Jharkhand: దేశంలో ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీలు దుమారం రేపుతున్నాయి. పరీక్ష ఏదైనా ప్రశ్నపత్రం లీక్ చేయడమే లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో దీనిని కొందరు మంచి కోసం కాకుండా చెడు కోసం వినియోగిస్తున్నారు. దీంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. టెక్నాలజీ ఉపయోగించే ఇప్పటి వరకు ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. మొన్నటి నీట్ పేపర్ కూడా ఇలాగే లీక్ అయింది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో జేజీజీఎల్పీసీఈ పరీక్ష వేళ.. ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేయాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
రెండు రోజులు పీక్షలు..
జార్ఖండ్‌లో శని, ఆదివారాల్లో జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (జేజీజీఎల్సీసీఈ) పరీక్షలు జరగనున్నాయి. పోటీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు రోజుకు ఐదు గంటల చొప్పున నిలిపివేయాలని నిర్ణయించింది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.
823 పరీక్ష కేంద్రాలు..
జేజీజీఎల్పీసీఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 823 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ పరీక్షకు సుమారు 6.39 లక్షల మంది హాజరుకానున్నారు. పరీక్షల్లో అవకతవకలు నివారించేందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. పరీక్షల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హేమంత్‌సోరెన్ హెచ్చరించారు.