Amaravati Farmers: రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. ఎప్పుడూ రాజకీయాలు ఒకేలా కూడా ఉండవు. తాజాలు మాజీలవుతారు. మాజీలు మరోసారి తెరపైకి వస్తారు. అయితే ఇవి అందరికీ తెలిసిన విషయాలే కానీ.. ఏపీలో మాత్రం అధికారం శాశ్వతమన్నట్టుగా పాలకులు భావిస్తున్నారు. అధికార మదంతో విర్రవీగుతున్నారు. రాజ్యాంగం ప్రకారమే తమకు అధికారం దఖలు పడినా.. అదే రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారు. చట్టాలను అగౌరవపరుస్తున్నారు. తమకు అడ్డునిలిచేదెవరు? అన్నట్టు బరితెగించి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఏపీ పాలకులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరం. వారి నిర్ణయంలో నిజాయితీ లేదు. ప్రజాస్వామ్యం అంతకంటేనూ లేదు. అంతా స్వార్థమే కనిపిస్తోంది. ఆధిపత్య ధోరణి స్పష్టంగా దర్శనమిస్తోంది. తప్పుడు ప్రకటనలు, తప్పుడు నిర్ణయాలతో ఏదో చేయాలనుకున్నారు. కానీ ముందడుగు వేయలేకపోతున్నారు. ఎదురు దెబ్బలు తగులుతున్నా గుణపాఠంగా భావించడం లేదు. అదే ధోరణితో ముందుకు సాగుతున్నారు. దానికి కారణం అధికార మదం. చేతిలో అధికారం ఉంది కదా అని వెనుకా ముందూ చూడడం లేదు. ఏదో రోజు అధికారం దూరమవుతుందన్న నిజం తెలియక భ్రమలో బతుకుతున్నారు. రాష్ట్ర ప్రజలను అదే భ్రమల్లో మంచుతున్నారు. రాష్ట్ర భవిష్యత్ ను అంధాకరంలో పెడుతున్నారు.

మూర్ఖపు ఆలోచనలు..
పాలించే వాడు మూర్ఖుడైతే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఆ సీన్ ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అనాలోచిత నిర్ణయాలు, పగలు, ప్రతీకారాలు అంటూ తీసుకుంటున్న నిర్ణయాలు ఫైనల్ గా ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అమరావతి రైతులు చేసిన తప్పేమిటి? స్వచ్ఛందంగా తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడమా? ఏపీ రాజధానిలో తాము భాగస్థులవుతామని భావించి వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆలోచించారు. కనీసం వారి త్యాగాలను కూడా గౌరవించలేదు. లేనిపోని ప్రచారం చేసి వారి త్యాగాలను ఎగతాళి చేశారు. కమ్మకులమంటూ ముద్రవేసి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారిలో కర్కశం నింపే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల భ్రమలు తొలగుతున్నాయి. వెయ్యి రోజుల అమరావతి రైతుల కన్నీరు వ్యధ ఇప్పడిప్పుడే అందరికీ తెలుస్తోంది.
ముందడుగేదీ?
అమరావతి రైతులకు ఉన్న నిష్ట, పట్టుదల కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. అమరావతి ఏకైక రాజధానికి మద్దతుగా 1000 రోజులుగా రైతులు ఉద్యమబాట పడితే…జగన్ సర్కారు మాత్రం మూడు రాజధానులకు మద్దతుగా ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది. అదే సమయంలో అమరావతికి మద్దతు పెరుగుతోంది., దాని ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కారు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలిపిందన్న అపవాదు మూటగట్టుకుంది. చట్టంలో మాండమస్ ఉత్తర్వులు కీలకమైనవి. శాసనంలాంటివి. అమరావతి విషయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మాండమస్ ఉత్తర్వులను జారీచేసిందంటే ఇక అదే ఫైనల్. కానీ ఏపీ పాలకులు మాత్రం దీనిని గుర్తెరగక మూడు రాజధానులు ఏర్పాటుచేసి తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు. మద్దతుగా బిల్లు పెడతాం.. దమ్ముంటే అడ్డుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. ఇదంతా అధికార మదంతో చేస్తున్నవే తప్ప.. వాస్తవాలను తెలుసుకొని కాదు. ఇంతవరకూ తాము ఎందులో సక్సెస్ కాలేకపోయామని తెలిసినా..ఇప్పటికీ అవే మోసపూరిత మాటలతో గడిపేస్తున్నారు.

మోదీ అంతటి వారే తగ్గారు…
అమరావతి రైతుల పోరాడం న్యాయబద్ధమైనది. అది ఎవరూ కాదనలేని నిజం. ప్రపంచంలో రైతు పోరాటాలేవీ విఫలం కాలేదు. కేంద్ర సాగు చట్టాల విషయంలో కూడా ఇది నిరూపితమైంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సాగుచట్టాల విషయంలో దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన లభించింది. కానీ తమకు అన్యాయం జరుగుతుందని రైతులు భావించారు. పోరు బాట పట్టారు. సుదీర్ఘ కాలం ఆందోళన చేశారు. అయితే ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించిన ప్రధాని మోదీ సర్కారు తరువాత వెనక్కి తగ్గారు. సాగు చట్టాలను రద్దు చేశారు. ప్రపంచంలోనే శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా ఉన్న ప్రధాని రైతుల నుంచి పెల్లుబికిన ఆగ్రహం చూసి వెనక్కి తగ్గారు. అటువంటిది ఏపీ సీఎం జగన్ కానీ.. మంత్రులు కానీ ప్రధాని మోదీ కంటే శక్తిమంతులు కారన్న విషయం గుర్తించుకోవాలి. అధికార మదాన్ని పక్కకు తీసి వాస్తవ పరిస్థితిని గ్రహించాలి. లేకుంటే అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోయేందుకు కారకులవుతారు. తాము మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు.