Bihar Election Result 2025: బీహార్( Bihar) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏయే అంశాలపై పోరాటం చేయాలో స్పష్టం చేసింది. అధికార పార్టీ ఎలా నడుచుకోవాలో కూడా సూచించింది. ప్రతిపక్షాలు ఏ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలో.. దేనికి దూరంగా ఉండాలో కూడా స్పష్టమైన సంకేతాలు పంపింది. అయితే అన్నింటికీ మించి బీహార్ ప్రజల సానుకూల దృక్పథాన్ని ఈ ఫలితం తెలియజేసింది. సుదీర్ఘకాలం అధికారం కట్టబెడితే వచ్చే ఫలితాలు ఇలా ఉంటాయి అని తెలియజెప్పింది. ప్రధానంగా ప్రభుత్వ సుస్థిరత ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని బీహార్ ప్రజానీకం ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకే మరోసారి ఎన్డీఏ కు అధికారాన్ని కట్టబెట్టింది. నిజంగా ఇది బీహార్ ప్రజల సాహస నిర్ణయమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 సంవత్సరాల పాటు నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి అవకాశం ఏ నేతకు చిక్కలేదు. అయితే నితీష్ అధికారంలో వచ్చిన తరువాత అయితే నితీష్ అధికారంలో వచ్చిన తరువాత శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయే తప్ప.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అయినా సరే నితీష్ కుమార్ ను మరోసారి బీహార్ ప్రజలు సమ్మతించారంటే అది నిజంగా సాహసమే.
* ఆ ఇద్దరు మాత్రమే..
ఉమ్మడి ఏపీలో( combined AP state) సుదీర్ఘకాలం రెండోసారి వరుసగా అధికారంలోకి వచ్చింది కేవలం ఇద్దరే. 1995లో టిడిపిలో సంక్షోభం ద్వారా అధికారంతోపాటు పార్టీని హస్తగతం చేసుకున్నారు చంద్రబాబు. ఆయన అధికారంతోపాటు పార్టీ మూన్నాళ్ళ ముచ్చట అని అంతా భావించారు. కానీ 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు చంద్రబాబు. 2004లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగలిగారు. 2009లో అదే రాజశేఖరరెడ్డి రెండోసారి విజయం సాధించారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తెరపైకి వచ్చింది. కానీ తొలిసారిగా విజయం సాధించిన చంద్రబాబు 2019లో ఓడిపోయారు. 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి 2024లో ఓటమి చవిచూశారు. అంటే తెలుగు ప్రజలు ఒకే పార్టీకి వరుసగా అధికారం ఇవ్వడం చాలా అరుదు. కానీ బీహార్ ప్రజలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 సంవత్సరాలు పాటు ఒకే వ్యక్తికి అధికారం ఇవ్వగలిగారు.
* కానరాని అభివృద్ధి
అయితే బీహార్ కు నితీష్ కుమార్( Nitish Kumar) ఏమైనా చేశారు అంటే అది శాంతి భద్రతల రూపంలోనే. శాంతిభద్రతలను కట్టడి చేసి అక్కడ పరిస్థితిని ఒక అదుపులోకి తెచ్చారు. కానీ అభివృద్ధిని ఆశించిన స్థాయిలో చేయలేకపోయారు. ఇప్పటికీ బీహార్ ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతుంటారు. అటువంటిప్పుడు బీహార్ లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు కాస్త మెజారిటీకి ఒకటి రెండు సీట్లు అధికంగా ఉండే ఎన్డీఏ కూటమి.. ఇప్పుడు ఏకంగా క్లీన్ స్వీప్ చేయడం అంటే సాహసమే. ఎందుకంటే గెలుస్తుందని నమ్మకం లేని స్థితిలో ఎన్డీఏ కూటమి ఇంతటి విజయానికి కారణం బీహార్ ప్రజలు. సుస్థిర ప్రభుత్వాన్ని నిలపడం ద్వారా అభివృద్ధిని ఆశిస్తున్నారు. కానీ ఏపీలో అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది. అభివృద్ధిని పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్న టిడిపిని ఆదరించడం లేదు. పోనీ సంక్షేమంతో ప్రజల ఆర్థిక అభివృద్ధి పెంచుతామని ఆశిస్తున్న వైసీపీని సైతం ఉంచడం లేదు. అయితే ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల ఫలితాలు ఏపీ ప్రజలకు కనువిప్పు కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోంది. ఆపై సంక్షేమ పథకాల అమలు జరుగుతోంది. బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించిన మాదిరిగానే.. ఏపీలో ఆలోచిస్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే. టిడిపి కూటమికి ఉపశమనమే.