Huzurabad Bypoll: హుజురాబాద్ లో రాజీయాలు వేగం పుంజుకుంటున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ కు అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ ప్రచారంలో వెనుకబడిపోయింది. ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక అభ్యర్థిని ప్రకటించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈటల రాజేందర్ ప్రజాఆశీర్వాద యాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టారు.

కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ కూడా సరైన రీతిలో కౌంటర్ ఇస్తోంది. దళితబంధు పథకంతో దళితుల ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యేలు అంతా అక్కడే మకాం వేసి ప్రజలను కలుస్తూ తమ పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆలస్యంగా తన అభ్యర్థిని ప్రకటించింది. బల్మూరి వెంకట్ నర్సింగ్ రావును తమ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ప్రతిపాదించారు. దీంతో ఇక ప్రచారం ముమ్మరంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ సైతం విద్యార్థి సంఘం రాష్ర్ట నేతను అభ్యర్థిగా ప్రకటించడంతో అదే బాటలో కాంగ్రెస్ కూడా ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా ఉన్న నేతను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయ సారూప్యం కనిపిస్తోంది.
ఈ క్రమంలో హుజురాబాద్ లో ద్విముఖ పోటీ నెలకొంటుందని భావించినా ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంతో ఇక త్రిముఖ పోరు ఉంటుందని భావిస్తున్నారు. దీంతో హుజురాబాద్ లో ప్రచారం ఊపందుకోనుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావించి సానుభూతి ఓట్లతో విజయం సాధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఆయుధంతో రంగంలో దిగుతుందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.