Venkaiah Naidu: దక్షిణాది మంటలు లేవు. తెలుగు పై గుజరాతీ పెత్తనం అనే వ్యాఖ్యానాలు లేవు తెలుగు మీడియా ‘కమ్మ’నైన డిబేట్ లూ లేవు. మోడీ మరోసారి కొనసాగాలని అన్నారు. అమిత్ షా ఉంటే బాగుంటుందని కోరారు. కానీ వెంకయ్య నాయుడు ఒప్పుకోలేదు. ముళ్ల కిరీటం లాంటి పదవిని మరోసారి వద్దని తేల్చి చెప్పారు. తన కుమార్ దీప వెంకట్ స్థాపించిన స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలనే పూర్తి కాలం సాగాలని వెంకయ్య నిర్ణయించుకున్నారు. అద్భుతం జరిగితే తప్ప వెంకయ్యనాయుడి శేష జీవితం నెల్లూరు లోనే. ఆగస్టు పది తర్వాత నెల్లూరు కోమల్ విలాస్ లో భోజనం చేయవచ్చు. కావలి రోడ్ లో చిట్టి పెసర గారెలు తినొచ్చు. సూళ్లూరుపేట చేపల ఇగురు, తడ జామ కాయల్ని హాయిగా ఆస్వాదించవచ్చు.
ఆ నిర్ణయం వెనుక
వెంకయ్య నాయుడు ది మచ్చలేని రాజకీయ జీవితం. బీజేపీ లో చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగారు. వాజ్ పేయ్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి ఉద్దండ పిండాలతో పని చేశారు. మోడీ, అమిత్ షా వంటి వారితోనూ రాజకీయాలు నెరిపారు. తాను రాజకీయంగా అంచలంచలుగా ఎదుగుతున్నప్పటికీ కుమార్తెను, కొడుకును వాటికి దూరంగానే ఉంచారు. పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్నవాడు కాబట్టి స్వర్ణభారత్ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన తన కూతురిది అని చెప్పే వెంకయ్య.. ట్రస్ట్ కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. తాను ఉపరాష్ట్రపతి అయినప్పటికీ నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, న్యూఢిల్లీ.. ఇలా ఏ ప్రాంతాల్లో ట్రస్ట్ కు సంబంధించిన కార్యక్రమాలు జరిగినా తప్పకుండా హాజరవుతారు. నేలను, వ్యవసాయం చేసే రైతులను వెంకయ్య నాయుడు అమితంగా ఇష్టపడతారు. అందులో భాగంగానే స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, “రైతు నేస్తం” మాసపత్రిక సమర్పణ లో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు.
Also Read: Nadendla Manohar: సర్కస్ కంపెనీలా వైసీపీ ప్లీనరీ.. ఎండగట్టిన నాదెండ్ల.. రేపే జనసేన జనవాణి
ప్రోటోకాల్ ముళ్ళ కిరీటం అయిందా
వెంకయ్య నాయుడుది భోలా మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడేతత్వం. రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉన్న తత్వం. సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో మచ్చలేని నాయకుడు కాబట్టే.. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఈయన ప్రవేశపెట్టిందే. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోని అన్ని గ్రామాలకు మారుమూల రోడ్లను నిర్మించిన ఘనత వెంకయ్య నాయుడుకే దక్కుతుంది. మరోవైపు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలతోనూ సన్నిహిత సంబంధాలే నెరిపేవారు.
ఆయన లౌక్యం వల్ల అనేక సంక్లిష్ట సమస్యల నుంచి బీజేపీ తేలికగానే బయటపడగలిగింది. కానీ అనివార్య పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి నామినేట్ చేశారు. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన తన పదవికి వన్నె తెచ్చారు. చాలాసార్లు సభ నడిపేటప్పుడు అధికార పక్షం పైన ఆశ్రితపక్షపాతం గాని, ప్రతిపక్షాల పైన సవతి తల్లి ప్రేమ గాని చూపలేదు. హుందాగానే ఉన్నారు. హుందాతనాన్ని చూపారు. అంతటి హోదాలో ఉన్నప్పటికీ నెల్లూరు ఆహార్యాన్ని, ఆహారాన్ని వదల్లేదు. పైగా పలు సభలు, సమావేశాల్లో కూడా ఉపరాష్ట్రపతి అనే పదవి తనకు ముళ్ళ కిరీటంలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు తనకు ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయని, ఇష్టమైన వారిని కలవలేక పోతున్నానని బాధపడ్డారు. ఇటీవల రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్న మాటలకు నొచ్చుకున్నారు. సభలోనే బోరున ఏడ్చేశారు. ఇక అప్పటి నుంచే తాను ఈ రాజ్యాంగబద్ధ పదవులకు దూరంగా ఉండాలని వెంకయ్య నాయుడు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే గతం కంటే భిన్నంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అంతటి కరోనాలోనూ వ్యవసాయంలో మెరుగైన దిగుబడులు సాధిస్తున్న రైతులను సన్మానించారు.
ఉపరాష్ట్రపతి అయినప్పటికీ మోదీకి ఫేవర్ చేశారు
ముస్లిం ప్రవక్త పై బీజేపీ నేత నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంత కలకలం సృష్టించాయో చూశాం కదా. ఆ వ్యాఖ్యల ప్రభావం వల్ల ఇస్లాం దేశాలు భారత్ ను తీవ్రంగా ఎండగట్టాయి. ఈ క్రమంలోనే అదే సమయంలో ఇస్లాం దేశాల్లో పర్యటించిన వెంకయ్య నాయుడుకి నిరసన వ్యక్తం అయింది. తన వ్యూహ చతురతతో వెంకయ్య నాయుడు ఆ సమస్యను పరిష్కరించ గలిగారు. భారత్ పై ఇస్లాం దేశాలు వెనక్కి తగ్గాయి. అయితే వెంకయ్య నాయుడు పని తీరు తెలుసు కనుక మోడీ మరోసారి అలంకరించాలని కోరినా ఆయన తిరస్కరించారని సమాచారం. ప్రస్తుతం నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల వల్ల ముస్లింలలో బీజేపీపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇది మరింత పెరగకుండా ఉండేందుకు బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి నఖ్వీ ని ప్రకటించే యోచనలో ఉంది. కేరళ గవర్నర్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ నఖ్వీ పైనే బీజేపీ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా తన పదవికి నఖ్వీ రాజీనామా చేశారు.
Also Read:Eatela Rajender: కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీచేసి ఓడించడం ఈటలతో సాధ్యమవుతుందా?