High Court On Schools: కరోనా కల్లోలంతో ఏడాదిన్నరగా చదువులు అటకెక్కాయి. విద్యార్థులంతా ఆన్ లైన్ చదువుల పేరట కళ్లు కాయలు చేసుకుంటున్నారు. అర్థం కాక.. మైండ్ హీటెక్కి నానా అగచాట్లు పడుతున్నారు. పెద్దలకు టీకాలు వేసినా.. ఇంకా పిల్లలకు టీకాలు అందుబాటులోకి రాలేదు. దీంతో చదువులు ప్రారంభం అవుతాయా? లేవా? అన్న ఉత్కంఠ నెలకొంది.
అయితే తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసింది. అంగన్ వాడీ పిల్లల నుంచి పీజీ విద్యార్థుల వరకూ అన్నింటిని తెరవాలని స్పష్టం చేసింది. తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన చేపట్టాలని ఆదేశించింది.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలను ప్రారంభించాలంటూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైదరాబాద్ కు చెంది ఎం బాలక్రిష్ణ ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఈ ఉత్తర్వులు జారీ చేశారని.. కోవిడ్ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బాలక్రిష్ణ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్ లైన్, ప్రత్యక్ష బోధనపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారంలోపు మార్గదర్శకాలను జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని సూచించింది.
ప్రత్యక్ష బోధనకు ఖచ్చితంగా హాజరు కావాలంటూ విద్యార్థులను బలవంతం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. తరగతులకు హాజరు కాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతుల నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేవించింది. ఇక గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. వసతగృహాలు ఏవి తెరవవద్దని ఆదేశించింది.