Nara Lokesh: తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. దీంతో ఆయన నాయకత్వాన్ని సీనియర్లు ఆమోదించే అవకాశాలు కనిపించడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం లోకేష్ ను భవిష్యత్ నేతగా చూపించేందుకు తాపత్రయపడుతున్నారు. లోకేష్, జగన్ లు పోటీలో ఉంటే జగన్ కే ఓటర్లు మొగ్గు చూపుతారని నేతలు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. ముఖ్యమైన కార్యక్రమాలను ఆయనతోనే చేయిస్తూ బాబు పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భావినేతగా లోకేష్ ను చూపించేందుకే బాబు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో సీనియర్ల నుంచి ఎదురుదెబ్బలు తగిలే విధంగా పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. లోకేష్ అందరికంటే చిన్నవాడు కావడంతో పెద్దవారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన సంకేతాలు కూడా ఇవ్వడం ప్రారంభించారు.
ఒకవైపు జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. అభివృద్ధి పనుల జాడ కనిపించకుండా పోయినా నగదు బదిలీ పథకాలతో ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రాష్ర్టంలో రెండు పార్టీల్లో పోటీ తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ నాయకత్వంలో టీడీపీ అంత సత్తా కలిగి ఉందా అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. దీంతోనే సీనియర్లు ఆయన నాయకత్వాన్ని విశ్వసించడం లేదు.
ఇప్పటికే జిల్లాల్లో టీడీపీకి పట్టు తప్పిపోతోంది. వైసీపీ ఓటు బ్యాంకు పెంచుకుంటోంది. మరోవైపు జనసేన తన ప్రభావాన్ని చూపెట్టుకోవాలని తాపత్రయపడుతున్న తరుణంలో లోకేష్ ఏ మేరకు తట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయకత్వంలోనే ఈసారి ఎన్నికలకు వెళ్లి తరువాత లోకేష్ కు బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందని సీనియర్లు సూచిసస్తున్నారు.