Kejriwal Kodandaram: తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే దేశాన్ని ఆకర్షించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఊహకందని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఎవరూ ఊహించని ఘటన జరుగుతోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీకంటే పంజాబ్ లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ వ్యాప్తంగా చర్చీనీయాంశం అయింది.
ఆ ఉత్సాహంతో జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా తమ పార్టీ కావాలని కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా.. తొమ్మిది రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధం అయ్యారు. అందులో తెలంగాణ కూడా ఉంది. ఇప్పటికే తెలంగాణ ఆప్ పార్టీ ఇంచార్జ్‌గా సోమనాథ్ భారతిని నియమించారు. ఆయన రాష్ట్రానికి వచ్చి తెలంగాణలో ఎవరిని ముందు ఉంచి పార్టీని నడిపించాలా అని ఆలోచిస్తున్నారు.
వారికి మొదటగా కనిపించినది ఉద్యమ నేపథ్యం ఉన్న నేత. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి మన రాష్ట్రంలో ఉన్న క్రేజ్ అలాంటిది. దీంతో వారు ఉద్యమ నేపథ్యం అందరికంటే ఎక్కువగా ఉన్న కోదండరాంను తమ పార్టీకి దగ్గర చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీజేఎస్‌ను ఆప్ పార్టీలో విలీనం చేసుకుని ఆప్ నేతగా కోదండరాంను ముందు ఉంచి తెలంగాణలో బలపడాలని చూస్తున్నారంట.
టీజేఎస్ లో చాలామంది చదువుకున్న వారే కీలక నేతలుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పలువురు ఎన్నారైలు, ఉద్యోగ సంఘాల లీడర్లు, స్టూడెంట్ లీడర్స్ కేజ్రీవాల్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే టీజేఎస్ లో కీలకంగా పనిచేసిన వారంతా రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది.
ఉద్యమకారులను గ్రౌండ్ లెవల్ నుంచే తమ పార్టీలో చేర్చుకుంటే క్షేత్ర స్థాయిలో తమ పార్టీకి పట్టు ఉంటుందని కేజ్రీవాల్ భావిస్తున్నారంట. ఉద్యమకారులు చాలా వరకు కేసీఆర్ సర్కార్ మీద తీవ్ర అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వారిని టార్గెట్ చేస్తోంది ఆప్ పార్టీ. కానీ అది అయ్యే పనేనా అంటే సందేహమే.
ఎందుకంటే ఆప్ పార్టీ అంటే సౌత్ లో పెద్దగా క్రేజ్ లేదు. పైగా నార్త్ పార్టీ అనే భావజాలం తెలంగాణలో పనిచేయదు. పైగా కోదండరాం చేరినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవలేదు. ఆయన్ను యాక్టివ్ పాలిటిక్స్ లో ఎవరూ పెద్దగా గుర్తించట్లేదు. ప్రజలను ఎలాంటి ప్రభావితం చేయలేకపోతున్నారు.
ఉద్యమాన్ని నడించిగలిగారు గానీ.. ప్రజలను ఆకట్టుకోలేక పోతున్నారు. కాబట్టి ఆయన వెళ్లినా ఆప్ పార్టీకి పెద్దగా లాభం జరగకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు.