Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ అంటే అలానే ఉంటుంది మరీ..

వెంకటేశ్వరరావు నుంచి భూమిని ఎలాగైనా వెనక్కి తీసుకోవాలని వల్లభనేని వంశీ ఫిక్సయ్యారు. ఇటీవల నేరుగా ఎమ్మెల్యే వంశీనే ఆ భూమిలోకి వెళ్లి, దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని, అక్కడ ఉన్న షెడ్లు కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.

Written By: Dharma, Updated On : June 6, 2023 12:36 pm

Vallabhaneni Vamsi

Follow us on

Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు సిసలైన రాజకీయానికి తెరలేపారు. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ దూకుడు పెంచారు. రాజకీయ ప్రత్యర్థులను తన రూట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తనకు కంటిలో నలుసుగా ఉన్న టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని జేసీబీ సంస్కృతికి తెరదీస్తున్నారు. గట్టి హెచ్చరికలే పంపుతున్నారు. తన మనుషులైతే ఎన్ని అక్రమాలైనా సక్రమంగా భావిస్తున్నారు. అదే ప్రత్యర్థులైతే చిన్నపాటి లొసుగు ఉన్నా వారిపైకి జేసీబీ దూసుకెళ్లాని పురమాయిస్తున్నారు. . వైసీపీ నేతలు అడ్డగోలుగా ఆక్రమణలకు పాల్పడినా ఎమ్మెల్యే కంటికి ఇంపుగానే కనిపిస్తుండగా టీడీపీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలపై మాత్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.

తాజాగా గన్నవరం టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావును టార్గెట్ చేసుకున్నారు. ఆయన చెందిన డీపట్టా భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించడంతో పాటు వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది.వెదురుపావులూరుకు చెందిన జాస్తి నాగేశ్వరరావుకు అదే గ్రామంలోని సర్వేనంబరు 308.4లో 99 సెంట్ల డీపట్టా భూమిని సాగు కోసం రెవెన్యూ అధికారులు ఇచ్చారు. అదే భూమిని ఆయన కుమారుడు జాస్తి వెంకటేశ్వరరావు సాగు చేసుకుంటున్నారు. వెంకటేశ్వరరావు టీడీపీ గన్నవరం మండలాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వంశీ వేధింపుల్లో భాగంగా వెంకటేశ్వరరావు భూమిపై కన్నేశారు. ఆ భూమిని ఎలాగైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ ఆయన రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెంకటేశ్వరరావు భూమిలో ఇది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు.

అయితే వెంకటేశ్వరరావు నుంచి భూమిని ఎలాగైనా వెనక్కి తీసుకోవాలని వల్లభనేని వంశీ ఫిక్సయ్యారు. ఇటీవల నేరుగా ఎమ్మెల్యే వంశీనే ఆ భూమిలోకి వెళ్లి, దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని, అక్కడ ఉన్న షెడ్లు కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. జాస్తి వెంకటేశ్వరరావుకు ఇచ్చిన డీ పట్టాను రద్దు చేస్తున్నట్టు కలెక్టర్‌ ఇచ్చిన నోటీసును అందజేసి, రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా వెళ్లి జేసీబీతో షెడ్లను కూల్చి వేశారు. దీనిపై వెంకటేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు, గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వైసీపీ నేతలు కళ్లెదుటే ఆక్రమణలకు పాల్పడుతున్నా పట్టించుకొని అధికారులు దాష్టీకం ప్రదర్శిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హారతులిచ్చి గెలిపిస్తే.. వంశీ తమపై అక్కసు తీర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వల్లభనేని వంశీ గెలుపొందిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన పార్టీ ఫిరాయించారు. వైసీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కానీ ఈ విషయంలో జాస్తి వెంకటేశ్వరరావు వంశీతో విభేదించారు. వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీలోనే ఉండిపోయారు. ఇది వంశీకి మింగుడుపడలేదు. అందుకే ఎలాగైనా వెంకటేశ్వరరావు భూమిని వెనక్కి తీసుకోవాలని చూశారు. ఎప్పుడో 1999 కాలం నాటి కోర్టు తీర్పును ప్రమాణికంగా తీసుకొని డీ పట్టా భూమిని వెనక్కి తీసుకునేందుకు డిసైడయ్యారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.