Budget 2022: కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పై పెను ప్రభావం చూపుతోంది. ఏపీపై సీతకన్ను వేసినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై కరుణ చూపుతుందని భావించినా అది వట్టి మాటే అయింది. వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా కొదవ ఉండదన్నట్లుగా ఏపీకి ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ లో నిరాశే ఎదురైంది. కేసీఆర్ మాత్రం కేంద్రంతో యుద్ధం చేస్తున్నా జగన్ మాత్రం మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. అవసరమైనప్పుడల్లా సాయం అందిస్తూనే ఉన్నారు. బిల్లుల విషయంలో బీజేపీకి వంత పాడుతూనే ఉన్నారు. అయినా కేంద్రం మనసు కరగడం లేదు. ఏపీ మీద ఏ మాత్రం సానుకూల వైఖరి కనిపించడం లేదు. దీంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది.
బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవాలంటే నిధులు కేటాయించాల్సిందే. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారిపోతోంది. రాష్ర్టంలో అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం కొన్నేళ్లుగా నిర్మాణంలో కొనసాగుతూనే ఉంది. దీంతో దాని నిర్మాణ వ్యయం ఏటికేడు పెరుగుతూనే ఉంది. ఇలాగే కొనసాగితే ఇంకా యాభై ఏళ్లయినా పోలవరం పూర్తి కావడం వీలు కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం పోలవరం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు. కేవలం ఉత్తరాది రాష్ర్టాలకే పెద్దపీట వేస్తుందా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో చేపట్టబోయే కెన్ బెత్ వా ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.6700 కోట్లు కేటాయించింది. రూ. 44 వేల కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుపై ఎందుకంత ప్రేమ? పోలవరంపై ఎందుకంత చిన్నచూపు. పోలవరం ప్రాజెక్టుతో ఒరిస్సా, కర్ణాటక రాష్ర్టాలకు కూడా ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా కేంద్రం మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతోంది. ఇలా కొద్ది మొత్తంలో నిధులు కేటాయిస్తే దాని నిర్మాణం పూర్తి కావడం ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. కేంద్రం వైఖరిపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి.
Also Read: Budget 2022: బడ్జెట్ రూపకల్పనలో కేంద్రం స్టేట్లకు షాకిస్తుందా?
ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణం జరిగితే 30 లక్షల ఎకరాలకు సాగునీరు, 62 లక్షల జనాభాకు తాగునీరు అందనుంది. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగే అవకాశమే కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుకు వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నా ఏదో కంటితుడుపుగా చర్యలు చేపడితే ఏం ప్రయోజనం? నిధుల విడుదలలో కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం పోలవరం నిర్మాణం వేగవంతం కావాలంటే నిధులు కావాలి. అది కూడా కేంద్రం ఇవ్వాలి. కానీ దీనికి కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది.
ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ పెరుగుతున్నా కేంద్రం మాతరం స్పందించడం లేదు. సరికదా నిధులు కూడా విడుదల చేయడం లేదు. దీంతో దీని నిర్మాణంలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అన్ని రాష్టాలపై సమాన ప్రేమ చూపిస్తామని చెప్పినా తెలుగు రాష్ర్టాలపై మాత్రం అది కనిపించడం లేదు. దీంతో ఎదురుచూపులే తప్ప ఏ అవకాశం లేదు. దీంతో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. కేంద్రంపై యుద్ధం చేయడం మాత్రం ఆయనకు ఇష్టం లేదు. కానీ కేంద్రం కూడా సహనాన్ని పరీక్షించొద్దని తెలిసినా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Union Budget Of India 2022: నదుల అనుసంధానానికి కేంద్రం అడుగులు.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం..