Jagan – Sharmila : జగన్ తో ఆయన సోదరి షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకకు రావాలని జగన్ కు శుభలేఖ అందజేశారు. కుమారుడు, కాబోయే కోడలతో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి షర్మిల వెళ్లారు. సోదరుడు జగన్, వదిన భారతీయులకు పెళ్లి కార్డు ఇచ్చి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. అరగంట పాటు వారితో భేటీ అయ్యారు. ఇది పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లో షర్మిల అడుగుపెడుతున్న తరుణంలో.. ఆ విషయం ఏమైనా చర్చకు వచ్చిందా? రాజకీయాల గురించి మాట్లాడారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
సుమారు మూడు సంవత్సరాల అనంతరం జగన్ ను ముఖాముఖిగా షర్మిల కలిశారు. అన్న నుంచి నిరాదరణ ఎదురు కావడంతో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఆ ఇద్దరు కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఒకటి రెండుసార్లు ఇడుపులపాయలో కలిసినా ముఖా ముఖి అయిన సందర్భాలు లేవు. ఇప్పుడు కుమారుడి పెళ్లి వివాహ వేడుకలకు ఆహ్వానించడం అనివార్యంగా మారింది. తొలుత కడపలోని ఇడుపులపాయలో తండ్రి ఘాట్ వద్ద పెళ్లి ఆహ్వాన పత్రిక ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం నేరుగా అక్కడి నుంచి తాడేపల్లి వచ్చి సోదరుడికి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు.
అయితే అరగంట పాటు జగన్ తో భేటీ అయ్యేసరికి రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. రాజకీయ అంశాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ ను కలిసిన తర్వాత నేరుగా మీడియాతో మాట్లాడకుండానే తాడేపల్లి నుంచి షర్మిల బయలుదేరారు.గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న షర్మిలకు విలేకరులు చుట్టుముట్టారు. మీడియాతో మాట్లాడాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో తమ భేటీ గురించి షర్మిల వెల్లడించాల్సి వచ్చింది. సీఎం జగన్ గారిని నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి రమ్మని ఆహ్వానించాను. జగన్ సానుకూలంగా స్పందించారు. పెళ్లి అనేది చాలా ముఖ్యమైన విషయం. అందరూ నా కుమారుడి పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అంటూ మీడియాకు షర్మిల వెల్లడించడంతో.. ఈ భేటీలో రాజకీయ అంశాలు ఏవీ లేవని తేలింది.