Angallu Violence Case: తెలుగుదేశం పార్టీకి కాస్త ఉపశమనం. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ పార్టీ నేతలకు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుంగనూరు,అంగళ్లు కేసులో టిడిపి నేతలు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొద్దిరోజులు కిందట విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం ఆ తీర్పును వెల్లడించింది.
మాజీ సీఎం చంద్రబాబు ఆగస్టులో ఏపీవ్యాప్తంగా ప్రాజెక్టులను సందర్శించారు. అందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, అంగళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టిడిపి శ్రేణుల దాడిలో పోలీసులకు గాయాలయ్యాయని చెబుతూ చంద్రబాబుతో సహా టిడిపి నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాలామంది టీడీపీ నేతలను అరెస్టు చేశారు కూడా. ఈ తరుణంలో టిడిపి నేతలు దేవినేని ఉమ, పులివర్తి నాని, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తదితరుల 79 మంది టీడీపీ నాయకులు హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దాఖలు చేసుకున్నారు. దీంతో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అయితే పోలీసులు గాయాల పాలైన ఈ కేసులో బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొద్దిరోజుల కిందట విచారణ జరిగింది. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం నాడు మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ ఘటనలో ఏపీ పోలీస్ అధికారులు గాయపడ్డారని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా కలుగజేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పడంతో వైసిపి సర్కార్కు ఝలక్ తగిలినట్లు అయ్యింది.