
True Up Charges On Telangana: “ఎన్నికల సంవత్సరంలో కరెంటు చార్జీల పెంపు జోలికి వెళ్లకూడదని ప్రభుత్వ నిర్ణయించింది. డిస్కములు పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 2023_24 ఆర్థిక సంవత్సరంలో పాత కరెంటు చార్జీల వసూలుకే పరిమితం కావాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది” ఇది ఇవ్వాళా అధికార పార్టీ కరపత్రంలో కనిపించిన వార్త. ఈ సన్నాయి నొక్కులు బాగానే ఉన్నాయి కానీ.. గతంలో చేసిన వసూళ్ల మాటేమిటి? ట్రూ అప్ పేరిట చేసిన దోపిడీ మాటేమిటి? ఇప్పుడు ట్రూ అప్ చార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది, ఎన్నికల ఏడాది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది.. అదే ఎన్నికలు లేకుంటే? ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత లేకుంటే? జనాల నెత్తి మీద విద్యుత్ పిడుగు పడేది. చార్జీల వాత మోతక్కేది.
2023_24 ఆర్థిక సంవత్సరానికి గానూ డిస్కమ్ ల ఆదాయ అవసరాలు 52,006.78 కోట్లు. వీటిలో విద్యుత్ విక్రయాల ద్వారా 43, 026.84 కోట్లు రానుంది. నాన్ టారిఫ్ ఆదాయం రూపంలో 61.99 కోట్లు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జ్ ( కరెంటు చార్జీలు భరించలేని వర్గాలను ఆదుకునేందుకు వసూలు చేసే చార్జీలు) కింద 98 కోట్లు, అదనపు సర్ చార్జీ ( బహిరంగ విపణి ద్వారా కరెంటు కొనుగోలు చేసే వారి నుంచి వసూలు చేసే) కింద 23.48 కోట్లు మొత్తం కలుపుకొని 8,796.46 కోట్లు లోటు ఉంది. అయితే ఎల్ టి వన్ కేటగిరీలో (200 యూనిట్ల లోపు) విద్యుత్ వాడే వారికి రాయితీ కింద 1381.02 కోట్లు, 27 లక్షల పంపు సెట్లకు సబ్సిడీ కింద 7,743 కోట్లు కలుపుకొని మొత్తం 9,124 కోట్లు టారిఫ్ రూపంలో చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ లోటు తీరిపోయినట్టు విద్యుత్ శాఖ చెబుతోంది. కానీ వీటిని ఐదు సంవత్సరాలలో చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది.. కానీ ఇప్పుడు జీతాల సర్దుబాటే కష్టంగా ఉన్న ప్రభుత్వానికి.. ఈ నిధులు ఎలా చెల్లిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

వాస్తవానికి ప్రభుత్వం గత బకాయిలు చెల్లించినట్లయితే విద్యుత్ డిస్కం లు ఈ స్థాయిలో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి ఉండేవి కావు.. విద్యుత్ సంస్థలు చేసే ఖర్చులు అంటే సిబ్బంది జీతాలు, పంపిణీ నష్టాలు, బొగ్గు కొనుగోలు ఇతర అవసరాలకు చేసే ఖర్చుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఆమోదం తెలుపుతుంది. ఈ ఖర్చును అనుసరించి విద్యుత్ చార్జీలను నిర్ణయిస్తారు. అయితే తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఆమోదించిన అంచనాలకు మించి విద్యుత్ సంస్థకు ఖర్చు చేయాల్సి వస్తోంది. తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచి ఇదే వ్యవహారం కొనసాగుతోంది. చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఇప్పటికీ ఆ రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి.. దీంతో ఆ ప్రభుత్వం విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించి ఉంటే తక్కువ ధరకే విద్యుత్ లభించేది.. కానీ ఎప్పుడైతే చత్తీస్ గడ్ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వలేదు. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనాల్సి వచ్చింది. ఫలితంగా ఆ భారం ప్రజలపై పడింది. ఎప్పుడంటే ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలను పెంచలేదు. కానీ ఎన్నికల ముగిసిన తర్వాత ప్రజలపై కచ్చితంగా భారం పడుతుంది. ఒకవేళ ఆ భారం వేయని పక్షంలో విద్యుత్ డిస్కం లు కచ్చితంగా తీవ్ర ఆర్థిక సంక్షేభంలో కూరుకుపోతాయి..
ఇక అంచనా వేసిన వ్యయం కంటే విద్యుత్ కొనుగోల రూపేణా అయిన వాస్తవిక వ్యయం (2016-2017 నుంచి 2022_23 వరకు) కోసం డిస్కమ్ లు 10,281.73 కోట్లకు ట్రూ అప్ పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు 1,2,3 నియంత్రితకాలంలో వీలింగ్ ట్రూ అప్ కింద రూ.203.83 కోట్లు, ఉదయ్ ఒప్పందం ప్రకారం డిస్కమ్ లకు చెల్లించాల్సిన 2232.84 కోట్లు కలిపి 127.18 కోటను ప్రజల నుంచి వసూలు చేయడానికి అనుమతి ఇవ్వాలని డిస్కం లు కోరాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.