Manipur Kuki Girl Paraded: వార్త వేరు, విశ్లేషణ వేరు. సమస్య వేరు, సమస్య తీవ్రతను చెప్పే తీరు వేరు. పాత్రికేయం అనేది వీటంన్నింటినీ ఒడిసి పట్టుకోవాలి. పాఠకులకు తన మార్క్‌తో చేరవేయాలి. ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ పేజీ మేకప్ బాగుండాలి. ఎడిటోరియల్ టీంలో క్రియేటివిటీ ఉండాలి. అప్పుడే అది జనంలోకి బాగా వెళ్తుంది. సమస్య తీవ్రత పాలకులకు అర్థం అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ప్రయోగాన్ని(కొన్ని లెక్కలు మినహాయిస్తే) కలకత్తా నుంచి పబ్లిష్ అయ్యే టెలిగ్రాఫ్ అనే పత్రిక ఇవ్వాళ చేసింది. ఉదయం నుంచి ఇప్పటి దాకా అది వైరల్ అవుతూనే ఉంది. అంత పీకి పొడిచిన వార్త ఏంటయ్యా అంటే..
హెడ్డింగ్ లేకుండానే..
సాధారణంగా ఒకవార్తకు హెడ్డింగే గుండెకాయ. అలాంటిది హెడ్డింగ్ లేకుండానే టెలీగ్రాఫ్ దాదాపు హాఫ్ పేజీ వార్త కుమ్మేసింది. అందులో రన్నింగ్ మ్యాటర్ కూడా లేదు. కేవలం కన్నీరు కారుస్తున్న ఓ మొసలి ఫొటో మాత్రమే ఉంది. ‘ఈ 56 ఇంచుల చర్మానికి బాధ తెలియడానికి 79 రోజులు పట్టింది.’ అని చిన్న ఇంట్రో రాసింది. ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన అకృత్యంపై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చను, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఈసడించుకున్న తీరును టెలీగ్రాఫ్ ఇలా ఎండగట్టింది. ఎలాగూ ఈ టెలీగ్రాఫ్ యాంటి బీజేపీ పేపరే. కాబట్టి మొసలి కన్నీరు రూపంలో కేంద్రం తీరును కుమ్మేసింది. ఇక యాంటీ మోడీ, బీజేపీ సెక్షన్లు ఊరుకుంటాయా? ఉదయం నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్‌లలో వైరల్ చేస్తున్నాయి. సరే ఆ రాజకీయాలు అలానే ఉంటాయి గాని.. మీడియా కోణంలో చూస్తే మాత్రం ఇది పక్కా ప్రొఫెషనల్ క్రియేటివిటీ అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. పైగా ఇది చెప్పుకోదగ్గ ‘ఎడిటోరియల్ పీస్’. మొసలి కన్నీరు రూపంలో మోడీకి ఏకంగా కర్రు కాల్చి వాత పెట్టింది.
క్రియేటివేటీ రూపంలో..
వాస్తవానికి ఈ దేశంలో ఆ రాహుల్‌గాంధీకి, ఇంకా మమతకు, కేసీఆర్‌కు మోడీని క్రియేటివేటీ రూపంలో అనడం చేతకాదు. అదంతా బభ్రజమానం భజగోవిందం. కాని టెలీగ్రాఫ్ ఉంది చూశారూ.. మోడీకి యాంటి అంటే చాలు అగ్గి బరాటా లాగా లేస్తుంది. ఎడిటోరియల్ టీం తమ బుర్రకు పదును పెట్టి మాములు చురకలు అంటిస్తుంది. మరి ఇదే టెలిగ్రాఫ్ ఆ బెంగాల్ మమత మీద, టీఎంసీ దౌర్జన్యాల మీద పెద్దగా ఫోకస్ చేయదు. శారద కుంభకోణం, రోహింగ్యాలకు పౌరసత్వం, బంగ్లాదేశ్ ముస్లింల చొరబాట్ల మీద రాయదు. అది దాని పొలిటికల్ లైన్. కానీ దాన్ని టాకిల్ చేసే దమ్ము ఆ బీజేపీకి లేదు. అప్పుడెప్పుడో సువేంద్రు అధికారి మాట్లాడాడు గాని.. ఎందుకో పెద్దగా రీచ్ కాలేదు.
నడిబజారులో నిల బెట్టింది
మణిపూర్ ఇష్యూలో మోడీని ఒకరకంగా టెలీగ్రాఫ్ బజారులో నిలబెట్టింది. కడిగేసింది. ” ఏయ్ మోడీ ఇదేనా నీ పాలన తీరు” అని తూర్పారబట్టింది. కేవలం ఈ మొసలి కన్నీరును ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది అంటే.. రాజకీయం వ్యవస్థకు దూరంగా జరిగినప్పుడు, సమస్యలను పట్టించుకోనప్పుడు పాత్రికేయం కచ్చితంగా చర్నాకోల్ పట్టుకుని చెమడలు ఊడదీయాలి. కానీ ఇదే మన తెలుగు పాత్రికేయానికి చేతకావడం లేదు. నిప్పులు మండే, శక్తులు నిండే స్థాయిలో వార్తలను తీర్చిదిద్దాల్సిన ఎడిటోరియల్ టీం రంగులు పూసుకుని కీర్తనలు చేస్తున్నది. లేదా గిట్టని వారి మీద టన్నుల కొద్దీ బురద చల్లుతున్నది. కొన్ని పత్రికలయితే యాడ్స్ బిస్కట్స్ కోసం ఏకంగా నాలుగైదు ఫస్ట్ పేజీలను కూడా పబ్లిష్ చేస్తున్నాయి. ఈ కేటగిరీలో ఈనాడయితే మరీ దారుణం. అది ఇప్పుడు మరో “నమస్తే” అయిపోయింది.
కుక్కీ కుక్కీ ప్రజెంటేషన్
వాస్తవానికి ఓ పత్రికకు ఫస్ట్ పేజీ అనేది గుండెకాయ. అందులో వచ్చే వార్తలు, లీడ్, ఇంట్రో, డెక్కులు.. పత్రిక ఉద్దేశ్యాన్ని పాఠకుడికి చెప్పేస్తాయి. కానీ ఆ స్థాయిలో తెలుగు మీడియా పని చేస్తోందా? అంటే లేదు అనే చెప్పాల్సి ఉంటుంది. వార్తలను కుక్కీ కుక్కీ ఇండికేషన్లకు మాత్రమే ఫస్ట్ పేజీ అనేస్థాయిలో ప్రజెంట్ చేస్తున్నది. ఆ వార్తలు లోపలి పేజీల్లో ఎక్కడో ఒక చోట రుచిశుచి లేకుండా ఉంటాయి. అయితే ఉన్న కాస్త స్పేస్‌లో అయినా “ఆంధ్రజ్యోతి” చాలా నయం.. చెప్పుకోదగిన స్థాయిలో హెడ్డింగ్‌లు పెడుతుంది. కంటెంట్‌లో అయితే నిప్పులు చిమ్ముతుంది(చంద్రబాబుకు మాత్రం భజన చేస్తుంది.) ఇక ఈ జాబితాలో నెత్తిమాసిన ఫస్ట్ పేజీ అంటే ఈనాడుదే. ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా మారిపోయింది? ఇక ఆ సాక్షి.. అడ్డదిడ్డమైన రంగులు అద్దడం తప్ప ఓ ప్రయోగం ఉండదు. పాడూ ఉండదు. “నమస్తే” గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మిగతా వాటి గురించి చర్చ అనవసరం. ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ9 ప్రయోగాలు చేస్తుంది గాని.. అవి జబర్దస్త్ స్కిట్ ల లాగా ఉంటాయి. మిగతా చానెల్స్ టీవీ9ను చూసి వాతలు పెట్టుకుంటాయి.