Telangana: సీఎం కేసీఆర్ ఏదైనా మాట్లాడారంటే దాని వెనక ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆయన నోటి నుంచి ఏదైనా వచ్చిందంటే దాని వెనక ఎంతో వర్క్ జరిగి ఉంటుంది. ఊరికే ఆయన మాట జారే అవకాశం ఉండదు. ఎన్నికల సందర్భంగా నిర్వహించే సభలు, సమావేశాల్లో ఏ విధంగానైతే ప్రతిపక్షాలపై విరుచుకుపడతారో.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడుతారు. విశేష రాజకీయ అనుభవం, పుస్తకాలు చదవడం వల్ల వచ్చిన నాలెడ్జ్, దేనినైనా ఎదుర్కొనే ధైర్యం, తెగువ, ఏదైనా సాధించేదాక వదిలిపెట్టని పట్టుదల వంటి అంశాలు ఆయనను మిగితా నాయకులతో ప్రత్యేకంగా నిలబెట్టాయి.
బెడిసికొట్టిన ప్లీనరీ వ్యాఖ్యలు..

సీఎం కేసీఆర్ వాక్ చాతుర్యానికి ఎవరైనా ముగ్ధులవుతారు. సభలో ఎంతటి గందరగోళం నెలకొన్ని ప్రజల ప్రేక్షకుల దృష్టిని తన వైపు మరల్చుకునే నైపుణ్యత ఉన్న నేర్పరి. అయితే ఎంతటి గొప్పవారికైనా కొన్ని సార్లు కలిసిరాదు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు కూడా అలాగే జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. అందులో తెలంగాణలో టీఆర్ఎస్ పాలన గొప్పదనం తెలియజేసేందుకు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు ఆయనను ఇరకాటంలో పెడుతున్నాయి. తెలంగాణ పథకాలు చూసి చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రలోని, కర్నాటకలోని కొన్నిప్రాంతాల ప్రజలు తమను తెలంగాణలో కలుపుకోవాలని కోరుతున్నారని తెలిపారు. అలాగే ఏపీలో కూడా టీఆర్ఎస్ పోటీ చేయాలని అక్కడి ప్రజలు తనకు చెబుతున్నారని అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ గా మారాయి. గొప్పలు చెప్పేందుకు సీఎం చేసిన ప్రయత్నం ఇప్పుడు ఆయనను తిప్పల్లో పడేసేలా చేశాయి.
ఏపీలో టీఆర్ఎస్ పోటీ అంశంపై అక్కడి మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏపీలోనే మంచి పథకాలు ఉన్నాయని, ఏపీ ప్రజలెవరు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని కోరకుకోవడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన నెరవేరాలంటే ఏపీని, తెలంగాణను మళ్లీ కలిపేయాలని కోరారు. అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రత్యేకంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండబోదని, దానికి అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మాణం చేయాలని సూచించారు. దీంతో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీనిపై ధ్వజమెత్తారు. కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్ష వల్లే ఇలాంటి కొత్త అంశం తెరపైకి వచ్చిందని అన్నారు. తెలంగాణను బలిపీఠం ఎక్కనివ్వబోమంటూ కామెంట్ చేశారు. నిన్న ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భిన్నంగా స్పందించారు. ఏపీ, తెలంగాణ కలవడం తనకు ఇష్టమేనని, తానెప్పుడు సమైక్యవాదినేని తెలిపారు. ఇలా కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చకు కారణమయ్యాయి.
తెలంగాణ(Telangana) వారి గోడు వినలేదు.. కర్నాటక పరిష్కారం చూపింది..
పక్క రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలవాలనుకుంటున్నారనే అంశం మరో చర్చకు దారితీశాయి. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ సరిహద్దులో ఉంటున్న వారి సమస్యను కర్నాటక ప్రభుత్వం పరిష్కారం చూపింది. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, చేగుంట గ్రామాలు కర్నాటక రాష్ట్రానికి దగ్గరలో ఉంటాయి. చాలా రోజుల నుంచి ఇక్కడికి తెలంగాణ ఆర్‌టీసీ బస్సులు రావడం లేదు. హైవేకు ఈ గ్రామాలు దగ్గరగా ఉండటంతో వారు కర్నాటక బస్సులనే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. తమకు బస్సు సౌకర్యం కల్పించాలని నాయకులకు, అధికారులకు ఎన్నో సార్లు విన్నవించినా ఫలితం లేదు. బార్డర్‌లో ఉండటం వల్ల బస్సు తిరిగి కాళీగా రావాల్సి ఉంటుందని, అది చాలా నష్టదాయకమని బదులిచ్చారు. కర్నాటక బస్సులనే ఉపయోగించుకోవాని సూచించారు. అయితే ఆ గ్రామాలకు కర్నాటక ఆర్‌టీసీ సంస్థ నిబంధనల ప్రకారం స్టేజీ సౌకర్యం లేదు. దీంతో ప్రయాణికులు కర్నాటక రాష్ట్రంలో ఉండే ప్రాంతానికి టికెట్ తీసుకొని, ఆ గ్రామాల్లో దిగాల్సి వస్తోంది. ఇది వారికి అదనపు భారం అవుతోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇటీవల రాయచూరు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆయన వెంటనే ఆయా గ్రామాల్లో అధికారికంగా స్టేజీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. తమ గోస తెలంగాణ ప్రభుత్వం వినలేదని, కానీ కర్నాటక ప్రభుత్వం వెంటనే స్పందించిందని అక్కడి ప్రజలు అంటున్నారు. తమకు తెలంగాణ కంటే కర్నాటకే బాగుందని కితాబిస్తున్నారు. దీంతో ఈ అంశం మళ్లీ చర్చకు రానుంది. దీనిపై రాజకీయ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.