
Zombie Drug : జాంబీ డ్రగ్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మేం జాంబీ సినిమాలు తప్ప.. జాంబీ డ్రగ్ పేరు వినలేదంటారా.. అయితే ఇప్పుడు మేం మీకు తెలియని ఈ డ్రగ్ గురించి, ఇది కలిగిస్తున్న ఉత్పాతాల గురించి మీకు చెప్పబోతున్నాం. ఏహే పోండి మీరేదో లేనిపోనిది చెబుతారు.. మమ్మల్ని భయపెడతారు అనుకుని ఈ కంటెంట్‌ను స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీరు అప్రమత్తం కావాల్సిన సందర్భం కూడా ఇది..
జాంబి డ్రగ్‌గా నామకరణం చేశారు.
సాధారణం మనం డ్రగ్ ఎందుకు వాడతాం? నొప్పిని నివారించేందుకు, లేదా నొప్పి బాధ శరీరానికి తెలియకుండా ఉండేందుకు.. కొత్త ఒక చింత, పాత ఒక రోత అన్నట్టుగా మనుషులు ఇతర డ్రగ్స్‌ను కనిపెట్టారు. అవి మత్తు కలిగించేవి. ఉన్మత్త లోకంలో శరీరాన్ని విహరింపజేసేవి. అయితే రాను రాను డ్రగ్స్‌లో కొత్త కొత్త రకాలు వెలుగులోకి వచ్చాయి. అంటే ఎంత కొత్త రకం మార్కెట్‌లోకి వస్తే అంత ఎక్కువ మోతాదులో మత్తు ఇస్తుందన్న మాట. గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎపిడ్రిన్.. ఇప్పటి వరకూ మనం రోజూ పేపర్‌లో, న్యూస్ చానెల్స్‌లో చదువుతున్న, చూస్తున్న డ్రగ్స్ ఇవే. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇవేవీ కిక్ ఇవ్వడంలేదో, లేక ఇవి ఇచ్చే కిక్ సరిపోవడం లేదో తెలియదు కానీ కొత్త రకం డ్రగ్‌ను కనిపెట్టారు. దానికి జాంబి డ్రగ్‌గా నామకరణం చేశారు.
ఏంటి ఈ జాంబి డ్రగ్?
ఈ డ్రగ్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తక్కువ ధరలో దొరికే ఈ డ్రగ్ మనుషులను పిశాచులు చేస్తోంది. చదువుతుంటే మీకు విస్మయం కలుగుతోంది కదూ! జాంబీ డ్రగ్, ట్రాంక్, ట్రాంక్ డ్రోప్.. వీటిఅన్నింటికీ మూలం జిలాజైన్. ఈ జిలా జైన్‌ను గుర్రాలు, ఆవుల కోసం తయారు చేశారు. ఇది వాటికి నొప్పి తెలియకుండా చేసేందుకువాడతారు. అవి ఎప్పుడైనా గాయపడినప్పుడు, లేదా ప్రమాదానికి గురైనప్పుడు వాటికి చికిత్స అందించే క్రమంలో వినియోగిస్తారు. దీనిని వాడటం వల్ల అవి ఎక్కువ సేపు నిద్రలోకి జారుకుంటాయి. ఇప్పుడు ఈ ఔషధాన్ని మనుషులు తీసుకుంటున్నారు. అది కూడా ఎక్కువ మోతాదులో.
ఏమవుతుంది?
జాంబి డ్రగ్ అధిక మోతాదులో తీసుకుంటే శరీరం మత్తులో జోగుతుంది. అడుగులు ముందకు వేయాలంటే కాళ్లు సహకరించవు. చేతులు నీరసించిపోతాయి. అదే పనిగా తీసుకుంటే చర్మం తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. పైగా పుండ్లు ఏర్పడి మరణం సంభవిస్తుంది. ఈ డ్రగ్ తీసుకునేవారు పిశాచుల్లాగా మారిపోతారు. ఎప్పుడూ నిద్రలో ఉండటం వల్ల శరీరంలో ఉన్మత్త లోకంలో విహరిస్తూ ఉంటుంది. పైగా ఈ డ్రగ్ లేకుంటే నిమిషం కూడా ఉండలేరు. నాడి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఈ డ్రగ్ మనిషి నిశ్ఛేష్టుడిని చేస్తుంది. ఇక 2021లో న్యూయార్క్‌లో ఈ జాంబి డ్రగ్‌ను తీసుకున్న 2,668 కన్ను మూసినట్టు తెలుస్తోంది. ఫిలడెల్ఫియాలో 2021లో ల్యాబ్ టెస్ట్ చేసిన డ్రగ్ శాంపిల్‌లో 90 శాతం జాంబి డ్రగ్ ఉందట. ఫిలడెల్ఫియా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో ఆ తర్వాత లాస్‌ఏంజిలస్.. ఇలా మెల్లగా ఈ డ్రగ్ వాడకం పెరిగిపోతోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్థులు ఎక్కువగా ఈ డ్రగ్ వాడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ డ్రగ్ ను విస్తరించకుండా చర్యలు తీసుకోని పక్షంలో ప్రపంచం అతాలకుతలం అవుతుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది.