబీ కోర్టు పక్కనపెట్టింది. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు వెంటనే బెయిల్ మంజూరు చేసి 41 సీఆర్.పీసీ నోటీస్ ఇచ్చి విచారించాలని పోలీసులకు ఏసీబీ న్యాయమూర్తి సూచించారు. దీంతో పట్టుబడ్డ రామచంద్రభారతి, నందకుమార్, సింహాచలం రిమాండ్ తిరస్కరణకు గురైంది. పోలీసులు కేసులో పెట్టిన సెక్షన్లకు ఆధారాలు లేవంటూ ప్రకటించింది. ముగ్గురు నిందితులను తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది.కేసులో అరెస్ట్ చేసిన విధానాన్ని సైతం కోర్టు తప్పుపట్టడం టీఆర్ఎస్ సర్కార్ కు మింగుడుపడని వ్యవహారంగా మారింది.
ఏసీబీ కోర్టు తీర్పుతో ఇన్నాళ్లు చెలరేగిపోయిన టీఆర్ఎస్ నేతల నోళ్లకు తాళం పడ్టట్టు అయ్యింది. ఇప్పుడు దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. మసిపూసి మారేడుకాయ చేద్దామనుకున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాలి.
నిజానికి డబ్బుల కట్టలు చూపిస్తే ఈడీ, సీబీఐ రంగంలోకి దిగుతుంది. కేసు మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళుతుందనే భయంతోనే పోలీసులు రాష్ట్రపరిధిలో కేసు ఉంచాలని ఇలా వ్యవహరించారు. కానీ కోర్టులో వీగిపోవడంతో పోలీసులకే అంతిమంగా చెడ్డ పేరు వచ్చింది. దీనిపై కేంద్రం పెద్దలు జోక్యం చేసుకుంటే కథ వేరేలా మారుతుంది. టీఆర్ఎస్ సర్కార్, పోలీసులు ఇరుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.