Telangana High Court: హైదరాబాద్ మహానగరంలోని మూసీ నది ఒడ్డున రాజసంతో కనిపించే రాష్ట్ర హైకోర్టు వేరే ప్రాంతానికి తరలి వెళ్ళనుందా? ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఇప్పటికిప్పుడు తెలంగాణ హైకోర్టును తరలించాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు కానీ.. తెలంగాణ హైకోర్టు భవనాన్ని ఇతర ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన న్యాయవాదుల్లో కలకలం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ లోని సర్వేనెంబర్ 282, 299 లో ఉన్న 100 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ వేలానికి ఉంచాయి. ఆ వేలాన్ని అడ్డుకొని, ఆ భూమిని హైకోర్టుకు కేటాయించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ అసోసియేషన్ కార్యవర్గానికి చెందిన కొందరు సభ్యులు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే కు వినతి పత్రం అందజేసినట్టు సమాచారం. దానిని సుమోటోగా తీసుకొని ఆదేశాలు జారీ చేయాలని వారు కోరినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి హైకోర్టుకు బుద్వేల్ లో భూములు కేటాయించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది పెండింగ్లో ఉంది. ఈనెల 4న ఆ భూములను వేలం వేస్తున్నట్టు హెచ్ఎండీఏ పత్రికా ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన జారీ చేయడం సరికాదని కార్యవర్గ సభ్యులు పేర్కొంటున్నారు. హైకోర్టు ఆధునిక భవన నిర్మాణానికి బుద్వేల్ లోని సదరు సర్వే నెంబర్లలో 100 ఎకరాలు కేటాయించాలనే ప్రతిపాదన 2012 నుంచి ఉంది. దానిని పట్టించుకోకుండా వేలానికి పెట్టడం చెల్లదని వారు పేర్కొంటున్నారు. 12 మార్చిలో 100 ఎకరాల కేటాయించాలని కోరుతూ ఇదే హైకోర్టు నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్ళింది. ఆ నేపథ్యంలోనే బుద్వేల్లో స్థలాన్ని గుర్తించింది. ఆ భూములను వేలం వేయడానికి పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ నిర్ణయం తీసుకోవడం హైకోర్టు, న్యాయవాదుల ప్రయోజనాలకు విరుద్ధమని, చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకోవాలని న్యాయవాదులు కోరుతున్నారు. హైకోర్టు తరలింపు ప్రతిపాదనలను న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఈ ప్రతిపాదన వచ్చిన ప్రతిసారి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇది రియల్ ఎస్టేట్ కుట్ర అని ఆరోపించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు జనరల్ బాడీ ఆమోదం లేకుండా చీఫ్ జస్టిస్ ను కలుస్తున్నారన్న అంశంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బాడీ ఆమోదం లేకుండా బుద్వేల్ లో భూమిని కేటాయించాలని, అక్కడ అత్యాధునిక వసతులతో నూతన భవనం కట్టాలని, అక్కడికి తరలిపోతామని కార్యవర్గ సభ్యులు కోరు తుండటం పట్ల న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు తరలించే ప్రసక్తి లేదని, బుద్వేల్ లో 100 ఎకరాలను ప్రభుత్వం ఏం చేసుకున్న తమకు సంబంధం లేదని అంటున్నారు. కాగా, కార్యవర్గ సభ్యులు రాసిన లేఖను చీఫ్ జస్టిస్ సుమోటోగా తీసుకుంటారా లేదా అనే అంశం ఉత్కంఠ గా మారింది.