Italian Government: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చూసి చూడంటారు పెద్దలు. ఇంటి నిర్మాణం అనేది ఇప్పుడు ఒక గుది బండే. పెరిగిన భూముల ధరలు, భవన నిర్మాణ సామగ్రితో ఇల్లు కట్టడమంటే కత్తిమీద సామే. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ సాయంపైనే ఆధారపడతారు. ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చి రుణం కింద సాయం చేస్తేనే మొగ్గుచూపుతారు. లేకుంటే ఇల్లు కట్టడమనేది వారికి మహా క్రతువే. ప్రభుత్వ సాయానికి తోడు కొంత పొదుపు చేసుకున్న మొత్తాన్ని పెట్టుబడి పెడితే కానీ ఇంటికి తుది రూపం రాదు. అటు ప్రభుత్వం అందించే సాయం ఉడతా భక్తిగా ఉంటుందే తప్ప పూర్తిచేయడానికి ఏ మూలకూ సరిపోదు. కానీ మేం ఫ్రీగా డబ్బులిస్తాం.. ఇల్లు కట్టుకోండి అంటూ పేదలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది ఇటలీ ప్రభుత్వం. మద్యదరా సముద్రంలోని అతిపెద్ద సార్డీనియా దీవి ప్రస్తుతం ఇటలీ ఆధీనంలో ఉంది. చుట్టూ సముద్రం, ఎత్తైన కొండలతో చూడముచ్చటగా ఉంటుంది ఈ అందాల దీవి. ముగ్ధ మనోహరంగా ఉంటుంది. కానీ ఇక్కడ జన సంద్రత చాలా తక్కువ. అందుకే ఇక్కడ నివసించే వారి సంఖ్య పెంచేందుకు ఇటలీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

రూ.12 లక్షల సాయం…
ఈ అందాల దీవిలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకుంటే ఇటలీ ప్రభుత్వం 15 వేల యూరోలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంటే అక్షరాలా రూ.12 లక్షలన్న మాట. ఈ దీవిలో స్థిరపడాలనుకునే వారికి సాయం అందించేందుకు ఇటలీ ప్రభుత్వం ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటుచేసింది. ఇందుకు45 మిలియన్ యూరోలను కేటాయించింది. అంటే ఇండియన్ మనీ ప్రకారం అక్షరాలా రూ.365 కోట్లు అన్నమాట. అద్భుతంగా ఉన్న ఈ దీవిలో చాలా గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. కానీ జనాభా సంఖ్య పెరగడం లేదు. స్థిర నివాసం ఏర్పాటుచేసుకునే వారు కరువయ్యారు. దీంతో ఇటలీ ప్రభుత్వం ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకునే వారి సంఖ్యను పెంచే యోచనలో ఉంది. అందుకే ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఆ షరతుతోనే…
ఈ ఆఫర్ కు ఒక షరతు పెట్టారు. ఈ దీవిలోని ఏదైనా పట్టణం, గ్రామంలో ఇల్లు కట్టించుకోవడంతో పాటు ఉన్న ఇంటికి మరమ్మతులు చేసుకోవడానికి మాత్రమే సాయం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అటు నిధులు దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంది. దీనికి ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను, సిబ్బందిని కూడా నియమించుకుంది. చూడచక్కటి వాతావరణం సొంతం చేసుకున్న దీవిలో సొంతింటి కల సాకారానికి చాలామంది వస్తున్నారు. జనసాంద్రత పెంచుకునేందుకు ఇటలీ ప్రభుత్వం పడుతున్న ప్రయాస ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే చాలామంది కుభేరులు సైతం ఈ అందాల దీవిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తున్నట్టు ఇటలీ ప్రభుత్వం చెబుతోంది. .