Homeజాతీయ వార్తలుRahul Gandhi: చిన్న తప్పుకు రాహుల్‌కు అంత పెద్ద శిక్షా.. అది ‘పవర్‌’ఫుల్‌ తీర్పేనా?

Rahul Gandhi: చిన్న తప్పుకు రాహుల్‌కు అంత పెద్ద శిక్షా.. అది ‘పవర్‌’ఫుల్‌ తీర్పేనా?

Rahul Gandhi
Rahul Gandhi

Rahul Gandhi: మన దేశంలో ఏ నేరానికి ఎంత శిక్ష పడుతుంది అంటే పుస్తకాల్లో రకరకాలుగా ఉంటుంది. అసలు ఒక నేరాన్ని ఏ విధంగా పరిగణించాలి అనే విషయంలో కూడా రకరకాల సబ్‌ సెక్షన్స్‌ ఉంటాయి. అందుకే లాయర్లకి, వాళ్లు చెప్పే లా పాయింట్లకి అంత గిరాకీ. ఆ మధ్యన ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మార్గదర్శి విషయంపై న్యాయశాస్త్రం గురించి మాట్లాడుతూ – ఒక పేజీలో ఫలానా సెక్షన్‌ కింద నేరస్తుడిని అరెస్ట్‌ చెయ్యాలని ఉంటే అదే పుస్తకంలో మరొక పేజీలో ఫలానా సెక్షన్‌ కింద వదిలేయొచ్చని ఉంటుందని చెప్పారు. ఇంతకీ శిక్ష వెయ్యాలా వద్దా అనేది న్యాయవాదుల వాదన ఆ పైన న్యాయమూర్తి విచక్షణ నిర్ణయమని వివరించారు. అది నిజమే అనిపిస్తుంది. కొన్ని కేసులు ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి కొలిక్కి రాకుండా నానుతూ ఉంటాయి. కొన్ని కేసులకి వెంటనే తీర్పులొచ్చేస్తాయి. అయితే.. నేరానికి తగిన శిక్ష పడినప్పుడు ఎటువంటి చర్చ ఉండదు.

రాహుల్‌ అనర్హతతో చర్చ..
తాజాగా రాహుల్‌ గాం«ధీ కేసుని చాలా త్వరగా విచారించి ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేసి రెండేళ్లు జైలు శిక్ష కూడా వేశారు. ఇంతకీ అతను చెసిన నేరమేంటని అడిగితే నీరవ్‌ మోదీ ఆర్థిక నేరం చేసి దేశం వదిలి పారిపోయినప్పుడు ‘మోదీ పేరున్న వారంతా నేరస్తులుగా బయటపడుతున్నారు‘ అని స్టేట్‌ మెంట్‌ ఇచ్చాడు. దీంతో మోదీ పేరున్న వారి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆ పేరుగల ఒక ఎమ్మెల్యేతో కేసు వేయించి నడిపించారు. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అనే సామెత చందాన ఆ కేసు పెట్టిన వారికి సత్వర న్యాయం దక్కేసింది. రాహుల్‌ గాంధీకి శిక్ష పడింది. ఇంతోటి నేరానికి అంత పెద్ద శిక్షా అని కొందరు, అసలిది నేరమెందుకవుతుందని మరి కొందరు చర్చ లేవనెత్తారు. ఆ మధ్యన పార్లమెంటులోనే ప్రధాని మోదీ ఒక ప్రసంగంలో రేణుకా చౌదరిని ఉద్దేశిస్తూ శూర్పణక అని సంబోధించారు. ఈ సందర్భంగా ఆ విషయాన్ని లేవనెత్తి మరి మోదీ గారికి ఏ శిక్ష వెయ్యాలని ప్రశ్నిస్తోంది రేణుకా చౌదరి.

సభ్యత దాటిన రాజకీయాలు..
రాజకీయాలు సభ్యత దాటి చాలా ఏళ్లయింది. ఈ లెక్కన రఘురామరాజు మాట్లాడే మాటలకి, అయ్యనపాత్రుడు పారేసుకున్న నోటికి ఏ శిక్ష పడాలి? పవరున్నవాళ్లు కన్నెర్ర చేస్తే న్యాయబద్ధంగా శిక్షలు పడతాయంటే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కన్నెర్ర చేస్తూ కూర్చోవచ్చు. ఇక్కడ రూలింగ్‌ పార్టీ వాళ్లు ఏం చేస్తున్నారని కాదు. వాళ్లూ మాటకి మాట ఘాటుగానే స్పందిస్తున్నారు. చాలాసార్లు సభ్యత తప్పుతోంది కూడా. అయితే అవతలి వాళ్ల చేతిలో పవర్‌ లేదు కాబట్టి ఒక లెక్క. పవరుంటే రాహుల్‌ గాంధీకి శిక్ష వేయించొచ్చంటే, మరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కూడా ఆ వెసులుబాటు ఉంటుందేమో మరి!

సమన్యాయం ఎక్కడ?
ప్రాజాస్వామ్యమన్నాక అందరికీ సమన్యాయముండాలి. పవరున్నవాడికి ఒకలాగా, లేని వాడికి ఒకలాగ కాదు. కానీ దేనినీ అన్యాయమనడానికి లేదు. ఎందుకంటే ఆయా క్లాజుల్లో ఆయా తీర్పుల్ని తప్పుబట్టలేం. కానీ ప్రజలకి మాత్రం విషయం బోధపడక న్యాయం కూడా బలవంతుడి పక్షమే అనే అభిప్రాయాలు బలపడతాయి. సామాన్యుడు ఈ దేశంలో ధైర్యంగా బతికేది న్యాయస్థానాన్ని నమ్ముకునే. తనంత తానుగా గొడవలకి వెళ్లడు. ఎవరైనా తనని అన్యాయంగా బాధిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయం లభిస్తుందని నమ్ముతాడు. కానీ, నిజంగా అ పరిస్థితి వచ్చినప్పుడు అవతల ఉన్నది పవర్ఫుల్‌ పర్సన్‌ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Rahul Gandhi
Rahul Gandhi

న్యాయమూర్తే దేవడిగా..
సామాన్యుడు డబ్బిచ్చి పెద్ద లాయర్లని పెట్టుకోలేకపోచ్చు, కానీ న్యాయమేంటో న్యాయమూర్తి తెలుసుకుని సరైన తీర్పునిస్తారని ఆశిస్తాడు. సామాన్యుడి దృష్టిలో మన దేశంలోని ఏ న్యాయమూర్తైనా దేవుడితో సమానం. రాహుల్‌ గాం«ధీ లాంటి ప్రముఖుడు చేసిన నేరం, అతనికి పడిన శిక్ష చూసిన తర్వాత సామాన్యుడికి భయాలు, అనుమానాలు రెండూ తలెత్తుతున్నాయి. ఏదైతేనేం.. ఈ కేసులో అతనికి స్టే వస్తుంది. తాను ఎలాగూ ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఇక్కడ విషయం అది కాదు. జనం దృష్టిలో తప్పు చిన్నదే అయినా కోర్టు దృష్టిలో అది రెండేళ్ల జైలు శిక్ష పడేంత పెద్దది అనేదే ఇక్కడ చర్చ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version