Chandrababu Jail: చంద్రబాబు బెయిల్ పై ఎప్పుడు వస్తారా అని టిడిపి శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. అధినేత కోసం ఆందోళన బాటపట్టాయి. మరోవైపు జైలులో చంద్రబాబు పడుతున్న బాధను చూసి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హౌస్ అరెస్ట్ నే రిమాండ్ గా పరిగణించాలని కోరినా అనుమతి ఇవ్వలేదు. జైల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు సిఐడి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో హౌస్ అరెస్టుకు అనుమతి లభించలేదు. అయితే జైల్లో చంద్రబాబుకు కనీస వసతులు కల్పించడం లేదని ఆయన భార్య భువనేశ్వరి మీడియా సమావేశంలోనే ఆవేదన వ్యక్తం చేయడం విశేషం.
చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేత గా ఉన్నారు. అటువంటి నేత విషయంలో జైలు అధికారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అక్కడ కనీస నిబంధనలు పాటించడం లేదు. ఆయనను నిర్బంధించిన బ్యారక్ చుట్టూ దట్టమైన చెట్లు ఉన్నాయి. వాటి వల్ల విపరీతమైన దోమలు. రోజంతా ఆ దోమల కాట్ల మధ్య గడపాల్సి వస్తోంది. సాధారణంగా జైలులో 60 ఏళ్లు దాటిన ఖైదీలకు.. స్నానానికి విధిగా వేడి నీళ్లు సమకూర్చాలని నిబంధన ఉంది. కానీ చంద్రబాబుకు స్నానానికి చన్నీళ్లే ఇస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబుకు కోర్టు మార్గదర్శకాల ప్రకారం నిత్యం వైద్య సేవలు అందించాలి. కానీ భద్రతపై అనుమానాల నేపథ్యంలో వైద్యులతో పరీక్షలు చేయించుకోవడానికి చంద్రబాబు విముఖత చూపుతున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రం మాత్రం ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.అటు చంద్రబాబు రిమాండ్ విషయంలో జైలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వారిని మీడియా ప్రతినిధులు పలకరించినా స్పందించడం లేదు. మా పరిస్థితి అర్థం చేసుకుని మాట్లాడాలంటూ వారు తిరిగి వేడుకోవడం విశేషం. అసలు అక్కడ పని చేస్తున్న సిబ్బంది మీడియాతో మాట్లాడేందుకు భయపడుతున్నారు. ఏ సమాచారం గురించి అయినా ఫోన్ చేసినా తీయడం లేదు.
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఏసీబీ న్యాయస్థానానికి సిఐడి న్యాయవాదులు తెలిపారు. కానీ అక్కడ ఆ స్థాయిలో భద్రత లేదని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. జైలు వద్ద భద్రత, ఇతర ఏర్పాట్లపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట మూలాఖత్ లో చంద్రబాబును ఆమె కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆయనకు కేటాయించిన చోట కేటగిరీ 1 స్థాయిలో వసతులు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గది శుభ్రత, కేటాయించిన మంచం, కుర్చీలు కూడా అనువుగా లేవని తెలుస్తోంది. కేవలం ఒక ఫ్యాన్ ఉన్న బెడ్ ను మాత్రమే కేటాయించినట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికైతే జైల్లో అరకొర వసతులతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.