TTD: కొండ పైకి వెళ్తే గుండు కొట్టి పంపుతోంది టీటీడీ. లాభార్జనే ధ్యేయంగా ధరలు పెంచుతోంది. సామాన్యుల నడ్డి విరుస్తోంది. గుండు కొట్టించుకోక ముందే క్షవరం చేస్తోంది. భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తోంది. ఆధ్యాత్మిక సేవ కాస్త ఆదాయ వనరుగా మార్చుకుంటోంది. అద్దెగదులకు టీటీడీ పెంచిన ధరలు చూస్తే ఆశ్చర్యం భక్తుల వంతవుతుంది. ప్రైవేటు లాడ్జీలా ? టీటీడీ అతిథి గృహాలా ? అన్న అనుమానం కలుగుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం అద్దె గదుల ధరలు భారీగా పెంచేసింది. ప్రైవేటు లాడ్జీల తరహాలో ధరలు ఆకాశాన్నంటాయి. రూ. 150 ఉన్న గది ధర.. ఇప్పుడు రూ. 1700 చేసింది. రూ. 200 ఉన్న అద్దె గది ధర రూ. 2200 చేసింది. లడ్డూ ధరలను పెంచేసింది. ఇక ఆర్జీసీ ధరలు చెప్పనవసరం లేదు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి తిరుమలకు వస్తే ధరల వడ్డనతో వాతలు పెడుతోంది. ఆర్జిత సేవల టికెట్లను పెంచాలని యత్నంచి, విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. టీటీడీ తీరు, ఏపీ ప్రభుత్వ పనితీరు వివాదాస్పదంగా మారింది. లడ్డూల సంఖ్య కుదించడం కూడ భక్తులకు రుచించడం లేదు. టీడీపీ తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అద్దె గదుల పెంపు సామాన్యుల నెత్తిన భారంగా మారుతుంది. ఆర్జిత సేవల టికెట్ల రేటు పెంచితే స్థోమత ఉన్న వారు కొనుక్కుంటారు. లేనివారు ఉచిత దర్శనం చేసుకుంటారు. కానీ అద్దె గదుల విషయం అలా కాదు. ఉన్న వారి మీద, లేని వారి మీద ఒకే రకమైన ప్రభావం చూపుతుంది. ఫలితంగా సామాన్యులకు తిరుమల దర్శనం ఒక కలగా మిగిలిపోతుంది. వేల కోట్ల ఆదాయం వచ్చే టీటీడీ సామాన్యుల పై భారం మోపడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

పేదవాడికి సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉంచాలని ఆలోచించిన ఏపీ ప్రభుత్వం.. సామాన్యులకు దైవదర్శనం అందుబాటులో ఉంచాలన్న ఆలోచన లేదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సినిమా టికెట్ల పై ఉన్న శ్రద్ధ భక్తుల పై లేదా అంటూ నిలదీస్తున్నారు. దాదాపు ఒక్కసారిగా అద్దెగదుల ధరలు 1100 శాతం పెంచారు. దీంతో అద్దెగదులు సామాన్యుడికి అందని ద్రాక్షగా మారిపోతాయి. ఫలితంగా తిరుమలకు రావాలంటే హడలిపోయే ప్రమాదం ఉంది.
లడ్డూ ధరలను కూడ భారీగా పెంచేసింది. గతంలో రూ. 25 ఉన్న లడ్డూ ధర ఇప్పుడు రూ. 50కి చేరింది. రూ. 25 ఉన్న వడ ధర రూ 100 చేసింది. దీని బట్టి చూస్తే ప్రభుత్వానికి లాభార్జన మీద తప్ప భక్తుల సౌకర్యాల పై దృష్టి లేదని అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చాక మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచిన ఘనత జగన్ ప్రభుత్వానిది. ఒక్కో కుటుంబం తిరుమలకు వెళ్లి రావాలంటే కనీసం రూ. 20000 అయ్యే పరిస్థితి ఉంది. ఇంతటి భారంతో సామాన్యులు తిరుమల దర్శనం చేసుకోగలరా అని ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకోకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నాయి.