
Vangaveeti Radha: ఇప్పుడు సరికొత్త ప్రచార సాధనం సోషల్ మీడియా. ఎవరినైనా అందలమెక్కించాలన్నా.. కిందకు తోసేయాలన్న సోషల్ మీడియాదే కీ రోల్. అప్పుడెప్పుడో నరేంద్ర మోదీ దేశ రాజకీయాల్లో ఎంటరవుతున్న వేళ సోషల్ మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. భావి నాయకుడిగా గుర్తించి ప్రాచుర్యం ఇచ్చింది. దాని ప్రభావంతోనే మోదీ తన నాయకత్వ లక్షణాలను మెరుగుపరచుకొని దేశంలోనే అతీతమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. అంతెందుకు గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా మారింది. అప్పటి చంద్రబాబు సర్కారుపై విషం చిమ్మడంలోనూ.. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడింది. దాని ఫలింతగానే వైసీపీ కనివినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే అన్ని రాజకీయ పక్షాలు సోషల్ మీడియా విభాగాను బలోపేతం చేసుకుంటున్నాయి. అనుబంధ విభాగాల్లో ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నాయి.
అయితే తమ సొంత పార్టీ విధానాలపై ప్రచారం చేసుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు ప్రత్యర్థులపై సైతం విషం చిమ్ముతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఏడేళ్ల కిందట మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తన 60 సంవత్సరాల రాజకీయ ప్రస్తానంపై ఒక పుస్తకం రాసుకున్నారు. అందులో వంగవీటి మోహన్ రంగా హత్య కేసులో టీడీపీకి పాత్ర ఉందని ఆరోపిస్తూ తన స్వియ అనుభవాలను రాసుకొచ్చారు. నాడు అధికారంలో ఉన్న టీడీపీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేవలం పుస్తకాలు అమ్ముకోవడానికే ఇటువంటి సంచలన కామెంట్స్ చేస్తున్నారని విమర్శించింది. దీనికి నాడు హరిరామ జోగయ్య ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. అయితే ఎప్పుడో ఏడేళ్ల కిందట నాటి కామెంట్స్ ను గుర్తుచేస్తూ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. నాటి పత్రికల క్లిప్పింగ్ లను జతచేసి సోషల్ మీడియాలో విడుదల చేసింది. దాని వంగవీటి రాధా చిత్రాన్ని జతచేసి తెలివైన కాపువాడు తెలుగుదేశంలోనే అంటూ ఒక కామెంట్ ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
వంగవీటి రాధాక్రిష్ణ చాలా రోజులుగా పార్టీ మారతారన్న ప్రచారం ఉంది. జనసేనలో చేరతారని భావించారు. అటు తను సన్నిహితంగా ఉంటున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా వర్కవుట్ కాలేదన్న టాక్ నడిచింది. అయితే రాధా మాత్రం తాను ఎక్కడకు వెళ్లడం లేదని.. టీడీపీలో కొనసాగుతానని సంకేతాలిచ్చారు. లోకేష్ ను కలిసి చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటించారు. పవన్ కూడా రాధాను అడ్డుకున్నారని.. అదంతా కాపులు, కమ్మల సమన్వయం కోసమేనంటూ వార్తలు వస్తున్నాయి. రాధా పార్టీ మారడంపై ఆశలు పెట్టుకున్న వైసీపీ ఈ కొత్త ప్రచారానికి తెరతీసింది. అటు చేగొండి వ్యాఖ్యలు, రాధా బొమ్మలతో హల్ చల్ చేస్తోంది.
జనసేన పదో ఆవిర్భావ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాపు సంక్షేమ సంఘ నాయకుడైన హరిరామజోగయ్య పవన్ ను కలవనున్నారు. వచ్చే ఎన్నికలే ధ్యేయంగా కొన్ని కీలక సూచనలు చేయనున్నారు. హరిరామజోగయ్య జనసేనలో చేరకున్నా.. కాపు సంక్షేమ సంఘం తరుపున మద్దతు పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ను సీఎంగా చూడాలని భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు విచ్ఛిన్నమయ్యేలా నాటి హరిరామజోగయ్య మాటలను గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అటు రాధా, ఇటు హరిరామజోగయ్యను టార్గెట్ చేసుకున్నారన్న మాట.