
AP Global Investors Summit: ఏపీలో గత నాలుగేళ్లుగా వ్యవసాయరంగంపైనే వైసీపీ సర్కారు దృష్టిపెట్టింది. కానీ శాశ్వత ప్రాజెక్టులేవీ నిర్మాణం కాలేదు. కానీ సాగు ప్రోత్సాహం కింద రైతుభరోసా, ఇన్ పుట్ సబ్సిడీ, రైతుభరోసా కేంద్రాల ద్వారా సాగు సలహాలు, సూచనలు వంటివి శరవేగంగా అందుతున్నాయి. ప్రభుత్వ ప్రకటనలు సాగు చుట్టూ తిరుగుతున్నాయి. విపక్షాలు మాత్రం రైతుకు ఒరిగిందేమీ లేదని విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా జాతీయ స్థాయిలో ఒక ముద్రపడింది. వ్యవసాయం తప్పించి మరొకటి వర్కవుట్ కాదన్న అపవాదును మూటగట్టుకుంది. ఇది వైసీపీ సర్కారు చర్యల నిర్వాకమే అంటూ విమర్శలు వచ్చాయి. దాన్ని చెక్ చెబుతూ జగన్ సర్కారు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించినట్టు చెబుతోంది. అదు దేశీయ పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకోవడమే కాకుండా.. ఏపీలో సానుకూల వాతావరణం ఉందని జగన్ సర్కారుపై ఉన్న ముద్రను చెరిపే ప్రయత్నం చేశారు.
గత టీడీపీ హయాంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2016,17,18లో వరుసగా మూడు సీఐఐ సదస్సులను ఏర్పాటుచేశారు. మొత్తం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్టు ప్రకటించారు. అందుకు ఒప్పందాలు సైతం జరిగాయని ప్రచారం చేసుకున్నారు. కానీ రూ.50 వేల కోట్లకు మించిన ఒప్పందాలు అమలుకాలేదు. పరిశ్రమల ఏర్పాటు పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు వైసీపీ సర్కారు తాజా గ్లోబల్ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని చెబుతోంది. కానీ ఇందులో ఎన్ని పరిశ్రమలు పట్టాలెక్కతాయన్నది ప్రభుత్వ సమర్థతపై ఆధారపడి ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని పదిలం చేసుకుంటే మాత్రం ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలు అమలు జరిగే చాన్స్ ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో కొన్నిరకాల పరిశ్రమలు ఏర్పాటుకు శంకుస్థాపన జరగగా.. వైసీపీ సర్కారు రాజకీయ కోణంలో వాటిని తరిమేశాయన్న ఆరోపణలున్నాయి. ఇటువంటి తరుణంలో మరో గవర్నమెంట్ వస్తే ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలు చెల్లుబాటు అవుతాయా? అన్న ప్రశ్న తలెత్తుంది. ఒప్పందం చేసుకున్నది ప్రభుత్వమే కానీ.. ప్రభుత్వాలు కూడా వేరవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వమా? జనసేన ప్రభుత్వమా? వైసీపీ ప్రభుత్వమా? అని విభజన రేఖ గీశారు. దీంతో ఇటువంటి ఒప్పందాలు చట్టుబండల్లా మారిపోయాయి.

అయితే ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు దేశంలో పారిశ్రామిక దిగ్గజాలు తరలిరావడంతో కాస్తా ఉపశమనం కలిగించే విషయం. ప్రస్తుతానికైతే ఓకే కానీ.. దీని ఫాలోప్ చేయడంలో జగన్ ఎలా ముందుకెళతారన్నది ప్రశ్న. తొలి రోజున ముకేష్ అంబానీ, కరణ్ ఆదానీ, జీఎమ్మార్, భజాంక, పునీత్ దాల్మియా వంటి ప్రముఖులతో పాటుగా మరింత మంది పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ, కరణ్ ఆదానీ, జీఎమ్మార్, ప్రతీ రెడ్డి వంటి ప్రముఖులు సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసించారు. అటు జగన్ సైతం కేంద్ర ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కేంద్ర సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక రెండో రోజు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాలా, రాజీవ్ చంద్రశేఖరన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. పారిశ్రామికరంగం నుంచి రెడ్డీస్ లేబరోటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, నోవా ఎయిర్ సీఈవో గజానన నాబర్, అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, లారస్ ల్యాబ్స్ చైర్మన్ సత్యనారాయణ చావా, హెటిరో గ్రూప్స్ ఎండీ వంశీక్రిష్ణ బండి, గ్రీన్ కో డైరెక్టర్ అనిల్ చలమశెట్టి సెయింట్ గోబైన్ సీఈవో సంతానం వంటి దిగ్గజాలు హాజరయ్యారు. వీరికి దేశీయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలు, సంస్థలు ఉన్నావన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
అయితే ఇలా వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయించడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. వేదికపై ప్రసంగించిన వారంతా ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సానుకూలంగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. అయితే అదే కరెక్ట్ అయినప్పుడు నాలుగేళ్లు పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని ఎందుకు ముందుకు రాలేదన్నది ప్రశ్న. అయితే ఒకటి మాత్రం సంతోషించదగ్గ పరిణామం. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఇంటా బయటా విమర్శలు వచ్చాయి. పారిశ్రామిక, వాణిజ్య విధానాలకు వ్యతిరేకమైన సంక్షేమ తారక మంత్రాన్ని జగన్ పఠిస్తున్నారు. అటు జగన్ సంక్షేమాన్నే ఇతర రాష్ట్రాలు అమలుచేస్తున్నాయని వైసీపీ నేతలు ఢిల్లీ వేదికగా ప్రకటిస్తున్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకునే స్టేజ్ లో లేదన్న విమర్శల నేపథ్యంలో ఏకంగా పారిశ్రామిక దిగ్గజాలు వచ్చి అనుకూల వాతావరణం ఉందని చెప్పడం వైసీపీ సర్కారుకు ఉపశమనం కలిగించే విషయం