
YS Viveka Case: రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం రెండు కేసులు కుదిపేస్తున్నాయి. నాలుగేళ్ల కిందట జరిగిన ఈ రెండు ఘటనలు నాడు అధికార మార్పిడికి కారణమైతే.. ప్రస్తుతం అవే రెండు కేసులు అధికార పార్టీకి తలకు మించిన భారంగా తయారవుతున్నాయి. ఈ రెండు కేసులు ఫలితాలు కొద్దిరోజుల్లో తేలే అవకాశం కనిపిస్తోంది. కోర్టులో ఈ కేసులకు సంబంధించిన తీర్పు వస్తే.. వచ్చే ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో రెండు కేసులు ప్రకంపనలు సృష్టించాయి.. సృష్టిస్తున్నాయి కూడా. ఒకరకంగా చెప్పాలంటే ఆ రెండు కేసులు గత ఎన్నికల్లో అధికార మార్పిడికి కారణం అయ్యాయని ఎంతోమంది చెబుతుంటారు. వాటిలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఒకటి కాగా.. మరొకటి అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన కోడి కత్తి ఘటన కేసు ఒకటి. ఈ రెండు ఘటనలు జరిగి దాదాపు నాలుగేళ్లు అయిపోయింది. ఈ ఘటనలు జరిగి వచ్చే ఏడాదికి ఐదేళ్లు పూర్తి కావస్తోంది. నాలుగేళ్లుగా ఈ రెండు కేసులు విచారణ పూర్తి స్థాయిలో సాగలేదు. అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణ వేగం పుంజుకుంటుండడంతో కొద్ది రోజుల్లోనే ఈ కేసుల్లో తీర్పులు కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఈ కేసుల ఫలితాలు వచ్చే ఎన్నికలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీకి ఉపయోగపడిన ఆ రెండు కేసులు..
వివేకానంద రెడ్డి హత్య, కోడి కత్తి ఘటనలు 2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరిగాయి. ఈ రెండు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రంగానే జరగడంతో.. ఏడాది తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీకి గట్టిగానే లబ్ధి చేకూరింది. ఈ రెండు ఘటనలపై వైసీపీ చేసుకున్న ప్రచారం కారణంగా అప్పట్లో రాజకీయంగా ఎంతగానో కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు అవే రెండు కేసుల్లో వైసిపి రాజకీయంగా మరోసారి లబ్ది పొందే అవకాశాలు కనిపించడం లేదు. పైపెచ్చు విపక్షాలకు లబ్ది కలుగుతుందేమో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో ఈ రెండు కేసుల్లో దర్యాప్తు పూర్తయి కోర్టులు ఇచ్చే తీర్పు కోసం విపక్షాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ గతంలో ప్రచారం చేసినట్లుగా.. ఈ రెండు ఘటనల్లోనూ ప్రతిపక్షాల పాత్ర లేదన్నది అర్థమవుతుంది. వైఎస్ వివేకా హత్య కేసులో అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కీలక పాత్రధారులుగా ఉండడంతో.. ఈ కేసు వైసీపీకి బెడిసి కొడుతుందన్న ప్రచారం జరుగుతోంది.
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కోర్టులు.. సిబిఐ..
వివేకానంద రెడ్డి కేసులో ఒకవైపు హైదరాబాద్ సిబిఐ కోర్టు, మరోవైపు తెలంగాణ హైకోర్టు, ఇంకోవైపు సుప్రీంకోర్టులో ఏకకాలంలో విచారణ సాగుతోంది. ఇప్పటికే సిబిఐ అధికారులు ఈ కేసులో కీలకమైన వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసులో అనుమానితులు, నిందితులు వరుసగా కోర్టులను ఆశ్రయించి ఉపశమనం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో వివేకా కేసులో వెలువడే తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి పెరిగిపోయింది. అలాగే ఈ కేసులో వైసీపీ నేతల పాత్ర లేదని తేలిపోతే ఎన్నికలకు ముందు ఆ పార్టీకి ఊరట లభించనుంది. అలా కాకపోతే మాత్రం సమస్యలు తప్పేలా కనిపించడం లేదు. అదే జరిగితే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా లబ్ధి పొందేందుకు విపక్షాలు ఎదురుచూస్తున్నాయి.

కోడి కత్తి కేసులోనూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే..
ఎయిర్పోర్టులో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తి ఘటన చోటుచేసుకుంది. ఈ కేసుపై తాజాగా ఎన్ఐఏ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ గమనిస్తే.. వైసిపికి ఇబ్బందులు తప్పేలా లేవన్న విషయం అర్థమవుతోంది. రాజకీయంగా ఈ కేసును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అప్పుడే విపక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ కేసులో తీర్పు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ కేసులో వైసిపికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన విచారణ సంస్థ.. ఈ కేసులో రాజకీయ కోణం లేదని చెప్పినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే అప్పట్లో వైసిపి చెప్పినట్లుగా.. టిడిపికి దీంతో సంబంధం లేదు. అదే తేలితే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగానే వచ్చే ఎన్నికలు మారనున్నాయి. రెండు కేసుల్లో తీర్పులు ప్రతికూలంగా వస్తే మాత్రం వైసీపీ, బీజేపీ పరోక్ష పొత్తుపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. అలా కాకుండా మిశ్రమ ఫలితాలు వచ్చినా ఎన్నికల సమయంలో బిజెపి.. వైసిపిపై రాజకీయ దాడి మొదలు పెడుతుంది. అందుకే జగన్ ఇప్పుడు అన్ని అస్త్రాలకు పదును పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు రాజకీయంగా కలిసి వచ్చి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఉపకరించిన ఆ రెండు కేసులే.. ఇప్పుడు తలకు మించిన భారంగా మారుతుండడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.