AP Volunteers: వలంటీరుపై వేటు పడింది. బూత్ లెవెల్ ఆఫీసర్ విధుల్లో జోక్యం చేసుకున్నందుకు బయ్యా రెడ్డి అనే వలంటీర్ పై వేటు వేశారు. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం తనకల్లు సచివాలయం 3లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
తనకల్లు సచివాలయం 3 పరిధిలోని దుగునేపల్లిలో బి ఎల్ ఓ ప్రియాంక, ఇంజనీరింగ్ సహాయకులు ఓటర్ జాబితాను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో వాలంటీర్ బయ్యా రెడ్డి వారి విధులకు ఆటంకం కలిగించారు. పరిశీలన పేరుతో వారి వద్దనున్న ఓటర్ జాబితాను బలవంతంగా తీసుకున్నారు. దీనిపై సదరు బి ఎల్ ఓ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి.దీనిపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. తక్షణం వలంటీర్ పై చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించింది. ఈ మేరకు బయ్యా రెడ్డి ని విధులను తొలగిస్తూ పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో వాలంటీర్లకు ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని.. ఓటర్ల జాబితా అంశం లోను చేతివాటం చూపిస్తున్నారని విపక్షాల ఆరోపిస్తూ వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఓటర్ జాబితా పరిశీలనలో ఎక్కడికి అక్కడే వలంటీర్లు పాల్గొన్నారు. దీనిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వాలంటీర్ పై వేటుపడడం విశేషం. దీంతో వాలంటీర్ల పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.