Sikkim: నిన్న వయనాడ్.. నేడు సిక్కిం.. ప్రకృతితో పెట్టుకుంటే విలయాన్ని చవి చూడాల్సిందే.. వీడియో వైరల్..

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో వర్షాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కొండ చరియలు విరిగిపడి వందలాదిమంది మృతి చెందారు. వేలాది గృహాలు ధ్వంసం అయ్యాయి. ఇంతటి విలయానికి ప్రధాన కారణం అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేయడం.. అందువల్లే ఇంతటి వినాశనం జరుగుతోంది.

Written By: Neelambaram, Updated On : August 28, 2024 6:55 pm

Sikkim

Follow us on

Sikkim: వయనాడ్ ప్రాంతంలో ప్రకృతి విపత్తు వల్ల విస్తారంగా వర్షాలు కురిసాయి. కొండ ప్రాంతం కావడంతో చరియలు విరిగిపడి కని విని ఎరుగని స్థాయిలో నష్టం వాటిల్లింది. దానిని మర్చిపోకముందే.. సిక్కిం రాష్ట్రంలో మరో ప్రకృతి విలయం చోటుచేసుకుంది. కొండ ప్రాంతమైన సిక్కిం రాష్ట్రంలో విస్తారంగా చెట్లు ఉంటాయి. ఈశాన్య రాష్ట్రం కావడంతో అక్కడ ప్రకృతి కూడా చాలా రమణీయంగా ఉంటుంది. ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలలో ప్రత్యేకమైన వాతావరణాన్ని సిక్కిం రాష్ట్రం కలిగి ఉంటుంది. అలాంటి రాష్ట్రంలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లు మొత్తం ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో సహాయం కోసం అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు అక్కడి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసింది. వరద బాధితులకు సహాయం అందించేందుకు సిబ్బందిని రంగంలోకి దించింది. అయితే సిక్కింలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో అక్కడి విలయానికి సజీవ దృశ్యంగా నిలుస్తోంది.

విస్తారంగా వర్షాలకు కురవడంతో..

వర్షాలు విస్తారంగా కురవడం వల్ల.. వరద నీరు పోటెత్తుతోంది. ఆ నీరు మొత్తం కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా కిందికి వస్తోంది.. దీంతో కొండల్లోని చరియలు విరిగి పడుతున్నాయి. ఇలా కొండ చరియలు విరిగిపడి సిక్కిం రాష్ట్రంలో తీస్తా నది పక్కన నిర్మించిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ పూర్తిగా ధ్వంసం అయింది. 500 మెగా పట్ల పవర్ స్టేషన్ కు ఆనుకొని ఉన్న ఒక కొండ కొద్దిరోజుల కురుస్తున్న వర్షాలకు కొద్దికొద్దిగా కూలుతోంది. బుధవారం విస్తారంగా వర్షం కురవడంతో కొండ ప్రధాన భాగం మొత్తం జారిపోయింది. అది మొత్తం పవర్ స్టేషన్ పై పడింది. ఫలితంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. స్తంభాలు ఎక్కడికి అక్కడే కూలిపోవడంతో అపారమైన నష్టం వాటిల్లింది. ఈ నష్టం విలువ వందల కోట్లలో ఉంటుందని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ బాధ్యులు చెప్తున్నారు. అయితే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా వివిధ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో చెట్లను తొలగించడం, కొండలను పిండి చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా తన వైవిధ్యాన్ని కోల్పోతోంది. దీంతో విస్తారంగా వర్షాలు కురవడంతో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. అందువల్లే నష్టం అపారంగా చోటు చేసుకుంటున్నది. ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు విద్యుత్ స్టేషన్ లు నిర్మించడం వల్ల కూడా వరదలు సంభవిస్తున్నాయని ఇక్కడి ప్రజలు అంటున్నారు.. విద్యుత్ స్టేషన్ ల నిర్మాణం కోసం నదుల ప్రవాహ మార్గాన్ని మార్చడం వల్ల.. అవి ఇతర ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్నాయని.. అందువల్లే ఈ స్థాయిలో నష్టం చోటు చేసుకుంటున్నదని సిక్కిం ప్రజలు వాపోతున్నారు.