Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారింది. ఒకవైపు అధికార టీఆర్‌ఎస్‌తోపాటు, స్వపక్షంలోని సీనియర్లతో పోరాటం చేస్తున్న రేవంత్‌రెడ్డి భవితవ్యం ఉప ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇది. గతేడాది హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుయ్యారు. అయితే ఆ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్‌ను తీవ్ర నిరాశపర్చింది. అయితే అది టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో మనది కాదులే అని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మునుగోడు సీటు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. ఒకవైపు అధికార టీఆర్‌ఎస్, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ముక్కోణపు పోటీ ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో కానీ.. కాంగ్రెస్ అధ్యక్షుడి భవితవ్యం మాత్రం తేల్చడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.

స్వపక్షంపై పోరాడుతూ…
తెలంగాణలో ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుల్లో పదవిలో ఉన్న కేసీఆర్ తర్వాత పదవి, అధికారం లేని రేవంత్‌రెడ్డి రెండో స్థానంలో ఉంటారు. ఆయన చాలా వ్యతిరేక శక్తులపై పోరాటం చేయాల్సి ఉంది. అన్ని పార్టీలతోపాటు సొంత పార్టీ టార్గెట్ కూడా ఆయనే. పార్టీకి భారంగా మారిన సీనియర్లు.. ప్రజల్లో పలుకుబడి లేని నేతలు ఇప్పుడు రేవంత్‌పై దండెత్తుతున్నారు. ఠాగూర్, రేవంత్‌రెడ్డి వ్యూహకర్త సునీల్ కనుగోలుపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. మునుగోడులో పార్టీ మారుతున్న వారంతా కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వారే పార్టీ నుంచి ఇతర పార్టీలకు పంపిస్తున్నారని భావిస్తున్నారు. అందుకే రేవంత్‌రెడ్డి స్వయంగా మునుగోడులో మకాం వేయాలని నిర్ణయించుకున్నారు.
అభ్యర్థి ఎంపికే సవాల్..
మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక టీపీసీసీ చీఫ్‌కు సవాల్‌గా మారింది. నల్లగొండలో పెద్దారెడ్లుగా చెప్పుకుంటూ పార్టీ మీద సవారీ చేస్తున్న నేతలు ఇప్పుడు మునుగోడులో కనిపించడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఆ పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. రేవంత్‌తో ఢిల్లీలో మళ్లీ కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులివ్వడాన్ని ఆ పార్టీ నేతలు నమ్మడం లేదు. కాంగ్రెస్‌లో ఉంటూ తమ్ముడి గెలుపు కోసం ఆయన పనిచేస్తారని అనుమానిస్తున్నారు. ఆయనకు ఎలాంటి బాధ్యతలిచ్చినా నమ్మలేని పరిస్థితి. ఈ క్రమంలో మునుగోడులో రేవంత్‌రెడ్డి లీడ్ తీసుకుంటున్నారు. ఆయన అక్కడే మకాం వేసి ఎన్నికలను టార్గెట్ చేస్తే.. అది ప్లస్ అయినా మైనస్ అయిన రేవంత్‌కే వస్తుంది. అయితే ఆయన బీజేపీ, టీఆర్‌ఎస్‌తో మాత్రమే కాదు.. సొంత పార్టీ కాంగ్రెస్ నేతలందరితో పోరాడాలి. ఎందుకంటే కాంగ్రెస్‌ను ఓడించేందుకు వారు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తారు. అందులో సందేహం లేదు.
గట్టెక్కేందుకు వ్యూహాలు..
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి 2023లో జరిగే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రాబోకేది తామే అనే సంకేతం ప్రజల్లోకి పంపాలని అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోపాటు బీజేపీ భావిస్తున్నాయి. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో టీపీసీసీ చీఫ్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం ప్రియాంక గాంధీ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అభ్యర్థి ఎంపిక నుంచి ఓటర్లను తమవైపు ఎలా తిప్పువోవాలి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ ఆర్థికంగా కొంత వీకే. అయినా ఆ రెండు పార్టీలకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో రేవంత్ పని చేస్తున్నారు.

లక్ష కోట్ల టార్గెట్..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మునుగోడులో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సుమారు 90 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో నియోజకవర్గంలో లక్ష ఓట్లు సాధించడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ కార్యచరణ ప్రకటించారు. ఈమేరకు పార్టీ క్యాడర్ నుంచి లీడర్ వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష మంది కాళ్లు మొక్కి ఓట్లు అడగాలని నిర్ణయించారు. తద్వారా సానుభూతితోపాటు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడతాయని రేవంత్ భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాజగోపాల్‌రెడ్డి మొన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినందున గ్రామీణ ఓటర్లు, రాజగోపాలరెడ్డికి ఓటు వేయాలని భావిస్తున్నవారు హస్తం గుర్తుకే ఓటు వేస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. రాజగోపాల్‌రెడ్డి కొత్త గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం అంత సులభం కాదన్న భావనలో హస్తం పార్టీ ఉంది. ఇది తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రేవంత్‌రెడ్డి భవితవ్యాన్ని తేల్చడం మాత్రం ఖాయమని సొంత పార్టీ నేతలతోపాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.