
రాజకీయాల్లో పాతతరం వర్సెస్ కొత్తతరం అనే చర్చ తెరపైకి వచ్చింది. పాతతరం నేతలు అందరినీ కలుపుకుపోతూ అటూ కేంద్రంలో.. ఇటూ రాష్ట్రంలో తమకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. అయితే ఆ ట్రెండ్ ను నేటితరం నేతలు కొనసాగించలేక పోతున్నారు. దీంతో చాలామంది యువ నేతలు రాజకీయాల్లో పెద్దగా రాణించకుండా కనుమరుగు అవుతుండటం ఆందోళనను రేపుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది నేతలు అటూ కేంద్రంతో.. ఇటూ రాష్ట్రంలో కీలక భూమిక పోషించారు. కేంద్రం వద్ద లాబీయింగ్ చేస్తూనే రాష్ట్రంలో సొంత ఇమేజ్ ను బిల్డప్ చేసుకున్నారు. ఇలాంటి వారిలో కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు.. టీజీ వెంకటేష్.. సబ్బం హరి.. జనారెడ్డి.. హన్మంతరావు, డీ.శ్రీనివాస్ తదితర నేతలంతా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు.
ప్రజల్లో ఉంటూనే ఒక్కోసారి ఎన్నికల్లో ఓడినప్పటికీ తమ లాబీయింగ్ ద్వారా పదవులు దక్కించుకొని రాజకీయంగా నిలదొక్కుకోగలిగారు. గల్లీ టూ ఢిల్లీ రాజకీయాలను వంటబట్టించుకునే తిరుగులేని నేతలుగా రాణించగలిగారు.అయితే ప్రస్తుతం అలాంటి నేతలు కరువు అవుతున్నారు.
ప్రాంతీయ పార్టీల హవా పెరిగిపోవడంతో నేతలంతా కేవలం నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. సీనియర్ల సలహాలను పాటించే ఓపిక నేటి యువతరానికి లేకుండా పోతుంది. ప్రాంతీయ పార్టీల్లో కొనసాగుతూ జాతీయ స్థాయిలో ఎదిగేందుకు మక్కువ చూపడం లేదు. మరోవైపు వీరంతా ప్రజా పోరాటాల కంటే కూడా పబ్లిసిటీనే నమ్ముకుంటున్నారు.
దీంతో వీరికి ఢిల్లీ స్థాయిలో పెద్దగా పరిచయాలు ఏర్పడం లేదు. కేవలం రాష్ట్రస్థాయి, నియోజక వర్గాలకే పరిమితం అవుతుండటం వీరికి మైసస్ గా మారుతుంది. ఇలాంటి నేతలు ఎన్నికల్లో ఒకసారి ఓడిపోతే వీరి భవిష్యత్ అంధకారంగా మారిపోతుంది. దీంతో వీరంతా ఎక్కువ రోజులు రాజకీయాల్లో కొనసాగలేక చతికిలబడుతున్నారు.
తాత్కాలిక ప్రయోజనాల కోసమే నేటితరం నేతలు పాకులాడుతున్నట్లు కన్పిస్తుంది. దీంతో వీరికి రాజకీయంగా ఎదుగుదల లేకుండా పోతుందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా నేటితరం నేతలు తమ వ్యూహాలను మార్చుకోవాని సీనియర్లు సూచిస్తున్నారు.
గల్లీ టూ ఢిల్లీ స్థాయికి ఎదిగినపుడే రాజకీయంగా వారి భవిష్యత్ పదికాలాలపాటు సాఫీగా కొనసాగుతుందని అంటున్నారు. లేనట్లయితే ఇలా వచ్చి అలా పోవడమే అన్నట్లుగా వారి రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మిగిలిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా దీర్ఘకాలికంగా రాజకీయాల్లో కొనసాగేలా నేటితరం నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.