https://oktelugu.com/

Sri Lanka Crisis 2022: సండే స్పెషల్: లంకా దహనానికి ఆ నలుగురే కారణమా?

Sri Lanka Crisis 2022: అడుగడుగునా అవినీతి.. అంతకు మించిన బంధుప్రీతి.. వెరసి ద్వీప దేశం నేడు దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తోంది. తినేందుకు తిండి లేదు. తాగేందుకు పాలు లేవు. బండి నడిపేందుకు పెట్రోల్ లేదు. సౌకర్యవంతమైన జీవితానికి కరెంటు లేదు. ఇలా ఎటు చూస్తే అటు కొరత. ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా.. ఎంతోమంది పర్యాటకులకు విడిది కేంద్రంగా ఉన్న శ్రీలంక.. భౌద్ధారామాలతో అలరారిన లంక..నేడు సంక్షుభిత దేశంగా ఇతర దేశాల సాయం కోసం బేల చూపులు […]

Written By: Rocky, Updated On : July 10, 2022 9:34 am
Follow us on

Sri Lanka Crisis 2022: అడుగడుగునా అవినీతి.. అంతకు మించిన బంధుప్రీతి.. వెరసి ద్వీప దేశం నేడు దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తోంది. తినేందుకు తిండి లేదు. తాగేందుకు పాలు లేవు. బండి నడిపేందుకు పెట్రోల్ లేదు. సౌకర్యవంతమైన జీవితానికి కరెంటు లేదు. ఇలా ఎటు చూస్తే అటు కొరత. ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా.. ఎంతోమంది పర్యాటకులకు విడిది కేంద్రంగా ఉన్న శ్రీలంక.. భౌద్ధారామాలతో అలరారిన లంక..నేడు సంక్షుభిత దేశంగా ఇతర దేశాల సాయం కోసం బేల చూపులు చూస్తోంది. ఒకప్పుడు చైనా అండ చూసుకొని భారత్ ను ఇబ్బంది పెట్టిన శ్రీలంక నేడు ఇంతటి అథమ స్థాయికి దిగజారడానికి కారణం ఏంటి? ఆ నలుగురి కబంధహస్తాల్లో చిక్కి శల్యం అవ్వడంలో చైనా పాత్ర ఎంత? అసలు ఇప్పట్లో కోలుకుంటుందా?

Sri Lanka Crisis 2022

Sri Lanka Crisis 2022

అవినీతి, బంధు ప్రీతి

శ్రీలంకలో రెండు దశాబ్దాలుగా బంధువులే రాజ్యాన్ని ఏలుతున్నారు. అందులో ఒకరు అధ్యక్షుడు, మరొకరు ప్రధాని, ఇంకో ఇద్దరు మంత్రులు, ఇక వారి కుమారుల్లోనూ ఇద్దరు అమాత్యులు, మరొకరు ప్రధానమంత్రి వ్యక్తిగత సిబ్బందికి చీఫ్. ఇలా ఫ్యామిలీ ప్యాకేజీలా ద్వీపదేశాన్ని రాజపక్స కుటుంబం సర్వనాశనం చేసింది. కమల్, మహీంద, గొటబాయ, బసిల్.. ఇది రాజపక్స సోదర చతుష్టయం. ఇక ఈ సోదరుల్లో మహీంద 2005 నుంచి 2015 వరకు అధ్యక్షుడిగా పని చేశారు. అంతకుముందు 2004 నుంచి 2005 కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. అదే సమయంలో 2019 నుంచి 2021 వరకు ఆర్థిక శాఖను చూశారు. ఇక 2018లో ప్రధాని అయినా మధ్యలోనే దిగిపోయారు. ఇక్కడే మరో ట్విస్టుకు తెరదీశారు. మళ్లీ ఏడాదికి అదే పదవి చేపట్టి ఇటీవల వరకు కొనసాగారు. గొటబాయ కూడా 2019 నుంచి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక చమల్ నౌక, విమానయాన, సాగునీటి మంత్రి, 2010 నుంచి 2015 దాకా పార్లమెంట్ స్పీకర్ గా కూడా వ్యవహరించారు. బసిల్ ఎంపీ గా ఉన్నారు. ఇటీవల వరకు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్థిక శాఖ, నౌకాయానం, విమానరంగం, సాగునీరు.. ఇవి ఏ దేశానికైనా ప్రధాన శాఖలు. కానీ ఇవన్నీ కూడా రాజపక్స సోదరుల ఆధీనంలోనే ఉండేవి.

Also Read: Venkaiah Naidu: వెంకయ్య నాయుడు ‘ఉపరాష్ట్రపతి’ పదవికి దూరం కావడం వెనుక షాకింగ్ కారణం

అడ్డగోలుగా దోచుకున్నారు

2009 వరకు శ్రీలంకను ఎల్టీటీఈ ఉగ్రవాదం ఇబ్బంది పెట్టింది. అప్పట్లో మహీంద అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2009లో ఎల్టీటీఈ అధినేత ప్రభాకర్ ను సహా మొత్తం ఈలంను నాశనం చేశారు. అదే సమయంలో సింహళ జాతీయవాదులకు మహీంద హీరో అయిపోయారు. ఇక దేశంలో ఆయన సోదరుల పెత్తనం విపరీతంగా పెరిగింది. ఫలితంగా అవినీతి రాజ్యమేలింది. ఈ నలుగురు సోదరులకు అడ్డే లేకపోవడంతో వారు ఏం చెబితే అదే వేదంగా నడిచింది.

