TDP Janasena Alliance: వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్కా అని పవన్ కళ్యాణ్ తేల్చి చెబుతున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు 160 స్థానాలను గెలుచుకుంటాయని భావిస్తున్నారు. అధికార వైసిపి కేవలం 15 స్థానాలకు పరిమితం అవుతుందని జోష్యం చెబుతున్నారు. అయితే ఇలా గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తూనే.. రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు పై సైతం పవన్ ఫోకస్ పెట్టారు. అయితే పవన్ సీఎం కుర్చీపై కూర్చుంటే చూడాలనుకునే వారు మాత్రం కాస్త తట పటాయిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.
పవన్ నోట సంకీర్ణ ప్రభుత్వం అన్న మాట వినిపిస్తోంది. జనసేన,టిడిపి సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామమే అయినా.. 2014 నుంచి ఏపీలో సంకీర్ణ ప్రభుత్వాలకు చంద్రబాబు ఆజ్యం పోశారు.రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపికి భాగస్వామ్యం కల్పించారు.. అటు కేంద్ర ప్రభుత్వంలో టిడిపి భాగస్వామ్యం అయింది. వచ్చే ఎన్నికల్లో జనసేన, టిడిపి వస్తే ఇదే జరుగుతుంది. అంతమాత్రాన కూటమికి అదనంగా వచ్చే ప్రయోజనం లేదు.
అయితే ఇటువంటి సమయంలో పవన్ కు పవర్ షేరింగ్ ఇస్తామని ఒకే ఒక ప్రకటనతో కూటమి స్వరూపం మారిపోతుంది. ఏపీ రాజకీయాల్లోనే ఒక రకమైన మార్పు వస్తుంది. తొలి రెండున్నర ఏళ్లు కానీ.. మలి రెండున్నర ఏళ్లు కానీ పవన్ కు సీఎం పదవి కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ ఒక్క ప్రకటన చేస్తే చాలు.. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా కాపులు సంఘటితమయ్యే అవకాశాలు ఉంటాయి. కాపు, కమ్మ ఓట్లు గుంప గుత్తిగా కూటమికి టర్న్ కానున్నాయి.తెలుగుదేశం పార్టీ నుంచి ఈ తరహా ప్రకటన ఒక్కటి వస్తే చాలు.. ఏపీ రాజకీయ సమీకరణలే మారిపోనున్నాయి.
పవన్ టిడిపి పల్లకి మోస్తున్నారని కాపుల్లో ఒక రకమైన భావన నెలకొంది. తామంతా పవన్ ను సీఎం పోస్టులో చూడాలని పరితపిస్తుంటే.. ఆయన మాత్రం ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటన్న బాధ వారిలో ఉంది. దానిని వైసిపితో పాటు నీలి మీడియా మరింత ప్రేరేపిస్తోంది. కాపుల ఆత్మాభిమానమా? పవన్ కళ్యాణా? అన్నది తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఒక వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో కాపులు పునరాలోచనలో పడిపోయారు. ఇప్పటివరకు తన సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. పవన్ కు పవర్ షేరింగ్ ఇస్తే మాత్రం ఏకపక్షంగా మద్దతు తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ కానీ పవన్ ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఇస్తామని ప్రకటిస్తే కాపులు ఎగిరి గంతేస్తారు. 90 శాతం మంది కాపు జనాభా ఏకపక్షంగా తెలుగుదేశం, జనసేన కూటమికి మద్దతు తెలుపుతారు. ఇక తేల్చుకోవాల్సింది తెలుగుదేశం పార్టీయే.