Rahul Gandhi Marriage: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులో జరగాలి. ఇందులో ఏ మాత్రం కాస్త అటూ ఇటూ అయినా అంతే సంగతులు. అందుకే బెండకాయ ముదిరినా.. బ్రహ్మచారి ముదిరినా ఉపయోగముండదని ఒక సామెత పుట్టింది. ఇలా ముదరడం వల్ల ఏ ఏ పనులకు పనికి రాకుండా పోతారనే విషయంలో ఎవరూ జాబితా కట్టి వివరాలు చెప్పలేదు. కాకపోతే బ్రహ్మచారి ముదురుతున్నా కొద్దీ అతనికి బంధుమిత్ర పరిచయ వర్గాల కూటమిలో తరచూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ” ఏం బాబూ.. పెళ్లెప్పుడు” అని తెలిసిన వారంతా ప్రశ్నిస్తూ ఉంటారు. అదే కొత్తవారు పరిచయమైతే ఎందరు పిల్లలు అని అడిగితే ఇక చాలా ఇబ్బందే. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు పెళ్లి మాట వినగానే సిగ్గుల మొగ్గ అవుతారు. ఆ ప్రశ్న నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడతారు. మామూలు బ్రహ్మచారులే కాదు.. మనదేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరయిన రాహుల్ గాంధీ అయినా సరే.. పెళ్లి ప్రస్తావన వస్తే సిగ్గుతో చిరునవ్వులు చిందిస్తాడు. సూటిగా మాట్లాడేందుకు తడబడిపోతాడు.

ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడు
రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం తమిళనాడులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో మేధావులు, సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో ముచ్చటిస్తున్నారు. వారితో మాటల అనంతరం దారిలో ఒక పొలంలో పనిచేస్తున్న కూలీలతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా ఒక మహిళా కూలీ లేచి ” రాహుల్ జి.. ఇంతకీ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు” అని అడిగింది. దీంతో ఒక్కసారిగా రాహుల్ గాంధీ మౌనం వహించారు. సిగ్గు పడిపోయారు. ” మా తమిళనాడులో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. మీకు అలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత మేము తీసుకుంటామని” ఆ మహిళ కూలి చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. “ఈ విషయం పై రాహుల్ గాంధీ వినోదించారని” కాంగ్రెస్ నాయకులు జై రాం రమేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

కర్ణాటకలోనూ..
ఇటీవల కర్ణాటకలోనూ ఇదే ప్రశ్న రాహుల్ గాంధీకి ఎదురయింది. ” అవును ఈ ప్రశ్నకు చాలా తరచుగా ఎదురవుతూ ఉంటుంది. మీరు మాత్రమే కాదు. మల్లికార్జున ఖర్గే వంటి వారు కూడా నన్ను తరచుగా ఇదే అడుగుతూ ఉంటారని” రాహుల్ నవ్వుల మధ్య సమాధానం ఇచ్చారు. తమిళనాడులో, కర్ణాటకలో పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతున్నా సరైన సమాధానం రాహుల్ గాంధీ నుంచి రాలేదు. బ్రహ్మచారి ముద్ర అనేది ప్రధానమంత్రి కూర్చునేందుకు దగ్గర దారి అని ఆయన విశ్వసిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేసిన తర్వాత చాలామంది యువకులు “సోలో బతుకే సో బెటరు” అని అర్థం వచ్చేలా కామెంట్లు చేయడం గమనార్హం