చైనాకు దగ్గరవడం వల్లే

భౌగోళికంగా చూసుకున్నా, చారిత్రకంగా చూసుకున్నా భారత్ కు అతి దగ్గరగా ఉంటుంది శ్రీలంక. ఇప్పటికీ చెన్నైలోని పావు వంతుమంది సింహల దేశానికి చెందిన వారే ఉంటారు. దశాబ్దాల నుంచి భారత్ తో శ్రీలంకకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ భారత్ ను కాదని మహీంద అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనాతో జట్టు కట్టింది. ఇదే అదునుగా డ్రాగన్ దేశం లంకలో భారీగా పెట్టుబడులు పెట్టింది. రాజపక్సే సొంత ప్రాంతం, తీర ప్రాంతమైన హంబన్ టోటాలో చైనా ఆర్థిక దన్నుతో మహీంద సోదరులు పెద్ద నౌకాశ్రయం నిర్మించారు. కానీ చైనా దగ్గర తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో విఫలమై ఆ నౌకాశ్రయాన్ని పూర్తిగా డ్రాగన్ దేశానికి ధారాదత్తం చేశారు. ఇక శ్రీలంకలో చైనా పెట్టిన పెట్టుబడులను మహీంద సోదరులు విదేశాలకు తరలించారని ఆరోపణలు ఉన్నాయి.

గొంతు ఎత్తితే అంతే

ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ గతంలో సైన్యంలో లెఫ్ట్ నెంట్ కల్నల్ గా పని చేశారు. మహీంద అధ్యక్షుడు అయ్యాక గొటబాయ సైన్యానికి అనధికార అధినేత అయ్యాడు. ఎల్టీటీఈ పై మహీంద యుద్ధం చేసినపుడు గొటబాయ సారధ్యంలో సైన్యం అంతులేని అరాచకాలు సాగించింది. యుక్త వయసు ఆడపిల్లల మాన, ప్రాణాలతో ఆడుకుంది. ఇక ప్రభుత్వంపై ఎవరైనా గొంతు ఎత్తితే వారిని తెల్లగా తరలించి అదృశ్యం చేసేవారు. ఆడవాళ్ళు అయితే వారిని మానభంగం చేసి సెక్స్ స్లేవ్స్ గా మార్చేవారు. పూర్తి వ్యవసాయ ఆధారిత దేశమైన శ్రీలంకలో సేంద్రియ విధానంలో మాత్రమే వ్యవసాయం చేయాలని గొటబాయ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆదేశాలు జారీ చేశారు. వివిధ దేశాల నుంచి ఎరువుల దిగుమతులను పూర్తిగా నిలిపివేశారు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి ఆహార సంక్షోభం దేశాన్ని చుట్టుముట్టింది. నిత్యాసరాల ధరలు భగ్గుమన్నాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతకంతకు తగ్గిపోవడంతో దేశంలో కనీసం తాగేందుకు పాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.

Sri Lanka Crisis 2022

Sri Lanka Crisis 2022

ఇప్పట్లో కోలుకుంటుందా?

రాజపక్స సోదరుల చతుష్టయం వల్ల శ్రీలంక నిండా మునిగింది. ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అస్తవ్యస్త నిర్ణయాలు, అవినీతి పాలనతో దేశం మొత్తం దివాళా తీసింది. 2.2 కోట్ల జనాభా ఉన్న అందమైన ద్వీప దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. 700 కోట్ల డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేని స్థితికి ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దేశంలో కనీవిని ఎరుగని స్థాయిలో సంక్షోభం ఏర్పడింది. విదేశీ మారక నిల్వలు అడగంటిపోవడంతో ఆహారం, ఇంధనం, గ్యాస్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ కూడా లేదు.
పర్యాటక రంగం ప్రధాన ఆదాయ వనరుగా గా ఉన్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. చమురు ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు గొటబాయ సర్కార్ ఉచిత పథకాలు ఇంధనంపై భారీగా రాయితీ వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ పతనానికి దారితీశాయి.

సేంద్రీయ వ్యవసాయం పేరిట రసాయన ఎరువుల దిగుమతులపై పూర్తి నిషేధం విధించడంతో వ్యవసాయ రంగం పూర్తిగా అతలాకుతలం అయింది. దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి ఫలితంగా పేదల పై పెను భారం పడింది. ద్రవ్యోల్బణా న్ని అదుపు చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి వడ్డీ రేట్లు పెంచింది. ఫలితంగా శ్రీలంక రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 362 రూపాయలకు పడిపోయింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో దిగజారిన కరెన్సీ దాదాపు ఇదే. ప్రస్తుతం దేశంలో 25 మిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నట్టు ఆర్థిక శాఖ చెబుతోంది. చైనాకు తిరిగి చెల్లించాల్సిన అప్పులు అలాగే ఉన్నాయి. ఆహార భద్రతపై దేశానికి ఒక దిశా, దశ అంటూ లేకుండా పోయింది. పైగా రాజపక్స సోదరులు చేసిన అప్పులు కొండల్లా పేరుకుపోయాయి. ఇలాంటి ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్న శ్రీలంక కోలు కోవడానికి కొన్ని దశాబ్దాలే పట్టవచ్చు.

Also Read:Nadendla Manohar: సర్కస్ కంపెనీలా వైసీపీ ప్లీనరీ.. ఎండగట్టిన నాదెండ్ల.. రేపే జనసేన జనవాణి

Tags