
‘100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి దెబ్బతీయాల్సిన పనిలేదని.. కాంగ్రెస్ నేతలే దెబ్బతీసుకుంటారని’ రాజకీయ వర్గాల్లో ఓ ఫేమస్ సామెత ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశంలో.. రాష్ట్రంలో అసలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఉందా అన్న అనుమానం సగుటు నాయకుల్లో నెలకొంది.. కరోనా-లాక్ డౌన్ ఏ కాంగ్రెస్ నాయకుడు బయటకు రావడం లేదు. సహాయక చర్యల్లో పాల్గొనడం లేదు. అందరూ సుబ్బరంగా ఇంట్లోనే ఉంటున్నారు. కలిసి వచ్చిన సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం మౌనంగానే ఉంది. అలా కష్టకాలంలో ప్రతిపక్షాలు ఉనికే లేకుండా పోయిన వైనం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
*ఎవ్వరికీ పట్టని తెలంగాణ కాంగ్రెస్.?
తెలంగాణ కాంగ్రెస్ లో దిగ్గజ నేతలంతా ఏమై పోయారని క్షేత్రస్థాయి నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో హుజూర్ నగర్ ఓటమి తర్వాత పీసీసీ చీఫ్ ను మార్చడానికి అధిష్టానం ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. రేవంత్ రెడ్డి అందరికంటే ముందు వరుసలోకి వచ్చారు. కానీ ఆయన కాకుండా సీనియర్లు అడ్డుపడ్డారు. ఇంతలో కరోనా వచ్చింది. పీసీసీ మార్పు అటకెక్కింది. ఇక తనకు పీసీసీ పీఠం ఇవ్వని కాంగ్రెస్ పై అలిగి రేవంత్ ఇంట్లోనే లాక్ డౌన్ లో చికెన్ చేసుకుంటూ పుస్తకాలు చదువుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఫైర్ బ్రాండ్ నేత కనీసం టీవీ డిబేట్లు, ఫోన్ ఇన్ లకు కూడా రావడం లేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్యే రైతులపై ప్రేమ ఒలకబోస్తూ కాస్త యాక్టివ్ అయ్యారు. కరోనా విషయంలో ఏమాత్రం చురుకుగా వ్యవహరించలేదు. ఇప్పటికీ పట్టించుకోవడం లేదు..
Also Read: జగన్ తో దోస్తీ.. తెలంగాణ జలాలకు కేసీఆర్ మంగళం!
*ఏపీలో కాంగ్రెస్ ఉందా?
ఏపీలో పీసీసీ చీఫ్ గా రఘువీరా వైదొలిగాక శైలజనాథ్ ను కొత్త చీఫ్ ను చేశారు. అంతలోనే కరోనా వచ్చింది. అస్సలు ఏపీలో కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది. శైలజనాథ్ ఎక్కడా బయట కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతలు కూడా కాలు బయటపెట్టడం లేదు. దీంతో కాంగ్రెస్ పేరే ఏపీలో వినిపించడం లేదంటే నమ్మండి..
*దేశంలోనూ అదే పరిస్థితి?
దేశంలోనూ కాంగ్రెస్ ఉందా అంటే ఉన్నట్టు ఉంది. రాహుల్ గాంధీ మాత్రమే అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ లు చేస్తూ కరోనాపై ప్రధానికి సూచనలు ఇస్తూ సందడి చేస్తున్నారు. సోనియా గాంధీ ఈ మధ్య వలసకార్మికుల పరిస్థితిపై స్పందించారు. అయితే వీరిద్దరూ తప్పితే ఏ కాంగ్రెస్ నేత కూడా కరోనా విషయంపై ఇంతవరకు స్పందించిన పాపాన పోలేదు..
*యథా కాంగ్రెస్.. తథా నేత
యాథా రాజా.. తథా ప్రజ అన్నట్టు కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని ఓటములు ఎదురైనా అదే సీనియర్లు, పాత చింతకాయపచ్చడి నేతలతోనే కాలం గడుపుతోంది. వేగవంతమైన నిర్ణయాల్లో పుష్కరకాలం లేట్ చేస్తూ కాంగ్రెస్ యువ నేతలు, కార్యకర్తలు ఉత్సాహాన్ని దూరం చేస్తోంది. ఫైర్ బ్రాండ్ లాంటి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఆలస్య రాజకీయాలకు సైలెంట్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ లాంటి మహాసముద్రంలో రేవంత్ లాంటి పిల్లకాలువలు కలవాల్సిందే కానీ.. ఆ సముద్రాన్ని కదిలించలేరు.. అని ఇప్పటికీ అర్థమైంది..
-నరేశ్ ఎన్నం