Homeజాతీయ వార్తలుTelangana Politics: మంత్రుల మెడపై అనర్హత కత్తి..!

Telangana Politics: మంత్రుల మెడపై అనర్హత కత్తి..!

Telangana Politics: తెలంగాణలో గత ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లు, కౌంటింగ్, అఫిడవిట్ల మార్పు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రత్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ ఊపందుకుంది. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో న్యాయస్థానాలు అనర్హత పిటిషన్ల విచారణ వేగవంతం చేశాయి. ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికల చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో విచారణ ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ మొదలైంది. తమ ఎన్నికను కూడా కోర్టు రద్దు చేస్తే.. అనర్హత వేటు పడుతుందని, వచ్చే ఎన్నికల్లో పోటీకి అర్హత కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు.

30 మందిపై పిటిషన్లు..
తెలంగాణలో 2018 ఎన్నికల అనంతరం 30 మంది ఎమ్మెల్యేలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. అఫిడవిట్లలో తప్పుల ఆధారంగానే ప్రత్యర్థులు పిటిషన్లు దాఖాలు చేశారు. 30 మందిలో 90 శాతం మంది అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందనవారే. ఇందులో ఇటీవలే వనమా వెంకటేశ్వర్‌రావు పిటిషన్‌పై విచారణ పూర్తికావడంతో కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా ముగ్గురు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, కొలప్పుల ఈవ్వర్‌పై దాఖలైన పిటిషన్లపై విచారణ వేగంగా జరుగుతోంది.

విచారణ ఆపాలని పిటిషన్లు..
ఇదిలా ఉంటే.. తమ ఎన్నికను కోర్టు ఎక్కడ చెల్లదని ప్రకటిస్తుందో అని ఆందోళన చెందుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు విచారణ ఆపాలని పిటిషన్లు వేస్తున్నారు. వారం క్రితం శ్రీనివాస్‌గౌడ్‌ పిటిషన్‌ వేయగా, కోర్టు దానిని కొట్టేసింది. విచారణ తుది దశలో ఉన్నప్పుడు కోట్టివేయడం కుదరదని స్పష్టం చేసింది. మరోవైపు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు, ఎన్నికల అధికారులపైనా కేసు నమోదు చేయాలని మూడు రోజుల క్రితం పోలీసులను ఆదేశించింది.
మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని, శ్రీనివాసగౌడ్‌ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. ఈ క్రమంలో.. అఫిడవిట్, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణ పై మీడియాకు ఎలాంటి సమాచారం షేర్‌ చేసుకోవద్దు వాది, ప్రతివాది ఇద్దరిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మంత్రి గంగులపై
ఇదిలా ఉండగా, మరో మంత్రి గంగుల కమలాకర్‌పై దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ ఊపందుకుంది. ఎన్నికల అఫిడవిట్‌ లో గంగుల కమలాకర్‌ తప్పుడు వివరాలు ఇచ్చారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో బండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గంగుల చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కరీంనగర్‌ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. పిటిషనర్‌ను క్రాస్‌ ఎగ్జామ్‌ చేసేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రిటైర్డ్‌ జిల్లా న్యాయమూర్తి శైలజతో కమిషన్‌ ఏర్పాటు చేసిన హైకోర్టు.. ఆగస్టు 12 నుంచి 17 వరకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అగస్ట్‌ 21కి వాయిదా వేసింది.

తాజాగా కొప్పుల కూడా..
ఇక ధర్మపురి ఎమ్మెల్యే కొప్పులు ఎన్నికపై కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణకుమార్‌ కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌పై ఇటీవల స్రాంగ్‌రూం తెరిచి ఈవీఎంలు పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. అయితే స్ట్రాంగ్ రూం కీస్‌ దొరకలేదని అధికారులు కోర్టుకు నివేదించారు. తాజాగా తనపై దాఖలైన పిటిషన్‌ కొట్టేయాలని కొప్పుల కోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. దానిని కొట్టేసింది. పిటిషన్‌ విచారణార్హం కాదని తేల్చి చెప్పింది.

ఎన్నిక రద్దయితే..
ముగ్గురు మంత్రులతోపాటు మరో 26 మంది ఎమ్మెల్యేలు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ వేగవంతం కావడంతో అందరిలో ఆందోళన నెలకొంది. కోర్టు ఎన్నిక రద్దు చేస్తే.. గడిచిన ఐదేళ్ల వేతనం చెల్లించడంతోపాటు, వచ్చే ఐదేళ్లు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోతారు. అనర్హత వేటు పడుతుంది. ఇప్పటికే 30 మందికి టికెట్లు ఇవ్వొద్దని కేసీఆర్‌ భావిస్తున్నారు. మరో 26 మందిపై కేసులు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ బాస్‌ కూడా టెన్షన్‌ పడుతున్నట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular