Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కు గడువు సమీపిస్తోంది. మరికొద్ది గంటల్లో లెక్కింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సందడి చేశాయి. ఒకటి రెండు సంస్థలు తప్ప.. మిగతా సర్వే సంస్థలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. కానీ ఎక్కడో ఒక అనుమానం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? లేదా? అన్న సందేహం. ఇటువంటి తరుణంలో అసలు సిసలైన ఓ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించింది. దీంతో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి.
దేశంలో పేరు మోసిన సర్వే సంస్థల్లో మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్ ఒకటి. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ కు సంబంధించి ఆలస్యంగా ఫలితాలు వెల్లడించింది. అందులో భాగంగా తెలంగాణ ఫలితాలను సైతం ప్రకటించింది. అయితే ఏ ప్రాంతంలో.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అన్నది పూర్తి గణాంకాలతో సహా వెల్లడించడం విశేషం. పూర్తి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే ఈ సర్వే సంస్థ ఫలితాలు రాజకీయ పార్టీల్లో గుబులు రేపుతున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఈ ఫలితాలు ఉన్నాయని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పుకొచ్చాయి. కానీ మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్ సంస్థ మాత్రం కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుందని వెల్లడించడం విశేషం. ఆ పార్టీకి 63 నుంచి 73 సీట్లు వరకు వస్తాయని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఒక్క హైదరాబాదులో మినహాయించి.. మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుందని వెల్లడి కావడం విశేషం.
బీఆర్ఎస్ పార్టీ 34 స్థానాలతో సరిపెట్టుకుంటుందని.. ఒకవేళ త్రిముఖ పోటీలో మరో 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అంతకుమించి సీట్లు రావని కూడా స్పష్టం చేసింది. బిజెపి సైతం నాలుగు నుంచి ఎనిమిది స్థానాలకు పరిమితం అవుతుందని తేల్చేయడం విశేషం. అయితే ఈసారి మజ్లిస్ కు సైతం ఒక స్థానం తగ్గనుందని సర్వే తేల్చింది. ఆ పార్టీ నాంపల్లి సీటును కోల్పోవడం ఖాయమని స్పష్టం చేసింది. మరోవైపు సీఎంగా ఎవరు ఉండాలన్న ప్రజాభిప్రాయంలో మాత్రం కేసీఆర్ ముందంజలో ఉన్నారు. కెసిఆర్ కు ఏకంగా 32 శాతం మంది అంగీకారం తెలిపారు. రేవంత్ రెడ్డికి 21%, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అనేదానిపై 22% మద్దతు లభించినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఫలితాలు రేపు మధ్యాహ్నం కి వెల్లడి కానున్నాయి.