TDP Janasena Alliance: టిడిపి,జనసేన మధ్య అప్పుడే జగడం ప్రారంభమైంది. ఇంకా సీట్ల సర్దుబాటు కాకముందే..రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇందుకు ఇరు పార్టీల సమన్వయ సమావేశాలు వేదికగా మారుతున్నాయి. రచ్చ రచ్చకు దారితీస్తున్నాయి. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో రెండు పార్టీల నేతల మధ్య మాటలు పెరిగి.. కొట్టుకునే స్థాయి వరకు వచ్చింది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత ఈజీ కాదని తేటతెల్లమైంది. మున్ముందు ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించదని చాలామంది ఆశించారు. ముఖ్యంగా జనసేనలోని ప్రో వైసిపి నాయకులు పొత్తును బాహటంగానే వ్యతిరేకించారు. కొందరు అధినేతను విమర్శిస్తూ పార్టీని వీడారు. మరికొందరు డైలమాలో పడ్డారు. ఇంకొందరు అయిష్టంగానే పొత్తుకు సమ్మతించారు. కానీ ఇప్పుడు సమన్వయ కమిటీ సమావేశాల పుణ్యమా అని.. తమలోనున్న ఫ్రస్టేషన్ను బయట పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమన్వయ కమిటీల సమావేశాలు సజావుగా జరుగుతున్నా.. ఉభయగోదావరి జిల్లాల్లో విభేదాలు వెలుగు చూస్తుండడం విశేషం.
పిఠాపురం నియోజకవర్గంలో సమన్వయ కమిటీ సమావేశం రచ్చకు దారితీసింది. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ వర్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు. దీనిపై జనసేన ఇంచార్జ్ తంగేళ్ల ఉదయశ్రీనివాస్ మాట్లాడుతూ.. అదే నిజమైతే మీరు ఎందుకు ఓడిపోయారని? ఈసారి జనసేనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని చెప్పారు. దీంతో ఒక్కసారిగా టిడిపి ఇన్చార్జ్ వర్మ రెచ్చిపోయారు. మీ నాయకుడు రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ ఎద్దేవా చేశారు. పిఠాపురంలో జనసేనకు 35000, టిడిపికి 75000 ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తించుకోవాలని సవాల్ చేశారు.దీంతో ఇరువర్గాలు మధ్య వాగ్వాదం జరిగింది. కుర్చీలతో కొట్టుకునే స్థాయికి చేరుకుంది. దీంతో జనసేన నాయకులు అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు.
అయితే పిఠాపురం ఏ కాదు ఉభయ గోదావరి జిల్లాల్లో.. ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఉదారతను తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకుంటుందని.. మెజారిటీ నియోజకవర్గాలు జనసేనకు కేటాయించకుంటే సహకరించేది లేదని ఆ పార్టీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. మెజారిటీ సీట్లు తమకు కట్టబెట్టాలని సంకేతాలు పంపుతున్నాయి. అయితే ఇప్పటికే రెండు పార్టీల నాయకత్వాలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. పొత్తును విఘాతం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేశాయి. అలా చేస్తే అది వైసీపీకి లాభిస్తుందని.. అందుకే రెండు పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరాయి. అందుకు తగ్గట్టుగానే టిడిపి, జనసేన సమన్వయ కమిటీల జగడాలను వైసీపీ సోషల్ మీడియా హైలెట్ చేస్తోంది. పొత్తుపై దుష్ప్రచారం ప్రారంభించింది. దీనిపై టిడిపి, జనసేన నాయకత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.