Homeఆంధ్రప్రదేశ్‌అమావాస్య చంద్రులు..!

అమావాస్య చంద్రులు..!

KCR and Chandrababu
“రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే..!” ఇదీ పాలిటిక్స్ లో పురాతన నానుడి. నాయకులను అందలం ఎక్కించే వారి నిర్ణయాలే.. తేడా వస్తే, వారిని అథ:పాతాళానికి కూడా తొక్కేస్తాయి. ఇప్పుడు ఈ సామెత.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చాణక్యులుగా పేరొందిన ఆ ఇద్దరు చంద్రుల పరిస్థితికి సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: మోదీని పొగుడుతూ కేసీఆర్ లేఖ.. వ్యూహంలో భాగమేనా?

రాజకీయ చదరంగంలో ప్రతీ అడుగూ ఆచితూచి వేయాలి. ఏ మాటునుంచి, ఎవరు, ఎలా దాడి చేస్తారో తెలియదు. ఓవైపు వాటిని ఎదుర్కొంటూనే.. నాయకులు తమ ప్రణాళికలు అమలు చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. వ్యతిరేక పరిస్థితులను సైతం తమకు అనుకూలంగా మలచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఆరి తేరినవారే. అయితే.. ఎంతటి ఉద్దండులకైనా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి అన్నట్టుగా.. ఇప్పుడు ఈ ఇద్దరు చంద్రులు కూడా అమావాస్య చంద్రులయ్యారు. కొంతకాలంగా వీరికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వీరి ఎత్తుగడలు ఫలించకపోవడంతో చిక్కుల్లో పడుతున్నారు.

రాజకీయ చాణక్యులు..
నిజానికి చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ రాజకీయ చాణక్యులే. ఎటువంటి ప్రజాకర్షణ, జనామోదం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. ఆ తర్వాత తన నిర్ణయాలతో రాజకీయ దురంధరుడిగా తనని తాను ఆవిష్కరించుకున్నారు. జాతీయ నాయకునిగా ఎదిగారు. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో కీలక సూత్రధారిగా వ్యవహరించారు. రెండుసార్లు ఏపీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక, కేసీఆర్ సైతం టీడీపీ నుంచి బయటకు వచ్చి, స్తబ్దుగా ఉన్న తెలంగాణ వాదాన్ని రగిలించి, రాష్ట్రవ్యాప్తం చేశారు. చరిత్రను మలుపు తిప్పి, రాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇలా.. వీరిద్దరూ రాజకీయ రణరంగంలో విజయం సాధించడంలో వారి నిర్ణయాలే కీలకం అని చెప్పొచ్చు. అయితే.. ప్రస్తుతం వారి రాజకీయ జీవితం మసక బారుతుండటానికి కూడా వారి నిర్ణయాలే కారణం అన్నది తాజా ఉదాహరణలు తేటతెల్లం చేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం కోల్పోగా.. ఇప్పుడు కేసీఆర్ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారు.

Also Read: ఉండవల్లి వ్యాఖ్యలు.. ఇరకాటంలో వైసీపీ నేతలు..!!

ముంచేస్తున్న భజన…
చప్పట్లు, పొగడ్తలు ఎవరికైనా వినసొంపుగా ఉంటాయి. కానీ.. వాటి శబ్దం ఎక్కువైతే మాత్రం, పక్కవారి ఆర్తనాదాలు కూడా ఆ భజనలోనే కలిసిపోతాయి. అవి తీవ్రమై, కుర్చీ ఎత్తేసే వరకూ విషయం అర్థం కాదు. ఈ ఇద్దరు చంద్రుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. మీడియాను సామదానభేద దండోపాయాలతో గుప్పెట్టో పెట్టుకోవడంలో వీరిద్దరూ ఆరితేరినవారే. ప్రధానమైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రెండూ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు బలమైన మద్దతుగా నిలిచాయి. చంద్రబాబు ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ విషయం బయటికి రాకుండా దాచేశాయి. దానివల్ల.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? అనేది కూడా బాబుకు అర్థం కాలేదు. ఫలితంగా ఘోర పరాజయం పాలయ్యారు. ఇదే విధంగా తెలంగాణలో కనుసైగతో మీడియాను శాసిస్తున్నారు కేసీఆర్. రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజావాణిని వినిపించడానికి ప్రధాన స్రవంతి మీడియా సాహసించడం లేదు. దీంతో “అన్నీ సూపర్..” అని చెప్తుండటంతో.. నిజమైన ప్రజాభిప్రాయం మరుగున పడుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు చాటిచెప్పిన వాస్తవం ఇదే.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

పద్ధతి మారాల్సిందే..
రాష్ట్రం విడిపోయినప్పుడు.. అనుభవజ్ఞుడి చేతిలో పెడితే బాగుంటుందని ఏపీ ప్రజలు సైకిల్ ఎక్కారు. కానీ.. అభివృద్ధి కన్నా.. రాజకీయాలపైనే చంద్రబాబు ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రతిపక్షమైన వైసీపీని బలహీనపరచాలనే ఎత్తుగడతో అనేకమంది ఆ పార్టీ శాసనసభ్యులను తన పార్టీలో చేర్చుకున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఈ పార్టీ ఫిరాయింపుల పర్వం, పాలనలో అవినీతిపై తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని గుర్తించిన ప్రజలు వైసీపీకి జై కొట్టారు. ఇది చంద్రబాబు స్వయం కృతం. కేసీఆర్ కూడా ప్రతిపక్షాలను పూర్తిగా బలహీనపరచాలనుకుని.. కొత్త శత్రువును తెచ్చి పెట్టుకున్నారు. బీజేపీ రూపంలో బలమైన ప్రత్యర్థిని తయారు చేసుకున్నారు. ఈ విధంగా.. ఒకప్పుడు తమను స్పాట్ లైట్ లోకి తెచ్చిన తమ నిర్ణయాలే.. ఇప్పుడు చీకట్లోకి నెట్టేస్తున్నాయి. వీరిలో చంద్రబాబు ఇప్పటికే అమావాస్య చంద్రుడిలా మబ్బుల చాటుకు వెళ్లిపోవడంతో.. ఇక, మిగిలింది కేసీఆర్ వంతే అన్నట్టుగా కనిపిస్తున్నాయి పరిస్థితులు! మరి, తెలంగాణ చంద్రుడు ఏం చేస్తాడు? రాబోయే గ్రహణాన్ని ఎలా ఎదుర్కొంటాడు? అన్నది చూడాలి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular