2000 Notes Withdraw: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. 2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం పింక్ పార్టీ నాయకులకు ఎక్కడా లేని కష్టాలు తెచ్చిపెడుతోంది. పైకి అధికార పార్టీ మీడియాలో, అధికార పార్టీ నాయకుల చర్చల్లో మేకపోతు గాంభీర్యం కనిపిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. ఇదంతా జరుగుతుండగానే అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు పెద్ద నోటు ఉపసంహరణ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
కంపెనీల యజమానులకు వేడుకలు
ఆయన దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి. గతంలో ఓ పార్టీలో ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమ ఉండేది. భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత ఆయన ఒక్కసారిగా ఎదిగిపోయారు. ముఖ్యమైన మంత్రికి అత్యంత సన్నిహితుడైపోయారు. హైదరాబాదు నగర శివారులో భారీగా భూములు కొన్నారు. ముఖ్యంగా కోకాపేట ప్రాంతంలో భారీగా వెంచర్లు వేశారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో నేలమాలిగల్లో 2000 నోట్లు భారీగా డంపు చేశారు. వచ్చే ఎన్నికలకు మిగతా సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా జరుగుతుండగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. దీంతో ఆ ప్రజాప్రతినిధికి షాక్ తగిలినట్టయింది. సెప్టెంబర్ దాకా గడువు ఇచ్చిన నేపథ్యంలో ఆ నోట్లను మార్చుకునేందుకు ఆ పింక్ పార్టీ నాయకుడు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ కంపెనీల యజమానులకు ఫోన్లు చేసి తన వద్ద ఉన్న నోట్లను వారికి పంపిస్తున్నాడు.”మీరు ఏమైనా చేయండి. దయచేసి ఈ నోట్లు మాత్రం మార్చే ప్రయత్నం చేయండి. మీరు ఎన్నికలకు ఒక నెల ముందు డబ్బులు ఇస్తే నాకు సరిపోతుంది. ఇచ్చే డబ్బులు కూడా మొత్తం ఒకేసారి వద్దు. డబ్బులు మార్చినందుకు కొంత కమిషన్ తీసుకోండి.. ఈ ఎన్నికల కష్టం నుంచి నన్ను ఎలాగైనా గట్టెక్కించండి అంటూ” ప్రాధేయపడుతున్నట్టు తెలిసింది. అంతేకాదు తన సంస్థలో పనిచేసే వారి ద్వారా కూడా ఆ 2000 నోట్లను మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
పాపం ఈ నాయకుడు
ఇక మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకుడి పరిస్థితి అలా ఉంటే.. హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. ఈయన సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ట్రెండింగ్లో నిలిచారు. భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫోన్లు చేసి తన వాటా పంపియమని బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఈ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం భారీగా 2000 నోట్లను భద్రపరిచాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకేసారి అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు వాటిని ఏం చేయాలో తెలియక మదనపడుతున్నాడు. ఇదే సమయంలో తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనం కింద ఆ రెండు వేల నోట్లు ఇస్తున్నాడు. అంతేకాదు ఉద్యోగులకు రోజు 20 వేల వరకు 2000 నోట్లు ఇస్తూ బ్యాంకుల్లో మార్చుకు రావాలని ఆదేశాలు ఇచ్చాడు. తన సంస్థల్లో సుమారు 20,000 మంది చేస్తున్న నేపథ్యంలో.. అందరికీ కూడా మౌఖికంగా ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుతం ఆ ఉద్యోగులు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లకుండా.. బ్యాంకులకు వెళ్లి డబ్బులు మార్చుకొని సాయంత్రం సదరు ప్రజా ప్రతినిధి సంస్థల్లోని అకౌంట్ సెక్షన్ లో అప్పగిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ ప్రజా ప్రతినిధి వద్ద ఇంకా కోట్లలో 2000 నోట్లు ఉన్నాయని ఆయన వద్ద పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్న నాటి నుంచి ఆ ప్రజా ప్రతినిధి కంటిమీద రెప్ప కూడా చేయడం లేదని ఆయన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు. ఇక ఈ ఇద్దరు ప్రజాప్రతినిధుల పింక్ బాధలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. వెలుగులోకి రాని వారి పింక్ బాధలు ఇంకా చాలా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు ఉండగానే ఇలాంటి కథలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో?!