Petrol Price Hike: తప్పు నీదే.. కాదు.. నీదే.. అంటూ కేంద్రంలోని మోడీ సర్కార్.. దేశంలో రాష్ట్రాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. దేశంలో అన్ని ధరలు పెరగడానికి కారణమవుతున్న ‘పెట్రో ధరల’ పాపం ఎవరిదన్నది ఇక్కడ ప్రశ్న. దేశ ప్రజలంతా ఈ ధరా భారంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్న వేళ అసలు ఈ ధరలు పెరగడానికి కారణం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. కాదు.. ఈ పాపం రాష్ట్రాలదేనని తాజాగా మోడీ సెలవిచ్చారు? ఇంతకీ ఈ పాపం ఎవరిది? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..
-రాష్ట్రాలే పన్ను పెంచాయంటున్న మోడీ..
పెట్రోధరలు తగ్గించలేదని ప్రధాని మోడీ కొన్ని రాష్ట్రాల సీఎంలపై కరోనా సమీక్షలో ఆరోపించారు. ఆ రాష్ట్రాలన్నీ బీజేపీయేతర ప్రభుత్వాలు కావడం విశేషం. పెట్రో పన్నులు ఎంత భారీగా వస్తున్నా.. వాటిపై రోడ్డు సెస్సులు విధిస్తూ పన్నులు తగ్గించేందుకు రాష్ట్రాలు సిద్ధంగా లేవని మోడీ ఆరోపించారు. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరారు. అయితే మోడీ ఇలా పిలుపు ఇవ్వగానే రాష్ట్రాలు తగ్గించే పరిస్థితిలో లేవు. దీనంతంటికి మోడీ చేసిన నిర్వాకమే కారణమని రాష్ట్రాల సీఎంలు ఆరోపిస్తున్నారు.
Also Read: Talasani Srinivas Yadav: మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు రూ. 50 వేల జరిమానా.. దేని కోసమో తెలుసా?
-రాష్ట్రాలను అనే ముందు కేంద్రం ఏం చేసింది?
కర్రు కాల్చి వాతపెట్టాక ఇప్పుడు యాంటిమెంట్ పూసే ప్రయత్నాన్ని మన మోడీ సార్ చేస్తున్నారు. పెట్రోల్ భారం రాష్ట్రాలే వేస్తున్నాయంటున్నారు. రాష్ట్రాలను అనే ముందు కేంద్రం ఏం చేసిందన్నది ఇక్కడ పరిశీలించాలి. మోడీ ఇంత బట్టలు చింపుకుంటూ ఆవేదన చెందే ముందు పన్నుల విషయంలో ఎందుకు పాటించరనేది ఇక్కడ అందరూ అడుగుతున్న ప్రశ్న. కరోనాకు ముందు రెండేళ్ల కిందట పెట్రోల్ ధర లీటరుకు రూ.70 కి అటూ ఇటూగా ఉండేది. రెండేళ్లలో ఇప్పుడు ధర రూ.120కి చేరింది. రెండేళ్లలోనే 50 రూపాయలకు పైగా పెంచేశారు. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడమే కారణమని మోడీ సర్కార్ చెబుతోంది. మరి తగ్గినప్పుడు ఇదే మోడీ సర్కార్ ఎందుకు తగ్గించలేదన్నది ప్రశ్న. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలోనే దేశంలో అత్యధిక వ్యాట్ విధిస్తున్నారు. ఇక కరోనా టైంలో పెట్రో ధరల పెంపుతో వచ్చిన రూ.26 లక్షల కోట్ల ఆదాయంలో కేంద్రం రాష్ట్రాలకు ఎందుకు వాటా ఇవ్వలేదని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
-2014లో మోడీకి ముందు ఎంత? ఇప్పుడెంత?
2014లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ బ్యారెల్ ధర రూ.120 డాలర్లు ఉండేది. అప్పుడు పెట్రోల్ ధర రూ.70 ఉండేది. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వ హయాంలో బ్యారెల్ ధర రూ.111 డాలర్ల లోపే ఉంది.. ఇంకా తక్కువగానే ఉంది. కానీ పెట్రోల్ ధర మాత్రం రూ.120 కి చేరింది. మరి ఇందులో తప్పు ఎవరిది అంటే అందరి వేళ్లు మోడీ సర్కార్ వైపే చూపిస్తున్నాయి. ఇందులో కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ ను అమాంతంగా పెంచేసి భారీగా పిండుకుంటోంది. పెట్రోల్ మీద కేంద్రం వసూలు చేసే ఎక్సైస్ ట్యాక్స్ రూ.30 వరకూ ఉంది. రాష్ట్రాలు మరో రూ.20 వసూలు చేస్తున్నాయి. ఇతర పన్నులు, సెస్ లు, సర్ చార్జీలు కలిపి ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్నాయి.
-పెట్రో పాపం మెజార్టీ కేంద్రానిదీ.. స్వలంగా రాష్ట్రాలదీ కూడా..
పెట్రో ఆదాయంలో ప్రధానమైన వాటా కేంద్ర ప్రభుత్వానికే వెళుతోంది. యూపీఏ ప్రభుత్వంలో ఏటా రూ. 60 వేల కోట్ల ఎక్సైజ్ ట్యాక్స్ మాత్రమే పెట్రో ఉత్పత్తులపై వేశారు. కానీ మోడీ ప్రభుత్వం ఇప్పుడు అది రూ. 4 లక్షల కోట్లకు చేర్చింది. అంటే ఎంత భారీగా ఎన్ని రెట్లు పెంచి ప్రజలను దోచుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. దీపావళికి రూ.10 తగ్గించి పండుగ చేసుకోండన్న కేంద్రం అందులో ఎక్సైజ్ ట్యాక్స్ ను మాత్రం తగ్గించకపోవడం గమనార్హం. ఇదే పెద్ద మోసంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ట్యాక్స్ అంతే ఉంచి.. రాష్ట్రాల వ్యాట్ తగ్గించాలని మోడీ కోరడం వాటి ఆదాయానికి గండికొట్టడమేనని అంటున్నారు.
-కేంద్రం తగ్గిస్తే పెట్రో ధరలు తగ్గుతాయి..
కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గిస్తే ఆటోమేటిక్ గా పెట్రోల్ ధరలపై రాష్ట్రాల వ్యాట్ కూడా తగ్గిపోతుంది. కానీ కేంద్రం తన ఆదాయాన్ని కోల్పోవడానికి మాత్రం ఇష్టపడడం లేదు. ఆ పనిచేయడం లేదు. దీంతో ఎవరికి వారు తప్పు మీదేనంటే మీది అంటూ కేంద్రం, రాష్ట్రాలు కొట్టుకు చస్తున్నాయి. ఇందులో ప్రజలను దోచుకుంటున్నాయి. పెట్రో ధరల పెంపుతో రవాణా ఖర్చు పెరిగి నిత్యావసరాలు సహా అన్ని ధరలు ఆకాశాన్ని అంటాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితికి దిగజార్చాయి. అసలు ఈ పెట్రోల్ పై మెజార్టీ దోపిడీ కేంద్రానిదీ అని.. అందులో రాష్ట్రాలు కూడా తమ వంతుగా దోచుకుంటున్నాయని తేటతెల్లమవుతోంది. ఈ క్రమంలోనే ఇందులో అత్యధిక భాగం కేంద్రానిదే తప్పు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Recommended Videos: