Delhi assembly election results 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఈసారి బీజేపీదే అధికారమని తెల్చాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావని, ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ నిజం కాలేదని ఆప్ ఖండించింది. గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. కానీ, శనివారం(ఫిబ్రవరి 8న) ప్రారంభమైన కౌంటింగ్‌లో ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలే ఎగ్జాక్ట్ ఫలితాల్లోనూ కనిపిస్తున్నాయి. బీజేపీ 27 ఏళ్ల తర్వాత హస్తినలో కాషాయ జెండా ఎగురవేయబోతోంది. అధికార ఆప్ నాలుగోసారి అధికారంలోకి రావాలన్న ఆశలు దాదాప కనుమరుగయ్యాయి. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత 28 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 36 దాటి 42 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఇక 12 స్థానాల్లో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీగా ఆధిక్యం కొనసాగుతోంది. ఈ స్థానాల్లో అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 1000 కన్నా తక్కువగా ఉంది. దీంతో ఫలితాలు ఎటువైపైనా మారొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. ఇక ఈ రెండు పార్టీల విషయం పక్కన పెడితే.. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరిగినా ఈ సారి కూడా హస్తం పార్టీ మరోసారి సున్నా స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
పోస్టల్ బ్యాలెట్‌లో ఒక స్థానంలో ఆధిక్యం..
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి మూడో రౌండ్ ఈవీఎం ఓట్ల లెక్కింపు వరకు కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యం కనబర్చింది. నాలుగో రౌండ్ కౌంటింగ్‌కు వచ్చే సరికి ఉన్న ఒక్క స్థానంలో కూడా వెనుకబడింది. దీంతో ఈసారి కూడా కాంగ్రెస్ ఢిల్లీలో ఖాతా తెరిచే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. 50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితమయ్యారు. 2015, 20120 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈసారి కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంటుందని ఫలితాల ట్రెండ్స్‌ను బట్టి తెలుస్తోంది. దీంతో ఢిల్లీలోని ఆ పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయారు.
హ్యాట్రిక్ జీరో..
ఇక ఢిల్లీలో కాంగ్రెస్ వరుసగా మూడోసారి సున్నా స్థానాలకే పరిమితమైంది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24.55 శాతం ఓట్లతో 8 స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల తర్వాత ఆప్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత 2015లో మద్దతు ఉపసంమరించుకోవడంతో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 9.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక 2020 ఎన్నికల్లో అయితే మరీ దారుణంగా కాంగ్రెస్ ఓట్ల శాతం 4,2కు పడిపోయింది. ఈ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేదు. ఈసారి 6 శాతానికిపైగా ఓట్లు వచ్చినా.. ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఢిల్లీలో వరుసగా మూడోసారి సున్నా స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి.