AP Politics: ఏపీ రాజకీయాలు ఎవరికీ అర్థం కావు. అంతకుమించి అంతు పట్టవు కూడా. రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తాయో చెప్పడం లేదు. ప్రత్యర్థి పార్టీల బలహీనతల గురించి, వైఫల్యాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాయి. జగన్ తన తల్లిని గెంటేశారని, చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ఆరోపణలు చేసుకుంటారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో.. ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తామో మాత్రం చెప్పడం లేదు. ఎప్పుడు వ్యక్తిగత విమర్శలకు పరిమితం అవుతున్నారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారు.
రాజకీయ పార్టీల అధినేతల వ్యక్తిగత వైఫల్యాలను హైలెట్ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఎక్కువగా ఉబలాటపడుతున్నారు. జగన్ తన తల్లి విజయమ్మను పట్టించుకోకపోతే అది కుటుంబ వ్యవహారం. పవన్ పెళ్లిళ్లు అనేది ఆయన వ్యక్తిగత జీవితం. చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిస్తే అది వారి పార్టీ అంశం. ఆ విమర్శలతో ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడాన్ని ఏమనాలి? ప్రభుత్వం తన పాలనను సజావుగా నడిపిస్తోందా? ఇచ్చిన హామీలను అమలు చేస్తోందా? అన్నదానిపై విపక్షాలు ప్రశ్నించాలి. ఇచ్చిన హామీలను అమలు చేశాం. మీకంటే బాగా పాలన సాగించామని ప్రభుత్వం గణాంకాలతో సహా వివరించాలి. ఏపీలో ఆ పరిస్థితి ఉందా? అంటే ముమ్మాటికీ లేదని చెప్పాలి.
ఏపీ సీఎం జగన్ నవరత్నాలను అమలు చేస్తామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వాటిని కొంతవరకు అమలు చేయగలుగుతున్నారు. అయితే మద్య నిషేధం విషయంలో మాత్రం మాట తప్పారు. దానిపై పెద్ద ఉద్యమమే చేపట్టేందుకు అవకాశం ఉన్న విపక్షాలు పట్టించుకోవడం లేదు. అలా చేస్తే తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తామన్న హామీ ఇవ్వాల్సి ఉంటుంది.అదే సమయంలోనవరత్నాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక మాదిరిగా మారుతుందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఇప్పుడు అవే నవరత్నాలకు మించి పథకాలు తాము అందిస్తామని చెప్పుకుంటున్నాయి. మరి అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది మాత్రం చెప్పడం లేదు.
ప్రజా సమస్యలు, ప్రజల అజెండా అన్నది పక్కకు వెళ్ళిపోయింది. రాజకీయ, వ్యక్తిగత అంశాలకి ప్రాధాన్యం దక్కుతోంది. గత నెల రోజులుగా ఎలా చూసుకున్నా చంద్రబాబు అరెస్టు ప్రాధాన్యతాంశంగా మారిపోయింది. అటు ప్రభుత్వానికి, ఇటు విపక్షాలకు అసలు సమస్యలే లేవన్నట్టు కనిపిస్తోంది. ఎక్కడైనాప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు జరుగుతాయి.ఏపీలో మాత్రం తమ అధినేతను కించపరిచారని, వారి వ్యక్తిగత జీవితాలపై మాట్లాడుతున్నారని.. ఇలా లేనిపోని వివాదాలతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రజా సమస్యలను తుంగలో తొక్కుతున్నారు. ఈ జుగుప్సాకర రాజకీయాల్లో ప్రజలను సైతం భాగస్తులను చేస్తున్నారు.