YS Jagan – Ys Sharmila : మన చేతికి ఉన్న ఐదు వేళ్ళు ఒకే విధంగా లేవు. అలాంటిది ఒక కుటుంబానికి చెందినవారు కలిసి ఎలా ఉంటారు? అంటే మా ఉద్దేశం వీడియో ఉండాలని కాదు. కానీ ఈ మాత్రం సోయిలేని ఓ వర్గం మీడియా మాత్రం జగన్ విషయంలో అతడి సోదరి షర్మిల విషయంలో రెచ్చిపోయి.. చివరికి నవ్వుల పాలయింది. జగన్, షర్మిలకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి అనేది వాస్తవం. వారు దానిని ఎక్కడా దాచుకోలేదు కూడా. చివరికి తమ తండ్రి వర్ధంతి, జయంతి సందర్భంగా విడివిడిగానే వెళ్లారు. అంటే వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు.. మరి దానిని అలా వదిలేయక.. సరే ఇంకేమైనా విషయం తెలిస్తే అక్కడితోనే ఆగకుండా.. ఇంకా రంధ్రాన్వేషణ చేసింది ఆ వర్గం మీడియా. ఇన్ని రోజులపాటు రకరకాల వక్రీకరణలకు దిగింది. మరి ఈ రోజున షర్మిల తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను తన తండ్రి సమాధి వద్ద ఉంచిన తర్వాత.. నేరుగా తన అన్న దగ్గరికి వెళ్లి పోయింది. తోబుట్టువు కదా.. తన కుమారుడి వివాహానికి రావాలని కోరింది. కుటుంబం అన్నాక గొడవలు కామన్. షర్మిల తో మనస్పర్ధలు ఉన్నాయని జగన్ చెప్పలేదు. తన చెల్లి మీద ఒక్క మాట కూడా తూలలేదు. షర్మిల కూడా అంతే. కానీ మధ్యలో ఓ వర్గం మీడియా మాత్రం షర్మిల కోణంలో జగన్ మీద వ్యక్తిగత దాడి చేసింది. అడ్డగోలుగా వార్తలు రాసింది. ఇష్టానుసారంగా ప్రచారం చేసింది.
చంద్రబాబు నాయుడితో హరికృష్ణ కుమారులకు సరైన సంబంధాలు లేవు. ఆ మధ్య హరికృష్ణ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు అక్కడికి వచ్చిన కేటీఆర్ తో రాజకీయాలు మాట్లాడారు అనే ఆరోపణలు ఉన్నాయి. చివరికి బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు గ్యాప్ ఉందని.. ఇటీవల నందమూరి సుహాసిని కుమారుడి వివాహ వేడుకకు వెళ్ళినప్పుడు బాలకృష్ణ వారిని పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి వీటిని ఆ వర్గం మీడియా ఎందుకు రాయలేదు? వీటి గురించి ఎందుకు ప్రచారం చేయదు? జగన్ విషయంలో ఒకలాగా, చంద్రబాబు విషయంలో ఒకలాగా ఆ మీడియా ఎందుకు పనిచేస్తోంది? ఎప్పుడైనా ఆ మీడియా పెద్దలు దీని గురించి ఆలోచించారా.. ఇలా అడ్డగోలుగా వార్తలు ప్రసారం చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారు అనే సోయి వారికి లేదా? ఈ వర్గం మీడియాలో కీలకంగా ఉన్న ఓ పత్రికాధిపతి కి , ఆయన కుమారుడికి (ఆయన క్యాన్సర్ తో చనిపోయాడు) మాటలే ఉండేవి కావట. అక్కడిదాకా ఎందుకు ఆయన కోడలు కూడా ఆ పత్రికాధిపతిని అసహ్యించుకునేదట. మరి ఈ విషయాన్ని ఆ పత్రికాధిపతి ఎప్పుడైనా బయట పెట్టుకున్నారా? అంటే ఆ పత్రికాధిపతి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కాబట్టి మినహాయింపు ఉంటుంది అనుకుంటున్నారేమో.. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ పరోక్షంగా వాటిని ప్రభావితం చేస్తున్నప్పుడు.. ఆయన కుటుంబ విషయాలను ఎందుకు బయట పెట్టుకోరు? ఇక అదే వర్గం మీడియాలో మరో పత్రికాధిపతి పరిస్థితి కూడా అంతే. ఆయనకు, ఆయన అల్లుడికి అస్సలు పొసగదు. ఆయనకు, ఆయన కోడలికి కూడా మధ్యయుద్ధ వాతావరణమే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ విషయాన్ని ఆ పత్రికాధిపతి కూడా బయట పెట్టుకోడు. ఎందుకంటే మనం చేస్తే సంసారం.. ఎదుటి వాళ్ళు చేస్తే మరొకటి..
మరి ఆ పత్రికాధిపతులకు ఉన్న మినహాయింపు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉండదు? చంద్రబాబు నాయుడు విషయంలో వారు చూపిస్తున్న ఉదారత జగన్ విషయంలో ఎందుకు చూపించరు? జగన్మోహన్ రెడ్డికి, ఆయన సోదరికి మధ్య విభేదాలు ఉండవచ్చు. ఇంకా చాలా గొడవలు జరిగి ఉండవచ్చు. అవి అంతవరకే రాస్తే ఆ మీడియా కూడా క్రెడిబిలిటీ ఉండేది. కానీ అంతకుమించి చొచ్చుకు వెళ్లి ఏదో జరిగిపోతోంది, ఇంకేదో అయిపోతోంది అని.. ఇన్నాళ్లు ఆ పత్రికాధిపతులు అడ్డగోలుగా రాశారు. అడ్డగోలుగా ప్రచారం చేశారు. మరి ఇవాళ ఆమె తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇచ్చేందుకు నేరుగా తన అన్న ఇంటి వద్దకు వెళ్ళింది. ఆహ్వాన పత్రికను అందించి చిరునవ్వుతో బయటికి వచ్చింది. ఇన్నాళ్లపాటు అడ్డగోలుగా ప్రచారం చేసిన ఆ పత్రికాధిపతులు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? గురిగింజ తన నలుపు తాను ఎరుగదన్నట్టు.. ఆ పత్రికాధిపతులు కూడా తమ కింది నలుపును తాము ఎరుగడం లేదు. అన్నట్టు ఇప్పుడు షర్మిల కోణంలో రాయడానికి ఏమీ లేదు కాబట్టి.. రేపటినాడు జగన్మోహన్ రెడ్డి పెళ్లికి వెళ్తాడా? వెళ్లడా? అనే వక్రీకరణలకు కూడా ఆ పత్రికాధిపతులు దిగుతారానడంలో ఎటువంటి సందేహం లేదు.