AP Women Commission: మహిళా కమిషన్.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అక్రుత్యాలను నియంత్రించి బాధితులకు స్వాంతన చేకూర్చడం కమిషన్ ప్రధాన విధి. కానీ కొన్నాళ్లుగా కమిషన్ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయింది. ప్రభుత్వాల అనుకూల సంస్థగా, అధికార పార్టీ తొత్తుగా మారిపోయింది. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో వ్యవస్థలన్నీ రాజకీయపరమయ్యాయి. బాధిత వ్యవస్థల్లో మహిళా కమిషన్ కూడా ఒకటి. విజయవాడ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలికి న్యాయం చేయడంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు బాధితురాలికి స్వాంతన చేకూర్చే చర్యలు చేపట్టకపోగా తనకు టీడీపీ అధినేత చంద్రబాబు, బొండా ఉమాలు అవమానించారంటూ నోటీసులు జారీచేశారు. మహిళా కమిషన్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.
దీంతో మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు సమస్య పక్కదారి పట్టేసింది. అసలు మహిళా కమిషన్ ఏర్పాటు ఉద్దేశ్యమేమిటి? ఆ కమిషన్ కు ఉన్న అధికారాలతో బాధితులకు ఎంతవరకు న్యాయం చేయవచ్చు అన్న కనీస ఆలోచన చేయలేదు. అదో రాజకీయ అంశంగా మార్చేశారు. వైసీపీ అనుబంధ విభాగంగా మహిళా కమిషన్ మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేశారన్న ఆగ్రహంతో చంద్రబాబు, బొండా ఉమాలతో వాసిరెడ్డి పద్మ వాదనకు దిగారు. ఆస్పత్రిలో పరామర్శ సమయంలో ఎదురుగా బాధితురాలు, బాధిత కుటుంబసభ్యులు ఉన్నప్పుడు ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. సాధారణంగా విపక్షం అన్నప్పుడు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతారు. దానికి అధికార పక్షం నుంచి కౌంటర్ ఉంటుంది. కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాసిరెడ్డి పద్మ అటాక్ చేయడమేమిటన్నది ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. బాధితుల ఎదుటే వాదనకు దిగడం ఎబ్బెట్టుగా ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నీకు కేబినెట్ హోదాతో పదవి కల్పించిన ప్రభుత్వం, ప్రభుత్వ అధినేతపై అభిమానం ఉండొచ్చు కానీ.. ఆ పోస్టుకు ఉన్న ఔన్నత్యాన్ని తగ్గించేలా బహిరంగ వాదనలకు దిగడం విమర్శలపాలవుతోంది.
Also Read: Talasani Srinivas Yadav: మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు రూ. 50 వేల జరిమానా.. దేని కోసమో తెలుసా?
రాజకీయ దురుద్దేశం..
పరామర్శ సమయంలో వాదనకు దిగారు. పరస్పరం వాదించుకున్నారు. అంతటితో వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా ప్రధాన విపక్ష నేతకు కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసు ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. బాధితురాలి కుటుంబం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే వారిని పట్టించుకోని మహిళా కమిషన్ సభ్యులు టీడీపీని, అధినేత చంద్రబాబును, మరో నేత బొండ ఉమాను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మిగతా సభ్యులు కూడా చైర్ పర్సన్ పద్మనే అనుసరిస్తున్నారు. వాస్తవానికి గత మూడేళ్లలో నిజంగా ఏపీలో అన్యాయమైపోతున్న మహిళల గురించి ఒక్క శాతం కూడా కన్సర్న్ చేయలేదు. దీంతోమహిళా కమిషన్ .. మహిళపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చేస్తుందని.. బాధితుల్ని ఆదుకుంటున్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటూ… రాజకీయాల కోసమే సమయం సమయం కేటాయించడం … మహిళా కమిషన్ కార్యాలయాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం… తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. లేని అధికారాన్ని దఖలు పర్చుకుని చేసిన రాజకీయ విన్యాసాలతో… మహిళా కమిషన్‌కు ఉన్న విలువ కూడా ఇప్పుడు చర్చనీయాంసమైందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
హోదా వెలగబెడుతూ..
కేబినెట్ హోదా.. నెలసరి లక్షల్లో వేతనం…మహిళా కమిషన్ చైర్ పర్సన్ తో పాటు సభ్యుల దర్జా ఇది. నామినేటెడ్ పోస్టుల వేదికగా మహిళా కమిషన్ ను మార్చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నన్నపనేని రాజకుమారికి పదవిని కట్టబెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాసిరెడ్డి పద్మను నియమించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ.. పార్టీ వాయిస్ ను సమర్ధవంతంగా వినిపించిన పద్మకు గడిచిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాన్స్ దక్కలేదు. జగన్ దయతలచి కేబినెట్ హోదాతో సమానమైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చేసరికి పద్మ ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ ఆ పదవి పరమావధి ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు, అక్రుత్యాలు పెరిగాయి. కానీ వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడంలో వాసిరెడ్డి పద్మ నేత్రుత్వంలోని మహిళా కమిషన్ టీమ్ కనీస ప్రయత్నం చేయలేదు సరికదా.. పదవులిచ్చిన ప్రభుత్వ ప్రాపకం కోసం పనిచేస్తుండడం అన్యాయం. ఇకనైనా తీరు మార్చుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.