NTR Health University: ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి విధ్వంసాలు, కూల్చివేతలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ముందున్న ప్రభుత్వాలు కొనసాగించిన పథకాలకు సైతం పేరు మార్చిన విషయం విదితమే. గతంలో ఏ ప్రభుత్వం సాహసించని విధంగా శాశ్వత పథకాలను సైతం నిలిపివేసింది. తన మార్కుతో అవే పథకాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ పేరిట పేరు మార్చి అమలు చేస్తోంది. తాజాగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేందుకు నిర్ణయించింది. రాత్రికి రాత్రే దీనిపై ఆన్ లైన్ లో కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఈ రోజు అసెంబ్లీలో సవరణ బిల్లు పెట్టేందుకు సమాయత్తమవుతోంది. నాడు వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక హెల్త్ యూనివర్సిటీ ఉండాలని దివంగత ఎన్టీఆర్ తలపోశారు. అధికారంలోకి రాగానే యూనివర్సిటీని ఏర్పాటుచేసి అభివృద్ది చేశారు. ఇప్పుడది దేశంలోనే పేరు మోసిన హెల్త్ యూనివర్సిటీ. దీనికి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎటువంటి సంబంధం కూడా లేదు. అయినా ఉన్నపలంగా ఎన్టీఆర్ పేరు తొలగించడానికి ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. ఐదు నెలల కిందట జిల్లాల పునర్విభజనలో చిన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు, టీడీపీ కంటే తామే ఎన్టీఆర్ కు ఆప్తులమన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచానికే తలమానికమైన హెల్త్ యూనివర్సిటీ పేరు నుంచి ఎన్టీఆర్ ను దూరం చేస్తున్నారు. వైస్ఆర్ హెల్త్ యూనివర్సటీగా పేరు మార్చేందుకు దాదాపు సిద్ధమయ్యారు.
అప్పట్లో వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా యూనివర్సిటీ అంటూ లేదు. ఆంధ్రా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీలే వైద్య విద్యార్థులకు గుర్తింపునిచ్చేవి. ఈ నేపథ్యంలో అనేక అక్రమాలు జరిగేవి. ఫేక్ సర్టిఫికేట్లు వెలుగుచూసేవి. వీటికి ప్రత్యేక పర్యవేక్షణ లేకపోవడంతో అనేక అవకతవకలు చోటుచేసుకునేవి. అందుకే ప్రత్యేక హెల్త్ యూనివర్సిటీ ఉండాలని దివంగత ఎన్టీఆర్ భావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మించాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే 1986లో హెల్త్ వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అటు తెలంగాణ, ఇటు కోస్తా, అటు రాయలసీమ ప్రజలకు అందుబాటులో ఉండేలా విజయవాడలో ఏర్పాటు చేశారు. అనతికాలంలో ఏర్పాటైన యూనివర్సిటీకి ‘యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’గా నామకరణం చేశారు. ఎన్టీఆర్ మరణం వరకూ అంటే 1998 వరకూ అదే పేరుతో కొనసాగుతూ వస్తోంది. ఆయన మరణానంతరం చంద్రబాబు ప్రభుత్వం యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే పేరుతో కొనసాగుతోంది. ఈ 24 సంవత్సరాల్లో అనేక ప్రభుత్వాలు మారినా పేరు మార్చేందుకు ఎవరూ సాహసించలేదు. కానీ జగన్ సర్కారు అకస్మాత్ గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Pawan Kalyan- Balineni Srinivas Reddy: జగన్‌కు షాక్.. పవన్‌కళ్యాన్‌తో టచ్‌లో ఉన్న ఆ కీలక నేత!
ఎంతోమంది వైద్య విద్యార్థులను జాతికి అందించిన యూనివర్సిటీ జోలికి ఏ ప్రభుత్వమూ వెళ్లలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఎప్పుడూ వేలు పెట్టిన దాఖలాలు లేవు. అటు తరువాత సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు సైతం గౌరవిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ పై ఉన్న గౌరవం, యూనివర్సిటీ ఏర్పాటుకు ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ ఆయన పేరిట కొనసాగాలని ఆకాంక్షించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు, శాశ్వత నిర్మాణాలకు గాంధీ పేర్లు ఎక్కువగా పెట్టేవారు. ఆ సమయంలో కూడా ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే ఆలోచనేదీ చేయలేదు. ఇప్పడు ఆయన పేరుతో ఏర్పాటుచేసేందుకు కుమారుడు జగన్ ప్రయత్నిస్తుండడం విశేషం.
అయితే దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం యూనివర్సిటీతో సంబంధం లేకపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఎలా ఏర్పాటుచేస్తారని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానిది దుశ్చర్యగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రానికి శాశ్వత పథకం తెచ్చి వైఎస్ పేరు పెట్టినా పర్వాలేదు కానీ.. ఇప్పటికే ఒకరి పేరు ఉన్నదాన్ని తొలగించి పేరు మార్చడం తగదంటున్నారు. ఈ రోజు వైసీపీ అధికారంలో ఉంది కదా అని పేరు మార్చితే.. తరువాత జనసేన అధికారంలోకి వస్తే చిరంజీవి పేరిట మార్చుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు చేర్చడం దాదాపు ఖరారైంది. దీనిపై వివాదం ముదిరే అవకాశముంది. రోజుకో కొత్త వివాదంతో పాత వివాదాన్ని మరిచిపోయేలా చేయడమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
Also Read:Pawan Kalyan: కేంద్ర మంత్రి గా పవన్…? లైట్ తీసుకుంటున్న పవర్ స్టార్!